బేగంపేట విమానాశ్రయం ఇంటర్నేషనల్‌ అరైవల్స్‌ నుంచి లగేజీ ట్రాలీ తోసుకుంటూ బయటికి వచ్చాడు డాక్టర్‌ డి.జె. అమెరికాలో స్థిరపడ్డ అతని పేరు ధనంజయ. చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమైన మెడికల్‌ కాన్ఫరెన్స్‌ కోసం స్వదేశానికి వచ్చాడు. తాను పుట్టి పెరిగిన దేశమే అయినా అతనికి ఇక్కడి వాతావరణం సరిపడనట్టుగా వుంది. ఎయిర్‌పోర్టు బయటికి వచ్చిన కొద్ది క్షణాల లోపే ఎండతాకిడికి అతని ముఖం ఎర్రబారింది. ఒంటికెక్కడ ధూళి సోకుతుందేమోనని భయపడుతున్నట్టున్నాడు.ఇక్కడి గాలి పీలిస్తే ప్రమాదమన్నట్టుగా జేబు రుమాలు ముక్కుకి అడ్డంగా పెట్టుకున్నాడు. ఇంతలో తాజ్‌గ్రూప్‌ వారి స్వాగతం ప్లకార్డ్‌తో డాక్టర్‌ డి.జె. కోసం కారు వచ్చి ఆగింది. తనకోసం వచ్చిన ఆ బెంజ్‌ని చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్టయింది అతనికి. యూనిఫాంలో ఉన్న డ్రైవర్‌ డోర్‌ తెరిచి పట్టుకున్న ఆ కార్లోకి ఎక్కబోతుంటే ‘ధనూ’ అన్న పిలుపు వినిపించడంతో చివ్వున అటు తిరిగాడు, అది తన పేరే అని జ్ఞప్తికి తెచ్చుకుంటూ.నీరుకావి పంచె లాల్చీ వేసుకున్న పెద్దాయనా, సాదాగా వున్న షర్టుపాంటులో ఓ నడివయసు వ్యక్తీ నిల్చుని ఉన్నారక్కడ. అన్నయ్య, బాబాయ్‌ ఒక్క అంగలో దగ్గరగా వచ్చారు.

 ‘‘అరె! ఇంత దూరం మీరెందుకు వచ్చారు. నేనే ఊరొస్తానన్నాను కదా!’’ అన్నాడు డి.జె.‘‘అదేంట్రా భలేవాడివే.. ఇన్నేళ్ళ తర్వాత అంతదూరం నుంచి నువ్వొస్తున్నావని తెలిసీ కనీసం ఇక్కడి వరకయినా రాకుండా ఎలా వుంటాం’’ అన్నారు వాళ్ళు చిన్నబుచ్చుకుంటూ.‘‘అలా కాదన్నయ్యా ఊర్నుంచి ఇక్కడి వరకూ రావడం శ్రమవుతుందేమోననే ఉద్దేశంతో అన్నాను. నాకు కాన్ఫరెన్స్‌కి టైమవుతోంది. మీతో కాసేపు కూడా గడపలేను. ఇంతకు ఎలా వచ్చారిక్కడికి’’ ఆడిగాడు.‘‘అద్దెకారు తీసుకుని వచ్చాము. ఇక్కడ ద్వారకా హోటల్లో గది తీసుకున్నాము పద వెళ్దాం టీ తాగి..అంటూండగానే- ‘‘వద్దన్నయ్యా నాకు వేరే హోటల్లో రిజర్వేషన్‌ చేసి ఉంది. నా తోటి డాక్టర్లందరూ అక్కడే బస చేస్తారు. రేపట్నించి జరిగే వర్క్‌షాప్‌ గురించి మాటామంతీ అన్నీ ఉంటాయి. మీరు ఊరెళ్ళండి. మూడు రోజుల ఈ కాన్ఫరెన్స్‌ కాగానే నేనే అక్కడికి వస్తాను. వదినా, పిన్నీ వాళ్ళంతా బావున్నారా?’’‘‘ఆ అందరూ బావున్నార్రా. మేం ఇక్కడికి బయలుదేరుతూంటే వాళ్ళు వస్తామని ఒకటే గొడవా..నువ్వు మమ్మల్నే రావద్దంటివి. వాళ్ళకేదో సర్ది చెప్పాం. ఉండబట్టలేక మేం వచ్చేశాంరా. వాళ్ళంతా అక్కడ నీకోసం వేయికళ్ళతో ఎదురుచూస్తుంటారు’’ అన్నాడు బాబాయి.‘‘ఒరేయ్‌ నీకూడా మరదలూ, పిల్లలూ వస్తే బావుండేదిరా. వాళ్ళని మాతో బాటు ఊరికి తీసికెళ్తే ఈ మూడురోజులూ మా అందరి మధ్య సరదాగా గడిపేవాళ్ళు కదా..!’’ అన్నాడు అన్నయ్య.