శృంగవరం లింగన్నగారి పంపుసెట్టు దగ్గిర, సిగ్గెరగని ఆడతనం సబ్బు అరగదీసుకుంటోంది. లింగన్నగారి జీతగాడు వెంకటేశుకు ఇష్టం వున్నా లేకపోయినా, ఆ నిత్యకృత్యం మాత్రం ఆగిపోయేది కాదు.బారెడు పొద్దెక్కినా యింకా నిద్రమైకం వదలని ముఖాలతో నలుగురు ఆడవాళ్లు పంపునీళ్లకు అడ్డం పడ్డారు.రాక్షసిమూకకు జడిసి కకావికలై పోయే మునిగణంలా, పంపునీళ్లు హోరుమంటోంది. ఇరవైలోనే అరవైఏళ్ల అనుభవాన్ని నెత్తికెత్తికున్నందువల్లనేమో, వాళ్ల సొంపులూ, మేని వొంపులూ ముతకబారి పోయి, సహజంగా కాక, సొమ్ములు పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నాయి.వాళ్లు కచ్చికతో పళ్లు తోముకుని, తడిచీరలు చుట్టుకుని స్నానాలు చేస్తూ, రాత్రి తమతో గడిపివెళ్లిన విటుల విపరీత చేష్టల్ని గురించి - ఎంత నగ్నంగా చెప్పవచ్చునో అంత సూటిగానూ, స్పష్టంగానూ ఒకరికొకరు చెప్పుకోసాగారు. ఆ కబుర్లు వినటానికి ఆసక్తికరంగానే వున్నా, అక్కడ నిలబడటానికి సిగ్గు వేసింది వెంకటేశుకు. నీళ్లు ఎంతవరకూ సాగిందో చూచే నెపంతో, అతడు చెరకు తోటలోకి దారితీశాడు.చెరకు గుముల చాటు నుంచి వారకాంతల బూతు సల్లాపాలు శివాలెత్తిన గంగమ్మలా దూకుళ్లతో వినిపిస్తూనే వున్నాయి. బావికి ఇరవై బారల దూరంలో ఎత్తుగావున్న తారు రోడ్డుకు యివతల చింతచెట్ల గుబురునీడల కింద పూరింటి వాకిట నిలబడి, మార్కెట్టుకు వెళ్తోన్న కూరగాయల గంపను దింపించి బేరమాడుతున్న సుందరమ్మ అతడి కళ్లబడింది. క్యారుమని ఖాండ్రించి, ‘‘సిగ్గులేనోడు, సిగ్గులేనోడు!’’ అంటూ తుపుక్కున ఉమ్మేశాడు వెంకటేశు.లింగన్నలాంటి పెద్దమనిషి యిలాంటి పని మాత్రం చేసి వుండ కూడదు.వరసగా రెండుసార్లు పంచాయతీ సర్పంచ్‌గా వుండి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోయిన లింగన్న ముచ్చటగా మూడోసారి ఎన్నికైన తరువాతయినా తాగునీళ్లు లేని వాడల్లో బోరింగులు వేయించకపోతాడా, కటిక చీకట్లో మునిగి పోయిన వాడల్లో కరెంటు వెయ్యకపోతాడా అని ఆశలు పెంచుకున్నారు జనం.

 నీళ్లూ, నీటిదీపాలూ లాంటి చిన్న విషయాలెందుకని, ప్రజలకు పెద్ద సౌకర్యమే కలగజేసి పుణ్యం కట్టుకున్నాడు లింగన్న.శ్రీరామచంద్రుల వారి పేరు పెట్టుకున్న ఒక తిరుగుబోతు, సుందరమ్మను లేవదీసుకొచ్చి శృంగవరంలో కాపురం పెట్టాడు. సుందరమ్మకంటే మెరుగైన మరో బొమ్మను లేవదీసుకుని శృంగవరం నుంచీ మాయమయ్యాడు.‘అన్నా, ఆడదాన్ని! నాకు ఫలానా సాయం చెయ్యి’ అని లింగన్నను శరణు వేడింది, దిక్కులేని సుందరమ్మ.ఊరి చివర రోడ్డు పక్కనే లింగన్న పొలాలున్నాయి. ఆ పొలాలకూ రోడ్డుకూ మధ్యనున్న ఖాళీస్థలం హైవేస్‌ వారికి చెందుతుంది. వారం తిరక్కుండానే లింగన్న వెయ్యిరూపాయలు ఖర్చుపెట్టి అక్కడొక ఐదంకణాల పూరిల్లు కట్టించాడు. సుందరమ్మ ఆ యింట్లో నాలుగు వెదురు తడికలు అడ్డంపెట్టి, వ్యాపారం లోకి దిగింది. ఆ రంగంలో ఆమెకు అంతో యింతో అనుభవమూ, నేర్పూ వున్నట్లున్నాయి. చీకటివేళల్లో ఏ క్షణంలో వెళ్లినా మగవాడి మదనతాపం తీర్చడానికి ఆ యింట్లో నలుగురు గుమ్మలు సిద్ధంగా వుంటారు. వారానికి రెండు వారాలకూ పాతవాళ్లు ఎగిరిపోయి, కొత్తవాళ్లు దిగుతుంటారు.