‘‘ఏం చేస్తామయ్యా, నెల రోజుల కన్నా ఎక్కువ టైం లేదు.ఈ లోగానే ఏర్పాట్లన్నీ జరిగిపోవాలి. పెళ్లి తిరుపతిలోనే జరిపించాలని పెళ్లి కొడుకు అమ్మగారు పట్టుపట్టారు. మా బెజవాడలోనైతే నా తిప్పలు నేను పడుతుండేవాణ్ణి’’ విచారంగా అన్నారు కనకరత్నంగారు.‘‘సార్‌, అమెరికా సంబంధమన్నారు. అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరన్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ మరీ నెల రోజుల వ్యవధిలో మంచి మేరేజి హాలు దొరకడం, మిగతా ఏర్పాట్లు పూర్తవడం అంత ఈజీ కాదు. కావలిస్తే ఏ కాంట్రాక్టరుకో పెళ్లి పనులు పూరమాయించవచ్చు’’ అన్నాను నేను నసుగుతూ మా ఆఫీసరు కనకరత్నంగారితో.‘‘ఆహా, ఆ ముచ్చట కూడా అయ్యింది. వాడెవడో పళినిస్వామిట, మేరేజ్‌ కాంట్రాక్టులు చేస్తుంటాడట. ఎంత సేపు ‘మేర్‌కాళంబూ, తైర్‌సాదం’ అని అరవ వంటకాల లిస్టు చదువుతున్నాడు. దోసకాయ, పనస పొట్టు కూర అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. పైగా వాడి దగ్గరున్న బేండుమేళం వాళ్లకి సినిమా పాటలే తప్ప త్యాగరాజకృతులేవీ రావట, అసలే మా వియ్యంకుడు కర్నాటక సంగీతమంటే చెవికోసుకుంటాడు’’ అని ధుమధుమలాడాడు కనకరత్నం.‘‘సార్‌, మిగతా ఏర్పాట్లకేవో తిప్పలు పడవచ్చు. కానీ కల్యాణ మండపం మంచిది దొరకాలంటే ఈ తిరుపతిలో కనీసం మూడు నెలల ముందే బుక్‌ చేయాలి.లోకల్‌ వాళ్లతో బాటూ, ఎక్కడెక్కడి వాళ్లో వచ్చి, హాల్స్‌ బుక్‌ చేసి ఇక్కడే పెళ్లిళ్లు జరిపిస్తుంటారు గదా’’ అన్నాన్నేను.

‘‘సరే నాలుగింటికి బయల్దేరి టిటిడి వాళ్ల మేరేజి హాల్స్‌, తిరుచానూరులో కల్యాణమండపాలు చూసొద్దాం’’ అన్నారు రత్నం గారు.అన్నట్లుగానే ఆయన కార్లో వెళ్లి వాకబు చేసొచ్చాం. ఎక్కడా ఖాళీలు లేవు. ఆఖరికి స్టార్‌ హోటల్స్‌లోని కల్యాణ మండపాలు కూడా మరో మూడు నెలల పాటు బుక్‌ ఐపోయి ఉన్నాయి.‘‘ఏం చేద్దాం సార్‌, పెళ్లి మరో రెండు, మూడు నెలలు పోస్టుపోన్‌ చేసుకోండి. లేదా మరో వూర్లో జరిపించండి’’ విచారంగా చెప్పాను.‘‘చాల్చాల్లేవయ్యా, భలే చెప్పొచ్చావు. సాయంత్రం టౌన్లో గాలించి ఏవైనా ప్రయివేటు కల్యాణ మండపాలు దొరుకతాయేమో చూడాలి. అలాగే మంచి పురోహితుణ్ణి, వంట వాళ్లను, మేళగాళ్లను వెతికిపెట్టు. నీకూ మంచి కాలక్షేపం’’ నాకేదో బొత్తిగా టైంపాస్‌ కానట్లుగా చూస్తూ చెప్పాడు కనకరత్నం.ఎంతాఫీసరైనా నాకా క్షణంలో ఆయన్ను కడిగిపారేయాలనిపించింది. కాసేపు తమాయించుకుని చెప్పాను.‘‘సార్‌, మా అమ్మాయికి రేపట్నండీ టెంత్‌క్లాస్‌ ఎగ్జామ్స్‌ స్టార్ట్‌ ఔతున్నాయి. మరో వారం రోజుల్లో మా అబ్బాయికి కౌన్సిలింగ్‌ వుంది. మీకు టైం స్పేర్‌ చేయలేను. కావాలంటే ఆ ధర్మారావును మీకు సహాయంగా వాడుకోండీ నెల రోజులు’’నా ఆఖరి మాటలు వినగానే అగ్గిమీద గుగ్గిలమయ్యాడు కనకరత్నం.