స్నేహితుడ్ని రైలు ఎక్కించి ఫ్లాటుఫారం మీద నెమ్మదిగా నడిచి వస్తున్నా.స్నేహితుడు బెంగుళూర్‌ వెళుతున్నాడు.కదిలిపోతున్న ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఓ కంపార్ట్‌మెంటు డోర్‌ దగ్గర నా ఫ్రెండ్‌ చెయ్యి వూపుతుంటే చేయి ఆడిస్తూ వస్తున్నాను.‘‘రేయ్‌ ఇంకోసారి గనుక ఇట్లాంటి దొంగ పనులు చేస్తూ నా కంట పడ్డారో మిమ్మల్ని బొక్కలోకి తోసేస్తా’’ అంటూ లాఠీ పట్టుకొని రైలు ఎక్కుతున్న ఓ మఫ్టీ పోలీసు మాటలు విని అటు తిరిగే సరికి రైలు వేగం పుంజుకొని ప్లాటుఫారం దాటేసింది.ఆ పోలీసు ఆ మాటలు ఎవర్ని గురించి అన్నదీ క్షణంలోనే అర్థమయ్యింది. అక్కడ కొట్టుకుంటున్న కుర్రాళ్ల గురించే అయ్యుంటుందని అనుకొన్నాను.కొట్టుకుంటున్న ఆ ఇద్దరి వయసు దాదాపు పదిహేనేళ్లలోపే వుంటుంది. కాకపోతే ఒకడు ఎర్రగా, మరొకడు కాస్త నల్లగా వున్నారు. బక్కచిక్కిన శరీరాలు, చినిగిన చొక్కాలు బాగా పెరిగిపోయిన నెత్తి మీది జుత్తు.ఒకడు ఎడమ చేత్తో మరొకడు నెత్తిమీది జుత్తు పట్టుకొని కుడిచేత్తో పొట్ట మీద, గుండెమీద పొడిచేస్తున్నాడు. ఆ రెండో వాడు తన కాళ్లతో వాడి మర్మావ యవాలపైనా, పొట్టపై బలవంతంగా తంతున్నాడు.‘‘రేయ్‌...లం....కొడకా...’’ అని ఒకడంటే, ‘‘నీ యమ్మ....నా కొడకా...’’ అని మరొకడు.ఇద్దరూ సరిసమానంగా ఎక్కడ పడితే అక్కడ పిడిగుద్దులు గుద్దుకుంటూ నెత్తి మీది జుత్తు పీకేస్తూ కుస్తీ పడుతున్నారు. ఇద్దరూ బాలెన్సు తప్పి ప్లాటుఫారం మీద పడిపోయారు.

కిందపడ్డ కుర్రాడి మీద రెండోవాడు వాడి పొట్టమీద కూర్చుని చెంపల మీద, తల మీద బలంగా తన్నేస్తున్నాడు. కింద పడ్డ కుర్రాడు గిజగిజలాడుతూనే బలమంతా ఉపయోగించి పొట్టమీద కూర్చున్నవాడి పీక రెండు చేతులతో గట్టిగా అదిమి పట్టుకొని, కాళ్లతో కొడుతూ, వాడిని అటూ ఇటూ వూపి ఒక్కసారి కింద పడేసి, వీడు వాడిపైకి ఎక్కి రొమ్ముల మీద గుద్దేస్తున్నాడు.వీళ్లిద్దరి ఫైటింగ్‌ సీన్‌... ఫ్లాట్‌ఫారం మీదున్న ప్రయాణీకులు వింతగా చూస్తున్నారు. ‘‘రేయ్‌... ఆగండర్రా...’’ అని కూడా అక్కడున్న వాళ్లెవరూ అన్లేదు.ఫ్లాటు ఫారం వారిద్దరి కుస్తీ పోటీల స్థలం అన్నట్టుగా భావించి ఉచిత ప్రదర్శనలా మౌనంగా చూస్తున్నారు.ఫ్లాటుఫారం మీద బాగా కొట్టుకొని కిందా మీద పడిపోయి, అలసిపోయి రొపతున్నారు.నేను ఆ వింతను ఆట్టే చూడలేక ‘‘రేయ్‌... ఆగండి’’ అని గట్టిగా అరిచాను. వున్నట్టుండి నా కేక పిడుగుపడ్డట్టు అనిపించిందేమో ఇద్దరూ సడెన్‌గా కొట్టుకోవడం ఆపేశారు.నెమ్మదిగా పైకి లేచి చినిగిన చొక్కాలకు పట్టిన ప్లాటుఫారం మీది దుమ్మును దులుపుకొని వెర్రి ముఖాలతో నిలబడ్డారు మౌనంగా...వాళ్లను చూస్తే జాలి వేసింది. వాళ్లిద్దరినీ కోసి తీసి తూకం వేసినా పదికిలోల మాంసం లేదు. కళ్లల్లోని కన్నీరు తొంగి తొంగి చూస్తోంది. చెంపల మీద నుంచి జారిపడడానికి.