‘‘ప్రభువెక్కిన పల్లికి కాదోయ్‌ - అది మోసే బోయీలెవ్వరు? తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తినకూలీలెవ్వరు?’’ మైకులో నుండి ఒక కార్మికుడు ఆవేశంగా ఆలపిస్తున్న శ్రీశ్రీ కవిత రాజన్నకు లీలగా వినిపిస్తోంది.పదిహేను రోజులుగా వేసిన టెంట్లు వేసినట్లే వున్నాయి. జీతాలు పెంచలేదనే పంతానికి పోయి కార్మికులందరూ యజమాని మీద తిరుగుబాటుగా ప్రకటించిన సమ్మె వికటించే స్థితికి చేరుకుంది.యూనియను లీడరుగా రాజన్నకున్న పలుకుబడితో ఇన్ని సంవత్సరాలూ కర్మాగారంలోని కార్మికులకందరికీ న్యాయం జరిగేలా చూస్తూనే ఉన్నాడు. ఈ మధ్య, యువకులు కొందరు కార్మికులుగా చేరినప్పటి నుంచీ పట్టూ విడుపూ కోల్పోయి, అటు యాజమాన్యానికీ, ఇటు కార్మికులకూ కష్టనష్టాలూ కడగండ్లూ కొనితెస్తున్నారు.రాజన్న ఈమారు అయిష్టంగానే సమ్మెకు అంగీకరించాడు. మొహమాటపడి కయ్యానికి కాలు దువ్వితే మొహం చూపించుకోలేని స్థితి ఇప్పుడు ఎదురయ్యిందతనికి. దీనికేదో మార్గం చూడాలన్న ఉద్వేగంతో తన గుడిసెలోనుండి సైకిలుపైన బయలుదేరాడు రాజన్న.‘‘రాజన్నా! ఏదో ఒకలాగా దొంగల్దోల కూడదా?’’ అంటూ వీధిలో ఒక ముసలమ్మ పీక్కుపోయిన కళ్ళతో ఆశగా చూస్తూ అడిగింది. వెన్నెముకకు అంటుకుపోయిన డొక్కతో నీరసంగా ఉందామె అభ్యర్ధన.‘‘అన్నా! చిన్నోడు మంచాన పడ్డాడు. ఆసుపత్రికెళ్ళాలంటే చిల్లర లేదాయె...’’ ఒక ఇల్లాలు చిరిగిన చీరతో మాసిన జుట్టుతో దీనంగా చూస్తూ కొంగుతో కళ్ళద్దుకుంది.

రాజన్న ఆ మురికివాడ మధ్యలోనుండి పారుతున్న చిన్నచిన్న కుళ్ళు కాలువలను దాటుకుంటూ, తిరిగీ సైకిలెక్కి తొక్కుతున్నాడు. మెతుకు చేరని ఖాళీ కడుపులలాగా మనుష్యులు కన్పించని ఆ గుడిసెలు బావురుమంటున్నాయి. ముంగిట వృద్ధులు, పసిపిల్లలు ఆకలిని మరచిపోవడానికి ఏదో ఒక వ్యాపకంతో గడుపుతున్నారు. రాజన్నకు ఆవేశం కట్టలు తెంచుకుంది. అతను సమ్మె చేస్తూ పస్తులు పడున్న కార్మికుల శిబిరాన్ని పాత సైకిలుపై చేరుకున్నాడు. నినాదాలు ఆగిపోయాయి. ఏదో శుభవార్త చెప్తాడని అందరూ అతనివైపు ఆశగా చూసారు. రాజన్న మైకును అందుకున్నాడు.‘‘సోదరులారా! ఏ ఎన్నికైనా పట్టూ విడుపూ వుంటేనే రాణిస్తుంది. నేను నడిపిన రాయబారంలో మన కోరికల్ని చాలావరకు యాజమాన్యం అంగీకరించింది. ప్రస్తుత ఆర్ధిక మాంద్యం కారణంగా వాళ్ళకు ఎదురైన దుస్థితిని వివరించి పరిస్థితులు చక్కబడ్డాక మన మిగిలిన డిమాండ్లను పరిశీలిస్తామని మాట...’’ తన మాటకు అడ్డు తగులుతూ, తన చేతినుండి మైకును లాక్కున్న, ఒక యువ కార్మికుని వైపు ఆవేశంగా చూసాడు రాజన్న.‘‘కామ్రేడ్స్‌ ! యజమానులు చెప్తున్న కల్లబొల్లి కబుర్లు విని ఆందోళనను విరమించకండి. మనం లోకువ అయిపోతే మన డిమాండ్లు తీరవు...’’ అంటూ రెచ్చగొట్టడం, దానికి అర్ధమనస్కంగా, అన్యమనస్కంగా అందరూ అంగీకరించడం రాజన్న గామనించాడు.