సీతారాం నా ప్రాణమిత్రుడు. చిన్నప్పటి నుంచీ డిగ్రీ దాకా కలిసే చదువుకున్నాం. నేను వుద్యోగం చూసుకున్నాను. వాడు వ్యవసాయం చేసుకుంటానని వాళ్ళూరు వెళ్లిపోయాడు.వాడిది బాగా భూ వసతి వున్న కుటుంబం.తల్లిదండ్రులకు వీడొక్కడే మగ సంతానం. ఈ మధ్య వాడూ నేనూ కలవక ఏకంగాఅయిదేళ్ళ కాలంగడిచిపోయింది.ఈ 2001సంత్సరంలో అకస్మాత్తుగా వూడిపడి నన్ను ఆశ్చర్యంలో ముంచుతాడనుకోలేదు. ‘‘సంగతు లేమిట్రా సీతారాముడూ’’ ఆప్యాయంగా అడిగాను. ‘‘నేను ఆత్మహత్య చేసుకుందామని తిరుగులేని నిర్ణయం తీసుకున్నానురా నిన్నూ నీ పిల్లల్ని ఒక మారు చూసి నిర్ణయం అమలు పరుద్దామని ఆగాను’’ తాపీగా చెప్పాడు. ‘‘అదేమిట్రా నీ అంతటి ధైర్యశాలి లేడని మేం మా పిల్లలకు నీ కథలు చెప్పుకుంటుంటే నీ మానాన నీవేమో ఆత్మహత్య చేసుకుంటావా? మరీ నీ గురించి పిల్లలకు చెప్పిన కథలు అబద్ధమై పోవూ? ‘‘ఏమిటి డాడీ మీరు చెప్పింది’’ అని రేపు వాళ్ళు మా కాలరుచ్చుకుని అడిగితే ఏం చెప్పాలి. దానికి ముందు జవాబు చెప్పి నీ ఆత్మహత్యా కారణం వివరించు’’ అన్నాను.‘‘నారు పోసినవాడే నీరు పొయ్యాలి. కథలు చెప్పిన వాడే కారణాలు చెప్పాలి. నేను ‘‘ఆత్మహత్యీ’’ కరించుకుంటాను. వీడికి మొదటి నుండి భాషలో ప్రయోగాలు చేయటం హాబీ.‘‘అదే ఎందుకు?’’వాడు విషాదంగా నవ్వి ‘‘పత్తిరైతును కదరా మరి ఆత్మహత్య చేసుకోవద్దూ? ప్రశ్నించాడు.‘‘ఒరేయ్‌ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా అయినా కాటన్‌ రైతువి కదా మరి పత్తి రైతంటావేమిటి?‘‘కాటన్‌-పత్తీ రెండూ ఒకటేరా నాయనా’’ నాలుక్కర్చుకున్నాను. ఇంట్లో ఇంగ్లీషు మీడియం పిల్లల కలగలుపు భాషతో ఏది ఏమిటో తెలిసి చా(రా)వటం లేదు.సీతారాం ధైర్యాన్ని గురించి ఒక చిన్న సంఘ టన చెప్పితీరాలి.

 మా వూళ్ళో పద్మారెడ్డి అనేవాడు ఆ రోజుల్లోనే విపరీతంగా కండలు పెంచి దారిని పోయ్యేవాళ్లను పిలిచి గిల్లికజ్జా పెట్టుకుని చావబాదేవాడు. వాడి బాడీని ఇప్పటి భాషలో ‘‘ట్వెల్వ్‌ ప్యాక్‌’’ అనవచ్చేమో, వాడికి ఎదురు నిలబడి మాట్లాడగలిగేవాళ్ళు లేరు. వాడు బాటంట వస్తూంటే పక్కలకు ఒదిగి మరీ నమస్కారం చేయ్యాలి. లేకపోతే నమస్కారం చేయనివాడికి మూడిందన్నమాట. ఒకనాడు వాడు సీతారాంకు ఎదురుపడ్డాడు. మావాడు వాడిని బేఖాతరుగా చూసి ‘‘జినా బేఖరార్‌ హై’’ అంటూ పాడుకుంటూ వెళ్ళి పోతున్నాడు. పద్మారెడ్డికి కోపం వచ్చి వీడిని నాలుగు బాదాడు. దాంతో వీడు మూడేళ్ళు ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్లను కంగారు పడవద్దని వుత్తరం రాసి మూడు నెలలపైన రెండు రోజులు గడిచిన తర్వాత వూళ్ళో కాలు పెట్టాడు. వచ్చీరాంగానే ఒక బాణా కర్ర నా చేతికిచ్చి తన వెనుకనే నడవమన్నాడు. అలాగే వెళుతున్నాం. పద్మారెడ్డి ఎదురుపడ్డాడు. నాకు ఒళ్ళంతా చెమటలు పోసి వణకటం మొదలెట్టింది. వీడు ఏ మాత్రం భయం లేకుండా ‘‘ఆజారే అబ్‌ మేరా దిల్‌ పుకారా’’ అంటూ గొంతెత్తి పాట మొద లుపెట్టాడు. వీడు నిద్రిస్తున్న సింహాన్ని జూలు పట్టుకుని లాగుతున్నట్లు నా మనోనేత్రం ముందు గోచరించాడు. పద్మారెడ్డి క్రూరంగా చూస్తూ ‘‘ఏం బే ఇంకా బుద్ధిరాలే. దిల్‌ పుకార్తా హై క్యా’’ అంటూ వీడి మెడ పట్టుకున్నాడు. వీడు చేపలా వాడి చేతుల్లోంచి జారి నా దగ్గరున్న బాణా కర్ర అందుకున్నాడు. మెరుపు వేగంతో గాలిలో రెండడుగులు పైకి లేచి కర్ర తిప్పటం మొదలెట్టాడు. అప్పుడు వాడు చూపరులకు కాలుతున్న విష్ణు భూచక్రాల్లా కనిపించాడు. కర్ర గాల్లో తిరుగుతున్న ‘‘కహకహ’’ ధ్వని పద్మారెడ్డి వంటిని అనేక భాగాల్లో తాకుతున్న చప్పుడు తప్ప సకల చరాచర ప్రపంచం స్తంభించింది. చాలా మంది గుమ్మాల్లో నిలబడి చోద్యం చూస్తున్నారు. అయిదే అయిదు నిమిషాల్లో వంట్లో అసంఖ్యాకంగా విరిగిన ఎముకల్తో పద్మారెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. వాడు ఆస్పత్రి నుంచి బయటికి రావటానికి జన జీవన స్రవంతిలో కలవడానికి ఆర్నెల్లు పట్టింది. పోలీసులతో తనను రెండు కోడెదూడలు కుమ్మాయని, ఎవరూ కొట్టలేదని చెప్పాడు. ఆ తర్వాత వాడు మాకు ఎక్కడ కనిపించినా నమస్కారం పెట్టేవాడు ‘‘ఇది ఎప్పుడు నేర్చుకున్నావురా’’ అంటే ఆ మూడు నెల్లూ మెడ్రాసులో సిన్మావాళ్ళకు స్టంట్‌ నేర్పే ‘‘అమ్బుమణి’’ అనే వాడికి శుశ్రూషచేసి నేర్చుకున్నాడట. సీతారాంగాడికి అంత ధైర్యం అంత పట్టుదల.