‘ఇల్లాలుకి కోటి దండాలు’వ్యాపార రంగంలో భర్తకి దీటుగా సంపాదిస్తూ పది మందికి ఉపాధి కలిగిస్తున్న ఇల్లాళ్ళ కోసం ఓ ప్రముఖ టీవి ఛానెల్‌ ఆరంభించనున్న వీక్లీ గేమ్‌ షో అది. ప్రతి వారం అలాంటి నలుగురు ఇల్లాళ్ళని పిలిచి పోటీ జరిపి-నెగ్గిన వారికి కోటి రూపాయలు బహుమతిగాఇస్తారుట. డెయిలీస్‌, వీక్లీస్‌, మంత్లీస్‌, టీవీస్‌-రోజూ ఎక్కడో అక్కడ ఆ ప్రకటన కనబడో, వినబడో మనసూరించేస్తోంది.కలలు కనండొహో అని అబ్దుల్‌ కలామంతటాయన ఘోషిస్తున్నాడు.కోటి రూపాయలు నా కల. అదేదో సినిమాలో ఆమనిలా-కోటిరూపాయలిస్తానంటే మొగుణ్ణీ, పిల్లల్నీ అమ్మేయగలను. తర్వాతఆ హీరోయిన్‌లా పశ్చాత్తాపపడను.బద్ధకంగా మంచం మీద పడుకుని కలలు కనే టైపు కాదు నేను. కోచింగుల్లో ములిగి ఇంజనీరునై అమెరికాలో సాఫ్ట్‌వేర్‌లో తేలాలనుకున్నా. నా మార్కులకి ఫ్రీ సీటు రాలేదు. డొనేషన్‌ కట్టి చదివిస్తే ఉద్యోగమొచ్చిన ఆర్నెల్లలో అణాపైసలతో బాకీ తీరుస్తానని అమ్మానాన్నల దగ్గర చెవినిల్లు కట్టుకుని పోరాను. డొనేషన్‌ కట్టడానికి నువ్వేమైనా అబ్బాయివా అంటూ నన్ను డిగ్రీలో చేర్పించారు. డిగ్రీ అవగానే నాన్న నేనడిగిన డోనేషన్‌ కంటే పెద్ద కట్నమిచ్చి ఓసాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుకి నన్ను కట్ట బెట్టారు.కట్నమివ్వడం నా వ్యక్తిత్వానికి అవమానమని గోలెట్టాను.‘‘ఇది కట్నం కాదే. అల్లుడి ఇంజనీరింగ్‌ చదువుకి డొనేషన్‌. నువ్వు చదువుకి ముందడిగావు. అతను చదువయ్యాక అడిగాడు. నీకిస్తేనేం- అతనికిస్తేనేం-మీరిద్దరూ ఒకటేగా’’ అంది అమ్మ.నిజమేనని పెళ్ళయ్యాక అనిపించింది. అప్పుడు మేమిద్దరం ఎంత ఒకటంటే-అమ్మానాన్న ఇల్లూ వాకిలీ అమ్మేసుకుని ఆ డబ్బంతా మాకిచ్చేసి తామే గుడిసెలోకైనా మారిపోతే- వాళ్ళ ప్రేమకి సంతోషించి ఊరుకునేదాన్ని తప్ప వాళ్ళేమైపోతారని బాధపడేదాన్ని కాదు.కాపురానికి వెళ్ళగానే ఉద్యోగం చేస్తానన్నాను.

‘‘పెళ్ళైన కొత్త. నువ్వు నా గురించీ, నేను నీ గురించి తప్ప ఆలోచించవద్దు. ఉద్యోగం చేస్తే అది కుదరదు. పొట్ట కూటికి ఇద్దరిలో ఒకరు ఉద్యోగం చేయ్యకా తప్పదు. జీతం విధం చెడ్డా ఫలం దక్కేలా ఉండాలి కాబట్టి- ఆ ఉద్యోగం నేను చెయ్యడం సబబు. తీరిక వేళల్లో మనిద్దరి తరఫునా నువ్వే ఆలోచించేసేయ్‌. కలిసున్నప్పుడవి తియ్యగా పంచుకుని ఎంజాయ్‌ చేద్దాం’’ అన్నారాయన. మీ జీతమెంత-అనడిగాను. బదులుగా నా వయసెంతో అడగనని మాటిచ్చారు. బుద్ధి బైటపెట్టుకోవడంకానీ-ఆలూమగలం-జాతకాలూ, జీతాలూ ఒకరివొకరికి దాస్తే దాగుతాయా? అదేదో సినిమాలో ఉదయ్‌కిరణ్‌లా ‘‘ఈ మగాళ్ళున్నారే’’ అనుకున్నా. వాళ్ళు ఆడవాళ్ళని వంటింటి కుందేల్ని చెయ్యడానికి ఏమేమో మాయమాటలు చెప్పి నమ్మిస్తారునమ్మి రెండేళ్ళు వంటింటి కుందేలుగా ఉన్నా. ప్రేమలో ఊపిరి సలపకపోతే-లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నానని కూడా నమ్మా. అంతలో ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరు పిల్లలు పావని, సాత్విక్‌. వాళ్ళ కక్కులూ,ఉచ్చలూ,పీతుళ్ళూ ఎత్తుతూ-అదే మహాభాగ్యమని మురవడం నా వంతు. నేను నీళ్ళోసి నీటుగా ముస్తాబు చేసాక వాళ్ళనోసారి ఎత్తుకు ముద్దాడి తన వారసులని గర్వపడ్డం మాయన వంతు.