బామ్మగారి భర్త ‘‘ ఏర్పాటు చేసుకున్న చిన్నిల్లు’’ గురించి పూర్తి వివరాలు సేకరించవలసిన ‘పరిశోధన’ ఇదీ...ధనాకుల ధనపతి, డిటెక్టివ్‌ ధనాధన్‌ అని బోర్డు పెట్టుకొని తన బాబాయ్‌గారి ఖాళీ కారు షెడ్డులో అపరాధ పరిశోధనా కార్యాలయం ప్రారం భించిన మూడు నెలల తరువాత వచ్చిన మొదటి కేసు ఇది.‘‘ఆయ్‌! ఈవిడ మా బామ్మండి.. ఆయ్‌....ఆరోజుల్లో మీ మామ్మగారి క్లాస్‌మేటండి...ఆయ్‌... మెట్రిక్‌ పరీక్ష రాసిందండి... ఆయ్‌... ఫెయిల్‌ అయిందనుకోండి... టీవీలోలా భలే మాట్లాడతాదండి... ఆయ్‌... ఇంగ్లీష్‌ వచ్చండి... ఆయ్‌....’’ తను కూర్చోమనకుండానే కూర్చుని చున్నీ సర్దుకుంటున్న ముద్దుగుమ్మ కేసి మురిపెంగా చూశాడు... ధనపతి అదే డిటెక్టివ్‌ ధనాధన్‌... మరీ ఎక్కువ సేపు పిల్లకేసి చూస్తుండిపోతుంటే కేసు జారిపోతుందేమోనన్న భయం కలిగి ఆ పిల్లకూడా వచ్చి ఆపసోపాలు పడుతూ సోఫాలో కూలబడిన బామ్మగారికేసి దృష్టి మరల్చాడు.బూరుగు దూది పరుపుకు బూడిద రంగు చీర చుట్టినట్లున్న భారీ కాయం...పాపిట్లోంచి చెంపల చివర్లోంచి తొంగిచూస్తూ మెరుస్తున్న తెల్ల వెంట్రుకల కొసల్ని బట్టి మిగతా జుట్టంతా నల్లనల్లగా నిగనిగలాడుతున్నా అసలు రంగు ముగ్గు బుట్టేనని తెలిసిపోతోంది. దట్టించిన పౌడరు, భానుమతి టైపు బొట్టు, వయస్సుకు తగని విధంగా ధరించిన స్లీవ్‌లెస్‌ లోనెక్‌ జాకెట్టులో ఇమడలేకపోతున్న సౌష్టవం... ముఖ్యంగా ఉదరం, నడుం చుట్టూ ఉన్న ట్రాక్టరు టైర్లు...మొత్తానికి మోడ్రన్‌ బామ్మే అని అంచనాకు వచ్చాడు మన డిటెక్టివ్‌ ధనాధన్‌... ఈవిడకి తనతో ఏం పనిపడిందో అని ఆశ్చర్యపోయాడు కూడా...!అంతలోనే మళ్లీ అందుకొంది ముద్దుగుమ్మ... 

‘‘ఆయ్‌! నాపేరు గీతండి... మా బామ్మకు మీతో పనిపడిందండి.మీ బామ్మపేరు...‘‘లంగాయమ్మ...లంగాయమ్మ..’’ బామ్మగారి గొంతు ప్రతిధ్వనించింది గీతకడ్డు వస్తూ...ఆ! ఇదేం పేరు అని విస్తుపోతున్న డిటెక్టివ్‌ని చూస్తూ కిసుక్కున నవ్వింది గీత... ‘‘ఆయ్‌ బామ్మ పేరు రంగాయమ్మ అండి తనకి ‘ర’ పలకడం రాదండి... కానీ భలే మాట్లాడతాదండి... ఆయ్‌... టీవి సీరియల్స్‌ బాగా చూస్తుందండి’’ ఈసారి ఆయ్‌ అనకుండా ‘కుయ్యో’ అంది బామ్మ పిక్కపాశం పెట్టినందువల్ల.ఓకే... లంగా...సారీ రంగాయమ్మ పేరు రాసుకున్నామరి వయస్సు...నోట్‌ బుక్‌లో గిలుకుతూ అడిగేడు డిటెక్టివ్‌లానే ఫోజు కొడుతూ...‘‘అలవై మూడు... సిక్స్‌టీత్లీ’’ రాసుకో బాబూ వెంటనే పలికింది. మా కామాక్షి మనవడివి కదా ఫీజు ముందే మాట్లాడనక్కల్లేదని తెల్సులే అంటూ ముందరి కాళ్లకు బంధం వేసింది.ఫీజు ప్రస్తావనతో కంగుతిన్నా. ‘సరే మొదటి కేసు కదా’ అని సర్దిచెపకొని తర్వాతి ప్రశ్న అడిగేడు ధనాధన్‌ ముక్కు మీద పెన్సిల్‌తో కొట్టుకుంటూ ‘‘సెక్స్‌’’ అని..