‘‘నిన్న రాత్రి నారాయణరావు మళ్ళీ ఫోన్‌ చేశాడురా... మన మండలంలోనే కొత్తపేటలో అమ్మాయి ఉందట. పెళ్ళి చూపులకు వెళతారా అని అడిగాడు. ఏం చెప్పమంటావురా’’ బ్యాంకుకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్న కొడుకు చంద్రప్రకాశ్‌ను అడిగాడు తండ్రి ఈశ్వరరావు.‘‘ఆలోచిద్దాంలే నాన్నా’’ నిరాసక్తంగా అన్నాడు చంద్రం.

‘‘ఇప్పుడుకూడా అలాగే అంటే ఎలారా? సంవత్సరీకం తర్వాత చూద్దామన్నావు. ఇప్పుడు అది కూడా అయింది. మా కోడల్ని మేం కూడా మరచిపోలేక పోతున్నాం. కానీ పోయినవాళ్ళకోసం బాధపడుతూ కూర్చోలేంకదరా? బాబు కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లిచేసుకోవాలిరా’’ బాధగా అంది చంద్రం తల్లి సుభద్ర.‘‘సర్లేమ్మా... నాన్నా ఆ వివరాలేంటో కనుక్కో. సాయంత్రం మాట్లాడదాం’’ అని బ్యాంకుకు బయలుదేరాడు చంద్రం.‘‘ఆ పెళ్ళేదో తొందరగా అయిపోతే మేము వెంటనే ఊరికి వెళ్ళిపోతాం రా.. వ్యవసాయం అంతా అస్తవ్యస్తంగా తయారైంది.’’ గేటు వరకు వచ్చి మరీ అన్నాడు ఈశ్వర్రావు.అలాగేలే అంటూ కారు స్టార్ట్‌చేసి వెళ్ళిపోయాడు చంద్రం.ఓ జాతీయబ్యాంకులో అధికారిగా పనిచేస్తున్న చంద్రప్రకాష్‌ భార్య సుజాత రోడ్డు ప్రమాదంలో మరణించి ఏడాదిదాటింది. 

వాళ్ళకు ఓ బాబు, ఇప్పుడు పదేళ్ళు. భార్యపోయిన నెలరోజులనుండే తల్లిదండ్రులు, బంధు వులు మళ్ళీ పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ఏడాది గడవకముందే పెళ్ళిచేసుకుంటే ఏం బాగుంటుందని చెబుతూ ఏడాది గడిపాడు.ఇప్పుడు ఏం చెప్పాలో చంద్రానికి తోచటం లేదు. భార్య చనిపోయిననాటినుండి తల్లిదండ్రులు చంద్రం తోటే ఉంటున్నారు. పెళ్ళి చేసుకోవాలని ఓ వైపున్నా చేసుకుంటే బాబు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచనతో సతమతమవుతున్నాడు. అయితే తల్లిదండ్రులు మాత్రం తనతో ఎంతకాలం ఉంటారు? వాళ్ళు వెళ్ళిపోతే బాబు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంవచ్చిందని అనుకున్నాడు చంద్రం. బ్యాంక్‌లో పనిచేస్తూనే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులకు తన నిర్ణయం చెప్పాలనుకున్నాడు. సాయంత్రం బ్యాంక్‌ నుండి ఇంటికి వచ్చి రిలాక్సయ్యాడు, టీ తాగుతూ ‘‘నాన్నా, పొద్దున నేను ఆఫీసుకు వెళ్ళే ముందు ఏదో అన్నారుగా, ఆ వివరాలేంటో కనుక్కోండి’’ అని చెప్పాడు చంద్రం.