గుడ్డిసుక్క మెల్లమెల్లగా పైకెక్కతా వుండాది.యాపమాను కొమ్మల్ని ఇదిలించి వొళ్ళు విరుచుకునింది. ఆ అలికిడికి రాళ్ళ గూటిలో నుంచి ఉత్తీత ‘రెపరెపమని’ రెక్కలు కొట్టుకుంటా పైకి లేచింది. లోకమంతా నిద్దటి ఉయ్యాల్లో ఊగతావుండాది.ఉత్తీత శోకంగా పాటనెత్తుకునింది.‘‘ఉత్తీతా! ఉత్తీతా!!నిద్దట్లోన ఊరు జోగతా వుండాది ఉత్తీతా!నివురు గప్పిన నిప గుండెల్లోన గునస్తా వుండాది ఉత్తీతా!!మోడాన్ని తెచ్చి ఉత్తీతా! గాలి ఉయ్యాల్లోన ఉత్తీతా!ఉయ్యాలూపితినే ఉత్తీతా! జల్లున వాన కురిసినే ఉత్తీతా!!పచ్చని మోసులేసినే ఉత్తీతా! రాళ్ళల్లోన రాజనాలు పండినే ఉత్తీతా!’’ఉత్తీత గొంతులో దుక్కం తుంపర సనసన్నగా కురస్తా వుండాది. ఆ సీకట్లో దాని పాటని వింటా వుంటే దీపాలకి వొళ్ళు జల్లుమనింది.

‘‘అక్కా... ఆ ఉత్తీతకి నిద్దర రాదా? ఎందుకట్లా శోకంగా పాటపాడతా వుండాది?’’ అడిగింది మిద్దింటి దీపం.‘‘దాని శోకం గురించి ఏం చెప్పమంటావు చెల్లీ? దేవుడిచ్చిన శాపం అది. పొగులు లేదు రాత్తిరి లేదు. అలికిడైతే సాలు ఉలిక్కిపడి లేస్తింది. మిన్నూ మన్నూ ఏకమయ్యేట్టు ‘ఉత్తీతా ఉత్తీతా’ అని శోకంగా పాటపాడతా ఏడస్తానే వుంటింది’’ అని చెప్పింది పెద్దింటి దీపం.‘‘దానికి దేవుడు శాపమెందుకు ఇచ్చినాడు? ఏంటక్కా ఆ కత?’’ అని అడిగింది మిద్దింటి దీపం.‘‘పొగులు మాటలు పనికి పంచేటు. రేత్తరి మాటలు నిద్దరికి పంచేటు. ఇపడెందుకులే! మల్లెపడైనా చెపకుందాం. ఆ గోపినింటి దీపం వస్తే మనము దేవలోకానికి యలబారిపోవద్దా! ఇపడు కతలు చెపకుంటా కుర్చుంటే మన బతుకు తెల్లారిపోతుంది’’ అనింది పెద్దింటి దీపం.‘‘ఆ గోపినింటి దీపం ఎపడొస్తుందో, ఏమో! ఆలోపు ఈకత చెప్పక్కా! ఊరికే ఇట్లా కూచ్చోనుంటే తూగు వస్తావుండాది’’ అనింది మిద్దింటి దీపం.మిగిలిన దీపాలు కూడా కత చెప్పమని పోరుపెట్టినాయి.వాటి పోరు పడలేక పెద్దింటి దీపం కత చెప్పడం ఆరంభించింది.

దేవలోకంలో దేవుని పూలతోట వుండాది గదా! ఆ పూలతోటలో రకరకాల పూలమొక్కలున్నాయి. మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, పారిజాతాలు, చేమంతులు, చెండు మల్లెలు, అబ్బో... ఒగటా రెండా! ఎన్నెన్నో రకాల పూలు. వాటికి ఎన్నెన్నో వన్నెలూ, చిన్నెలూ! వాసనలూ!!