‘బాల్యంలో జీవించడమే వృద్ధాప్యానికి వుండే ఒకే ఒక వ్యాపకం.బాల్యం మనిషి బ్రతికున్నంతకాలం వెంటాడే ఓ ఆకుపచ్చ జ్ఞాపకం’ఒంటరి ‘ఓక్‌’ చెట్టులా ముప్పైఏండ్లుగా అమెరికాలో ఉంటున్న అరవైఏండ్ల సుబ్రమణ్యానికి ఎప్పుడో చదివిన ఆ వాక్యం ఇప్పుడు పదే పదే గుర్తుకు రావడంతో దాంతో ‘‘ఓ సారి ఇండియా వెళ్ళి ఆ షబ్బీరలీగాణ్ణి, కక్కయ్యగాణ్ణి చూసిరావాలి’’ అనుకున్నాడు.అనుకున్నదే ఆలస్యం వారం పది రోజుల్లో అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని ఓరోజు పొద్దున్నే హైదరాబాద్‌కి విమానమెక్కాడు.

మేఘాల మధ్య దూసుకుపోతున్న ఆ విమానం కన్నా వేగంగా ముసురుకొస్తున్న ఆలోచనల్లో కూరుకుపోతూ విశ్రాంతిగా సీటుమీదకు ఒరిగి కళ్ళు మూసుకున్నాడు సుబ్రమణ్యం.ఫఫఫసుబ్రమణ్యం వాళ్ళది సూర్యాపేట దగ్గర ఫణిగిరి గ్రామం.అది శతాబ్దాల కిందట జైనమతం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన అందమైన చారిత్రక గ్రామం.ఆనాటి జైనమత ప్రాభావం అక్కడి గాలిలో మట్టిలో ఇప్ప టికీ అంతర్లీనంగా ఉన్నా యేమో తెలియదుగానీ మొదటి నుండీ ఆగ్రామ ప్రజలు అంధవిశ్వాసాలు, అంటరానితనం, అవిద్య వంటి వాటికి దూరంగా వుండేవాళ్ళు.అరవై ఏండ్ల క్రిందట ఆ ఊరి రామాలయ అర్చకుడు రంగాచార్యులు తన కొడుకు సుబ్రమణ్యంతోపాటు తన చిన్ననాటి మిత్రుడు దూదేకుల పీర్‌సాహెబ్‌ కొడుకు షబ్బీరలీని, తన ఇంటి జీతగాడు మైసయ్య కొడుకు కక్కయ్యను సూర్యాపేటలోని తన ఇంట్లో వుంచి స్వంత ఖర్చులతో చదివించాడు.

వాళ్ళు ముగ్గురూ డిగ్రీకొచ్చేటప్పటికి వాళ్ళ ఇంటి పక్కనే వుండే మేదరి బుచ్చయ్య కూతురు బతుకమ్మతో ప్రేమలోపడ్డాడు సుబ్రమణ్యం.ఆ ప్రేమ వ్యవహారాన్ని పసిగట్టిన బుచ్చయ్య ‘‘ఆ అయ్యోరోల్ల పోరనితో నీకదేంరోగమే’’ అంటూ కూతుర్ని చావచితక్కొట్టి తన మేనల్లుడితో పెళ్ళిఖాయం చేసి వెంటనే ముహూర్తాలు కూడా పెట్టించాడు.ఆ విషయం తెలిసిన సుబ్రమణ్యం ఓ రోజురాత్రి బతుకమ్మను రహస్యంగా కలుసుకొని ‘‘మనం వెంటనే లేచిపొయ్యి యాద గిరిగుట్ట మీద పెళ్ళిచేసుకుందాం రా...!’’ అంటూ తన అభి ప్రాయాన్ని వెల్ల డించాడు.‘‘నలుగురిలో నా తండ్రికి తలవంపులు తెచ్చిపెట్టి నేను నీతో రాలేను నన్ను మరిచిపో...’’ అంటూ వలవలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన బతుకమ్మ అదేరోజు రాత్రి వాళ్ళ ఇంటి వెనుక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.