నేను టైరవలేదు. ఇది నిజం. కావాలంటే మీరే చూసుకోండి. పరీక్షకు పంపుకోండి. నా నడుం ముడతేనా లేకుండా ఎంత చదునుగా చక్కగా వుందో కళ్లారా కాంచండి. తృప్తి చెందండి. మా ఆవిడ నడుం మాత్రం చూడొద్దు. పెళ్ళికీ, పెళ్లయిన ఏడాది వరకూనూ ఆమె - ఔను. ఆమే! సన్నగా, పొడవుగా... బంగారు తీగె చెరుగ్గడలా వుండేది. నేనేమో 8 ఎంఎం ఇనప రాడ్‌లా వుండేవాణ్ణి. పెళ్ళయి రెండేళ్లయ్యేసరికి ఆమె శారీరకంగా విపరీతమైన అభివృద్ధి సాధించేసింది అడ్డంగా.ఆమె కాస్తా ఆవిడ ఐపోయింది. ఆ అభివృద్ధిలో ఒక భాగం ఆవిడ నడుంమీద టైరు. మరో ఏడాది తిరిగేసరికి మరో టైరు! సైకిలు టైరు కాదు. స్కూటర్‌ టైరు! ఆవిడ ఒక్కదానికే కాక నాకూ అయిందిగా పెళ్లి! ఐనా నాకు ఒక్క టైరు కూడా రాలేదు! ఇదే కాబోలు సృష్టి విచిత్రమంటే!!మొదట్లో మమ్మల్ని ‘చూడచక్కని జంట’ అన్నవారే, తరవాత ‘సూర్యకాంతం, రమణారెడ్డి’ అనేవారు. (చూడుడు పాతికేళ్ల కిందటి మంచి తెలుగు సినిమాలు). ఇంకా తరవాత ‘ఏనుగూ ఎలకా’ అనేయడం మొదలుపెట్టారు. ఆవిడ (అంతలావయిపోయాక ఇంక ‘ఆమె’ ఏమిటి? ఆవిడే... ఆవిడ ఒక అబ్బాయిని కన్నాక మరో టైరు! ఈసారి ఏకంగా లారీ టైరే. ఆవిడ మళ్ళీ కంటే బుల్‌డోజర్‌ టైరో, ట్రాక్టర్‌ టైరో నడుము మీదకొచ్చేస్తుందని - నేను - ‘ఒక్కరు ముద్దు, రెండు వొద్దేవొద్దు’ అన్న మంచిమాటని పాటించేస్తూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నాను.

 ఇదంతా... నా పర్సనల్‌ లైఫ్‌ హిస్టరీ మీకెందుకు మొరపెట్టుకున్నానంటే... మహారాజశ్రీ అధికారి గారూ! నే టైరే కాలేదు, నాకు రిటైర్‌మెంట్‌ ఏమిటి అని తమకు మనవి చేసుకునేందుకే’’ అని ఆగాడు సుబ్బారావు.‘‘సుబ్రావ్‌! నువ్వు చెప్పింది చాలా చక్కగానూ వుంది, సమంజసంగానూ వుంది. కాని... నీకు తెలియనిదేముంది? ప్రభుత్వంవారి రూల్సుకి అర్థం ఆట్టే వుండదు. నీ వయసు అరవై నిండింది కనుక... నువ్వు అరవైలో ఇరవై అంత చురుగ్గానూ వున్నా... కేవలం కాగితం వయసువల్ల... ’’ అన్నాడు తన తప్పేమీ లేనట్లు.