‘‘దయచేసి వినండి. విజయవాడ నుండి విశాఖపట్టణం వెళ్ళు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడవ నంబరు ప్లాట్‌ఫారం నుండి బయల్దేరుటకు సిద్ధంగా ఉన్నది’’.‘‘బండికదిలిపోద్ది. బేగీ ఎక్కు’’. కూతుర్ని పెట్టెలోకి గెంటి తనూ ఆయాస పడుతూ ఎక్కింది ఆదెమ్మ. మరుక్షణంలోనే కూత వేసుకుంటూ రాజమండ్రి స్టేషన్‌ ప్లాట్‌ఫాం నుండి బయల్దేరింది రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌.పెళ్ళిళ్ళ సీజన్‌ అవడం వలన అన్నిపెట్టెలూ జనంతో కిటకిటలాడుతూ వున్నాయి. ఆదెమ్మ ఎక్కిన పెట్టెకూడా ప్రయాణికులతో, లగేజీతో అడుగు తీసి అడుగు వేయటానికి వీలు లేనట్టుగా వుంది.వెలిసిపోయిన చీర, చంకలో జోలెతో నల్లగా వున్న ఆదెమ్మని పెట్టెలోని ప్రయాణీకులు ఛీత్కారంగా చూడసాగారు.ఇవేమీ పట్టించుకోని ఆదెమ్మ కూతురి చేయి పట్టుకొని జనం మద్యలో నుండి దారి చేసుకుంటూ పద్మవ్యూహం లాంటి ఆ పెట్టెలో నుండి రిజర్వేషన్‌ పెట్టెలోకి వచ్చింది.కూతుర్ని బాత్‌రూంలోకి తీసుకెళ్ళి చీరకట్టి, నుదుటిన కళ్యాణ తిలకం, బుగ్గున చుక్కపెట్టి పెళ్ళికూతురిలా ముస్తాబుచేసింది. వెంకటలక్ష్మి మౌనంగా తల్లిచేసే అలంకరణకు తలఒగ్గి నిల్చుంది. బాత్‌రూంలోని అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్న వెంకటలక్ష్మి చిన్నగా సిగ్గుపడింది.

కూతురివాలకం చూసి ఆదెమ్మ ‘‘చాల్లే సంబడం. నీ సిగ్గు సివాచలం సంతకెళ్ళినట్టుంది’’ అని సున్నితంగా మందలించీ బాత్‌రూం నుండి బయటకొచ్చింది.రైలు ద్వారపూడి దాటింది. రైల్లో నుండీ ద్వారపూడి దేవాలయంలోని దేవుళ్ళకు దణ్ణాలు పెట్టుకున్నారు ప్రయాణీకులు.‘‘బాబూ తండ్రిలేని బిడ్డ. వచ్చేవారమే దీని పెళ్ళి. ధర్మం చెయ్యండి బాబూ’’.ప్రయాణీకుల సీట్ల మధ్య నిలబడి దణ్ణాలు పెడుతూ, వారి కాళ్ళకు మొక్కుతోంది ఆదెమ్మ.పదిహేను, పదహారేళ్ళ వయసులో నల్లగా వున్నా ఆరోగ్యంగా తీర్చిదిద్ది నట్టున్న వెంకటలక్ష్మిని కన్నార్పకుండా చూస్తున్నారు కుర్రాళ్ళు.ముసలి వారు, నడి వయసు వారూ పెళ్ళి అంటోంది కదా రూపాయో, రెండోయిస్తే బాగుండదని అయిదో, పదో ఆదెమ్మ చేతిలో పెడుతున్నారు.జీను ఫాంట్లు, టీ షర్టులు వేసుకున్న కుర్రాళ్ళ దగ్గరకొచ్చి కూతురి పెళ్ళికి సాయం చేయమని ప్రాధేయపడింది ఆదెమ్మ.నల్లవిరుగుడు కర్రతో చెక్కిన దారుశిల్పంలా వున్న వెంకటలక్ష్మిని చూసి అబ్బురపడ్డాడు భరద్వాజ్‌. బ్లాక్‌బ్యూటీ అనుకున్నాడు తనలో తనే. పర్సుతీసి వందరూపాయల నోటు ఆమెకిచ్చాడు.ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి ఆదెమ్మకు. చటుక్కున ఒంగుని అతని కాళ్ళు పట్టుకోబోయింది.కాళ్ళు వెనక్కి తీసుకొని వారించాడు భరద్వాజ్‌.‘‘తప్పమ్మా! వయసులో పెద్దదానివి. పిల్లల కాళ్లకి మొక్కకూడదు. ఆ భగవంతుడికి మొక్కు. మంచి జరుగుతుంది’’.భరద్వాజ్‌ సీటుకి ఎదురుగా వున్న నడి వయసాయన ‘‘అపాత్ర దానం చేసావయ్యా’’ అని అన్నాడు.‘‘అంటే?’’ ప్రశ్నించాడు భరద్వాజ్‌.‘‘ఆమె ఆ అమ్మాయికి పెళ్ళి ఇప్పుడప్పుడే చెయ్యదు. యాచనకి ఇదో మార్గం. మేం తరచూ ఇదేరైల్లో చూస్తూనే వుంటాం వాళ్ళని ఇదే మేకప్పుతో’’ వ్యంగ్యంగా అన్నాడాయన.