‘‘పోస్ట్‌!’’పోస్ట్‌మేన్‌ కేక వినపడగానే ఒక్క ఉదుటున లేచి వెళ్ళి గుమ్మంలో నిలిచాడు మీసాలరాముడు.‘‘ఇదిగోనయ్యా, నీ రాజమండ్రి ఉత్తరం.. మూడు నెలలుగా అడుగుతున్నావు. ఆలస్యంగా అయినా వాళ్ళూ స్పీడు పోస్టులోనే పంపారులే!’’ అంటూ ఓ కవరు అందించి, సంతకం తీసుకున్నాడు పోస్ట్‌మేన్‌ స్వామి.‘‘ఇదిగో.. అదేనా?’’ అంటూ పెరట్లోంచి కోపంగా అరిచింది లక్ష్మి.‘‘ఆ! అదే లేవే!!’’ కాస్త విసుగ్గా అన్నాడు రాముడు.‘‘లెక్కకక్కుర్తి పడి ఎప్పుడైనా ఆ పాపపు పని చేసొస్తావు.. అందుకే మనకు బిడ్డా పాపా లేకపోయె!’’ అంటూ సణుక్కుంటూంది గానీ.. ఆమెకూ తెలుసు. అతడా పనికి పోయి వచ్చాక నాలుగు రోజులు లేదా నాలుగు వారాలు.. ఒక్కొక్క సారయితే నాలుగు నెలలపాటు ఇంట్లో కొంచెం వెసులుబాటుగా ఉంటుందని.ఆ పేద దంపతులకు పిల్లలు లేరు.మీసాలరాముడు రిక్షా బండి లాగుతాడు.మొదట్లో లక్ష్మి కూడా కొన్ని ఇండ్లల్లో పాచి పనులు చేసి వస్తుండేది. కానీ ఆమె భర్త అరుదుగా అయినా, తలారీగా పనిచేసి వచ్చాడని తెలిశాక ఆమెను పని నుండి తప్పిస్తూ వచ్చారు యజమానులు.ఆఖరికి ఆమే పాచిపనులు మానుకుని అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వాళ్ళ ఫ్రేములకు ఇంట్లోనే ఖాళీ అగ్గిపుల్లలు పేర్చడం అలవాటు చేసుకుంది. అయితే నెలంతా పుల్లలు పేర్చే పనివుండదు. అందువల్ల పూల దుకాణాలకు పూలు కట్టి ఇచ్చే పని కూడా చేస్తుంటుంది.

ఆటోరిక్షాలు బాగా అలవాటు అయ్యాక రిక్షా ఎకే ్కవారు బాగా తగ్గిపోయారు. అందువల్ల తన రిక్షాను సరుకుల రిక్షాగా మార్చుకుని బరువులు తొక్కడం మొదలు పెట్టిన రాముడు వయసు తెస్తున్న మార్పుతో రిక్షా తొక్కలేక బరువులు లాగడం అలవాటు చేసుకుంటున్నాడు.అయితే ఇద్దరి సంపాదనలూ కలగలసినా కరువులు లేని ఈ విచిత్ర కాలంలో బతుకుబండి నడవడం మాత్రం వారికి ఎప్పుడూ కష్టమే!లావణ్య వచ్చే వరకూ కాలు నిలువలేదు రాముడికి.లావణ్య వాళ్ళ పెంపుడు కూతురు!పదహారు సంవత్సరాల క్రితం దినాల పసికందును ఎవరో బస్టాండు ప్రాంతంలో వదిలిపోతే జాలితో రాముడు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశాడు.‘‘చెయ్యడానికేముందిరా? నీకు ఎటూ బిడ్డల్లేరు కదా, నీవే తీసుకుపోరాదూ? నీకు అక్కర్లేకపోతే నీ రిక్షాలోనే పెట్టుకుపోయి బేబీ వెల్‌కం హోంలో ఇచ్చి రావాల్సిందే. ఆపై నేను ఎస్సై ద్వారా ఉత్తరం పంపించే ఏర్పాటు చేస్తాను!’’ అన్నాడు హెడ్‌ కానిస్టేబుల్‌ కొయ్య బీరువాలోంచీ అనాథ శిశువుల తాలూకు ఫైలు తీసి బల్లమీద పెడ్తూ.బస్టాండులో పంచాయతీ నామా వ్రాయడం అయ్యాక, కానీ చూద్దామని ఆ పాపను ఇంటికి తీసుకపోతే ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది లక్ష్మి. కొన్నాళ్ళ తరువాత బిడ్డను సాక్కోవడానికి అనుమతి కూడా తెప్పించి ఇచ్చాడు హెడ్‌కానిస్టేబులు వెంకటస్వామి.