లాప్‌టాప్‌ కంప్యూటర్ని పక్కకి నెట్టి లేచి నిలబడ్డాను. చాలాసేపటినుంచీ కదలకుండా లాప్‌టాప్‌ మీద పనిచేస్తున్నానేమో వేళ్లు నెప్పి పుట్టటం ప్రారంభించాయి. గుప్పిళ్ళు మూసి తీస్తూ ఎక్సర్‌సైజ్‌ చేశాను. ఒళ్ళు విరుచుకుని టైం చూశాను.మధ్యాహ్నం మూడయింది.బద్ధకంగా ఉంది. ఇంటర్‌కం ఫోన్‌ తీశాను. నా సెక్రటరీ నంబర్‌ డయల్‌ చేశాను.‘యస్‌ సర్‌’‘మరియా... ప్లీజ్‌ గెట్‌ మి ఎ కప్‌ ఆఫ్‌ హాట్‌ కాఫీ’‘ఒకే సర్‌’కిటికీలోంచి బయటికి చూశాను. చర్చిగేట్‌ రైల్వే స్టేషన్‌ కనబడింది. ఈ సమయంలో కూడా వందలమంది జనం స్టేషన్‌లోకి వెళుతూ, అంతకు మించి జనం స్టేషన్‌లో నుంచి బయటికి వస్తూ కనిపించారు.‘ఎమేజింగ్‌’ అనుకున్నాను. ఇన్ని లక్షలమందిని ప్రతిరోజూ తను ఇళ్ళ దగ్గర్నుంచి ఆఫీసులకి, మళ్ళీ ఆఫీసుల నుంచి ఇళ్ళకి ప్రయాణం చేయిస్తున్న బొంబాయి నగర లోకల్‌ రైళ్ళు ఒక ఎత్తయితే, అంత పెద్ద ట్రాఫిక్‌ని ఎఫీషియంట్‌గా హాండిల్‌ చేసే చర్చిగేట్‌, వీటి స్టేషన్లు మరొక ఎత్తు. బొంబాయి గొప్పతనానికి చర్చిగేట్‌ స్టేషన్‌ ఒక ప్రతీక.బొంబాయి ఒక అద్భుతమైన సిటీ. ఇక్కడి ప్రజలు టైంకి చాలా విలువని ఇస్తారు. పనులు చాలా వరకు టైం ప్రకారం చేసే అలవాటు జనాలకి ఉంది.

 ఆఫీసుల్లో కూడా చాలా ప్రొఫెషనల్‌గా, ఎఫీషియంట్‌గా ఉంటారు. అలా ఉంటే గానీ ఉద్యోగాలు ఉండవు. కాంపెటీషన్‌ చాలా ఎక్కువ. గత పది సంవత్సరాలలో బొంబాయిలో పని చేస్తున్న నాకు ఈ సిటీమీద చాలా మక్కువ పెరిగిందనే చెప్పాలి.నా కాబిన్‌ తలుపు తీసుకుని ఒక చేతిలో కాఫీ కప్పు ఇంకో చేతిలో నా మెయిల్‌ తీసుకుని వచ్చింది మరియా.‘థాంక్యూ మరియా’ అంటూ కప్పు అందుకున్నాను.కాఫీ సిప్‌ చేశాను. వేడిగా బావుంది.‘సర్‌. దిసీజ్‌ యువర్‌ మెయిల్‌. దిస్‌ ఎన్‌వెలోప్‌ ఈజ్‌ డెలివర్డ్‌ బై ది కొరియర్‌ జస్ట్‌ నౌ’ అంటూ నా మెయిల్‌ ఫోల్డర్‌లో పైన ఉన్న ఒక కవరు చూపించింది.మిగతా లెటర్స్‌ అన్నీ కవర్లలో నుంచి తీసి నీట్‌గా ఒక బొత్తిగా సర్దింది. ఈ కవరు మాత్రం ఓపెన్‌ చెయ్యలేదు. కవరు మీద ‘కాన్ఫిడెన్షియల్‌’ - అని రాసి ఉండటమే దానికి కారణం. మరియా నా సెక్రటరీగా అయిదు సంవత్సరాల నుంచీ పని చేస్తోంది. చాలా ఎఫీషియంట్‌.‘ఓ.కే. థాంక్యూ మరియా’ అన్నాను ఇక ఆవిడ వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా.‘ఓ.కే.సర్‌. మిస్టర్‌ ఖన్నా ఫ్రం సిటీ బాంక్‌ ఈజ్‌ కమింగ్‌ ఎట్‌ ఫోర్‌’ అని చెప్పి వెళ్ళిపోయింది మరియా.ఆ కవరుని పరీక్షగా చూశాను. ఢిల్లీనుండి వచ్చింది. కవరు మీద రాసిన ఫ్రం అడ్రస్‌ని బట్టి ఎవరో రామస్వామి అనే అతను ఢిల్లీ ఆర్కేపురం నుంచి పంపినట్లుగా ఉంది. కింది కవరు ఓపెన్‌ చేసి లోపలి లెటర్‌ బయటికి తీశాను. ఇంగ్లీషులో టైప్‌ చేసి ఉంది. చదవటం ప్రారంభించాను.