సాయంకాలపు నీరెండ గుడిసె చిల్లుల్లోనుండి అక్కడక్కడా పడుతుంది. పొయ్యిదగ్గర కూర్చుని గంజి వారుస్తున్న నాగమల్లి గుడిసెకున్న చిల్లుల్ని లెఖ్ఖపెడుతోంది.‘ఎండకేకానీ.. వానొస్తే ఎందుకూ పనికిరాదు ఈ కొంప.’ మనసులో అనుకుంది. మేడలు, మిద్దెలు కట్టుకోవటానికి అయ్య దగ్గర డబ్బులేదుగా. పదహారేళ్ళుగా నాగమల్లికి యిపడిపడే లోకం అర్థమవుతుంది.అమ్మ కాలమ్మ, అయ్య రాజయ్య కూలిపనులకు పోతారు. వచ్చే కూలిడబ్బులతో అమ్మ అయ్య తమ్ముడు, తను బతకాలి. తమ్ముడు సూరీడు బడికిపోతాడు. ఐదోతరగతి వరకూ చదివిన నాగమల్లి యింటిపనులు చేయటానికి బడి మానేసింది.పొయ్యి మీదనుండి అన్నంకుండ దించి పపసట్టిపెట్టింది. పపపులుసు వండితే సరిపోతుంది అనుకుంటూ మూలనున్ను చీపురు తీసి యిల్లు శుభ్రంగా ఊడ్చింది. దీపంగ్లాసు శుభ్రం చేస్తూ ఆలోచిస్తుంది. యింటి పరిస్థితులు తనకి తెలుసు కాబట్టి మేడలు, మిద్దెలు, కారులు అలాంటి కోరికలు తనకేమీ లేదు. కానీ పదిరోజుల క్రితం రాజ్యం కాళ్ళకున్న వెండి పట్టాలు పదేపదే గుర్తుకొస్తున్నాయి.

రాజ్యం తన కాళ్ళవైపు చూపిస్తూ ‘‘ఒసే నాగమల్లీ మా అన్నయ్య పట్నంనుండి పండక్కి నాకీ పట్టాలు తెచ్చాడు. నువ్వు కూడా మీ అయ్యకు చెప్పి వెండి పట్టాలు కొనిపించుకోవే నీ కాళ్లకు చాలా బాగుంటాయి.’’ అని సంబరంగా చెప్పింది. రాజ్యం, తనూ చాలా స్నేహంగా ఉంటారు. తమకి నాలుగిళ్ళవతలే వాళ్ళిల్లు. ‘అయ్య వచ్చిన తర్వాత వెండిపట్టాలు కొనిపెట్టమని అడగాలి’ అనుకుంటూ పని ముగించింది. ఆటల కెళ్ళిన సూరీడు ‘‘అక్కా ఆకలేస్తంది. అన్నంపెట్టు’’ అంటూ వచ్చాడు.దీపం ఒత్తి పెద్దది చేసి ఆడికి అన్నం పెట్టి పొంతకాగులో నీళ్ళుపోసి పొయ్యి ఎగదోసి వచ్చికూచుంది. ఈలోపు అమ్మ, అయ్య రానేవచ్చారు. వాళ్ళిద్దరి స్నానాలూ అయ్యేటప్పటికి సూరీడు నిద్రపోయాడు. వాడికి మెడవరకూ దుప్పటికప్పి ముగ్గురికీ అన్నాలు పెట్టింది.రాజయ్య ఎంగిలి చెయ్యి కడుక్కుంటూ ‘‘మల్లెమ్మా పపపులుసు బాగుంది.’’ మెచ్చుకుంటూ అన్నాడు.‘‘అదేం వండినా రుసిగానే ఉంటది’’ అంటూ అమ్మ పళ్ళాలు కడగటానికి వెళ్ళింది.యిదే మంచి సమయం అనుకొని వెళ్ళి అయ్య పక్కలో కూచుంది. నాగమల్లి.