‘‘ఏమిటి సరళా... కూరంతా ఉప్పుకశం చేసేసావు?’’ అనడిగింది అత్తగారు.సరళ గుమ్మం దగ్గర ఇంకా చెప్పులు విప్పకుండానే.‘‘ఏమో అత్తయ్యా. తొందరలో కొంచెం ఎక్కువయినట్టుంది. అయినా రోజూ ఒకేలా వంటెలాకుదురుతుందత్తయ్యా. ఎవరికైనా అప్పుడప్పుడు కొంచెం తేడా వస్తుంది కదా!’ అంది నెమ్మదిగా.‘‘ఏమో తల్లీ! ఈ తొందరవంటలు నాకు చాతకావు. తెల్లారగట్టే లేచి వండాల్సిందే! ఎంత పదును అనుకున్నావు. మెతుక్కి మెతుక్కి అంటితే కంచం తోసేసేవారు మీ మామయ్య. నాలుగయిదు రకాలు, పప్పు, పులుసు, పచ్చడి కూర అన్నీ యధావిధిగా చెయ్యాల్సిందే. ఇప్పటిరోజుల్లా బద్ధకిస్తే ముద్దముట్టే వారు కాదు. 

ఆ ఓపిక ఎక్కడికి పోయిందో. ఆ కాలమే వేరు. కట్టెలపొయ్యి మీద వంట. గ్యాస్‌ పొయ్యిలమీద కుక్కర్‌లో వంటక్కూడా మీరు హైరానా పడి పోతుంటారు. ఒక్క ఘడీ ముందు లేవచ్చుగదమ్మాయి’’ అంది సాగతీస్తూ అత్తగారు.అసలే ఆఫీసు పనుల టెన్షన్‌లో ఉన్న సరళకి కొంచెం కోపం వచ్చినా తమాయించుకుని ‘‘ఈ బస్సులవీ ఎక్కి దిగి తిరిగి తిరిగి అలసిపోయి వస్తాం కదా అత్తయ్యా, మధ్యాహ్నమూ నిద్రపోడానికి ఉండదు కదా. అందుకే పొద్దున్నే తొందరగా మెలకువరాదు’’ అంది సరళ.‘‘సర్లే ఒక్కతివే ఉద్యోగం చేస్తున్నట్టు చెబుతావు. తాయారమ్మ కోడలికి పని మనిషే లేదుట. ఆమె ఉద్యోగం చేయట్లా!’’ అంటూ వాదించబోయింది.సరళ అలసిపోయి ఉందేమో కొంచెం విసుగ్గానే.‘‘వాళ్ళాయన సాయం చేస్తారు కాబట్టి వాళ్ళేదో కలిసి చేసుకుంటారు. అందరినీ ఒకేలా పోలిస్తే ఎట్లా? మీ అబ్బాయికి టైంఉండదు. పొద్దుట పోయి రాత్రెప్పుడో వస్తారు. అయినా ఎవరి ఓపిక వాళ్ళది. ఎవరి ఇంటి తీరు వాళ్ళది. సర్లెండి కానీ పిల్లలు ట్యూషన్‌కి వెళ్ళారా!’’ అనడిగింది సరళ.‘‘వెళ్ళారు కాబట్టే తల్లీ ఇంత ప్రశాంతంగా ఉంది. ఉన్నంతసేపూ ఆ వెధవ కార్టూనే పెడతారు. ఒక్క సినిమా చూడనివ్వరు. సీరియలు చూడనివ్వరు’’ అంది నిష్ఠూరంగా అత్తగారు.‘‘పోనీలెండి అత్తయ్యా. చిన్నపిల్లలు. కాసేపు చూసి ట్యూషన్‌కి వెళ్ళిపోతారు కదా! వచ్చి అన్నంతిని నిద్రపోతారు. ఆ కాసేపేగా వాళ్ళు చూసేది. తర్వాత నేనెలాగూ టీ.వి. చూడను. మీకు కావలసినవి పెట్టుకుని చూడండి’’ అంది పిల్లల్ని సమర్థిస్తూ సరళ.‘‘ఏమోనమ్మా! ఆ టయింకి ‘గంగోత్రి’ చూడకపోతే నాకసలు తోచదు. అదే టయింకి వస్తారు వీళ్ళూనూ. అక్కడుంటే అన్నపూర్ణమ్మగారు నేను కూచుని చూసే వాళ్ళం’’ అంది అత్తగారు.ఇంక వాదన పొడిగించడం ఇష్టం లేక మౌనంగా ఊరుకుంది సరళ.‘‘అక్కడ టీ పెట్టి వచ్చాను. మీ మామయ్యగారికి కాస్త ఇచ్చి, నువ్వు కూడా వెచ్చబెట్టుకుని తాగు’’ అంది అత్తగారు.