భజసేవాయాం...అంటే భగవంతుని సేవించడమే భక్తి. భక్తికి పరాకాష్ఠ భగవంతునిలో భక్తుడు విలీనం కావటం. అంటే ఇద్దరూ ఒకటి అయిపోవటం. అపడే, భగవంతుడు, భక్తుడు అనే భేదం ఉండదు. ఇద్దరూ ఒక్కటే...’’ మంద్ర స్వరంలో మనసుని తట్టి, ఆత్మని మేల్కొలుపుతున్నట్టుగా హాయిగా సాగుతోంది శ్రీ ఆత్మానందస్వామివారి ప్రవచనం. రిటైరయినాక నాకిదొక కాలక్షేపం అయింది. సాయంత్రం కాగానే మా కాలనీలో ఉండే గుడికి వెళ్ళి కూర్చోటం, కాసేపు దానికి సమీపంలోనే ఉన్న పార్కులో పచార్లు చేయ్యటం, నాలాంటి వాళ్ళతో కబుర్లాడి ఇంటికి రావటం.అయితే ఒక వారం రోజులుగా దేవాలయంలో శ్రీ ఆత్మానందస్వామి వారి ఆధ్మాత్మిక ప్రవచనాలు జరుగుతున్నాయి. ఆధ్మాత్మికతని, భక్తిని అందరికీ అందుబాటులో ఉండే సులభశైలిలో బోధిస్తూ, ఎంతోమందిని సన్మార్గంలోకి మళ్ళించారని వారికెంతో మంచిపేరుంది. వారు చెపుతున్నది వింటున్నంతసేపూ ఎంతో హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది. కాని, తర్వాత ఆలోచిస్తే ఏమీ అంతుపట్టదు. ఈ ధోరణి అలవాటు పడితే ఏమన్నా అర్ధం అవుతుందేమో! భక్తుడు భగవంతుడు అవటం ఏమిటి? ఇది మనకి కొరుకుడుపడే విషయం కాదు.ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపు సాయంత్రం దాకా నాకీ విషయాలు గుర్తేరావు. ఇవాల్టి నుంచీ మరీను. ఎందుకంటే ఇవ్వాళే మాపండు వస్తాడు. కొన్నాళ్ళు ఇల్లు ఆనందనందనమే. 

సంబరాల బృందావనమే. పండుకి నాకు ఉన్న సంబంధం, బంధం అటువంటిది.నా రిటైర్మెంటు, మా అమ్మాయి పురుటికి రావటం ఒక్కసారే జరిగాయి. చాలా కాలం తర్వాత మా అందరి కుటుంబాలలో విరిసిన బోసినవ్వు వాడు. వాడంటే అందరికీ మురిపమే. ముద్దే. నాకూ మంచి కాలక్షేపం. కాని, మా వసూకి మాత్రం అది పునర్జన్మ. ఎన్నో కాంప్లికేషన్సులోంచి ఎలాగో బయటపడింది. కనీసం ఒక్క ఏడాది నిరంతర వైద్య పర్యవేక్షణ, విశ్రాంతి అవసరం అయ్యాయి. వసు ఎంతో కష్టపడింది. బాధపడింది. కాని, ఈ వంకన మాకు అనందం దొరికింది. ఇంటిపని, వంట పనికి తోడు వసుకి కూడా సేవ చేయాల్సి రావటంతో సావిత్రికి కొంచెం పని ఎక్కువ అయిందనే చెప్పొచ్చు. నేను హాయిగా, రిటైరై విశ్రాంతి తీసుకుంటున్నాను. మరి, సావిత్రికి రిటైర్మెంటు, విశ్రాంతి ఎపడు?... అందుకే తనకి కొంచెం సాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాను. కానీ, ..... ఏం చెయ్యగలను? నాకీ పనులేవీ అలవాటు లేవే?....నెమ్మదిగా నేను చేయగల పనులు కనిపించాయి. ఉయ్యాల ఊపటం, పండుగాడు మేలుకుంటే, ఉయ్యాల దగ్గిర కాపలా ఉండటం, పక్క తడిపితే సావిత్రిని పిలవటం, వాడు ఏడుస్తుంటే ముట్టుకోకుండా పలకరించటం.... ఇలా వాడు నా దిన చర్యలో భాగం అయిపోయాడు. వాడు పెరుగుతుంటే నాకు వాడిని ఎత్తుకునే ధైర్యం, తడిసిన పక్కబట్టలు మార్చే ఒడుపు, ఆకలికి ఏడ్చాడో, ఇంకెందుకేడిచాడో తెలుసుకునే నేర్పు వచ్చాయి. వాడు తరచూ చూసే మొహం నాదే. వాడిని పలకరించే గొంతు నాదే. వాడు ‘ఉ.. ఊ....’ అంటూ పలకడం నేర్చినపడు మొదట విన్న అదృష్టం నాదే. వాడి నోటి వెంట వచ్చిన మొదటి పలుకు, పిలుపు నాదే-‘‘తాత’’ అని.