ఉదయం నుండీ మనసంతా ఆందోళనగా ఉండడంతో కాలేజీకి సెలవు పెట్టి ఇంట్లోనేకూర్చున్నాను. మధ్యాహ్నం పన్నెండు దాకా టీవీలో కానీ రేడియోలో కానీ వార్తలయితే ఏవీ లేవు. టైం గడుస్తున్నకొద్దీ మనసులో ఉత్కంఠ పెరగసాగింది.టౌన్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గిరిధర చౌదరిని మంత్రివర్గం లోకి తీసుకున్నట్లుఫోన్‌ మెసేజ్‌ వచ్చిందని పది గంటలకే ఆయన అభిమానులు పెద్దయెత్తున టపాకాయలుకాల్చినారు. అనంతపురం మెయిన్‌ రోడ్లన్నీ హోరెత్తిపోయినాయి. మధ్యాహ్నంపన్నెండు గంటలకు మరొక వార్త వినిపించింది. రంగారెడ్డి మంత్రి అయినట్లుతెలిసిందని ఆయన అనుయాయులు ఆనందోత్సాహాలతో కేకలువేసినారు. టౌనంతా భరించరాని శబ్దాలతో దద్దరిల్లిపోయింది.కదిరి శాసనసభ్యుడు రంగారెడ్డి, ధర్మవరం శాసన సభ్యుడు గిరిధర చౌదరీ జిల్లాలో పుష్కలంగా అంగబలమూ అర్ధబలమూ ఉన్నవాళ్లే. ఉదయం నుండీ వాళ్ల అభిమానుల ఆనందోత్సాహాలను గమనించిన తర్వాత వాళ్లిద్దరూ తప్పక మంత్రివర్గంలో ఉంటారని అనుకున్నారు. వారం రోజులుగా పత్రికలు కూడా వాళ్లను గురించే రాసినాయి. నేను మనసులో అయితే అనుకున్నాను కానీ అనుకున్నప్పటి నుండీ అసంతృప్తితో మనసంతా నీరస పడి పోయింది. ఈ అగ్రకుల రాజకీయాల్లో శివరాం వంటి బడుగువర్గం వానికి మంత్రిపదవి వస్తుందని ఆశించడం పేరాశే అవుతుందని మనసును సమాధాన పరుచుకుంటూ రేడియో బటన్‌ నొక్కాను. మంత్రి మండలి ప్రమాణ స్వీకారం గురించి ప్రత్యేక వార్తలొస్తున్నాయి. వింటూ నన్ను నేను నమ్మలేక పోయాను. మిత్రుడు శివరాం మంత్రి అయినాడు. సంతోషంతో శరీరమంతా తేలిపోయింది. వెంటనే మాలతిని పిలిచి చెప్పినాను. తాను ఆనందంతో మురిసి పోయింది.

 పిల్లలిద్దరూ కాలేజీ నుండి మధ్యాహ్నం భోజనానికి వచ్చినారు. ఇల్లంతా సంతోషంతో వెల్లివిరిసింది.భోజనం చేసి సంతృప్తిగా తాంబూలం నములుతూ మిద్దె మీదున్న రూములోనికి వెళ్లి ఈజీ చైర్లో కూర్చొని వెనక్కివాలి కళ్లు మూసు కున్నాను.మిత్రుడు శివరాం కేబినెట్‌ మంత్రి అయినాడు. ఎంత సంతోషమయిన వార్త! శరీరం నిండా ఏవో చెప్పరాని అనుభూతులు పారాడినాయి. గతానికి చెందిన ఎన్నో జ్ఞాపకాలు మనుసునిండా కదలాడినాయి. అవి మననం చేసుకున్నప్పుడు మధుర మయినవే అయినా ఆ దినాల్లో శివరాంకూ, నాకూ అవి విషాదమయినవే.ముప్పై ఆరు సంవత్సరాల కిందట మాట. నేనూ, శివరామూ హైస్కూల్లో చదువుతున్న రోజులవి. తిమ్మాపురం హైస్కూల్‌ ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి పొందిన స్కూలు. తిమ్మాపురంలో ఉన్న ‘ఎనుముల దొడ్డి’లో మా పిన్నమ్మ ఉండేది. అప్పట్లో వాళ్ల సంసారం బాగుండేది. ఆ దినాల్లో శింగనమల చెరువు సరిగా నిండేది కాదు. ఆ చెరువు కింద పల్లెలన్నీ ఎప్పుడూ కరువుతో కటకటలాడేవి. మా వంటి వాళ్ల కుటుంబాలు గాలికి కొట్టుకునిపోయే జొన్న వొగుడు మాదిరి కూలి కోసం దిక్కులకొకటి పోయేవి. అంత పేదరికంలో కూడా నాకు చదువు కోవాలని కోరిక ఉండేది. అది గమనించిన మా పిన్నమ్మ నన్ను ఎనుమల దొడ్డికి పిలుచుకుని పోయింది. మా చిన్నాయన నన్ను తిమ్మాపురం హైస్కూల్లో ఎనిమిదో తరగతిలో చేర్చినాడు. నేను ప్రతిరోజూ ఉదయం ఎనుమలదొడ్డి నుండీ మూడు మైళ్లు నడిచి హైస్కూలుకు వెళ్లి చదువుకొని మళ్లీ సాయం కాలానికి ఎనుముల దొడ్ది చేరుకునే వాణ్ణి. అప్పుడే శివరాం కూడా ఎనిమిదో తరగతిలో చేరి నాకు పరిచయమయినాడు.