గమ్యం వైపు దూసుకుపోతోంది బస్సు... సీట్లో వెనక్కు జేరబడి కూర్చుని ఆలోచిస్తున్నాను.. ‘వాడెందుకలా అన్నాడు..?’ మళ్ళీమళ్ళీ ఆలోచన అటు వైపే వెళ్తేంది! ఏమిటో... చిన్న విషయానికైనా అతిగా పట్టించుకొనే ఈ మనస్తత్వం నన్ను వదిలిపోవడం లేదు. అయినా నా గురించి వాడికి పూర్తిగా తెలుసుకదా.. మరి వాడెందుకలా అన్నట్టు.... ఏమైనా వాణ్ణి కలుసుకొని ఈ విషయం అడిగేసేంత వరకూ నా మనసు నిలబడేట్టు లేదు.బహుశా మరోగంటలో వాడి దగ్గరుంటాను. నా కథల్ని బాగా అభి మానించే సాహితీ మిత్రుడు, పబ్లిషరు అయిన సత్యమూర్తి నా కథల సంకలనం వేస్తానన్నాడు. రచనలు చేయడం మొదలు పెట్టిన తక్కువ కాలంలోనే సంకలనం రావడం నిజంగా అదృష్టమే అని విషయం తెలిసిన కొంతమంది మిత్రులు అభినందించేరు. నేనింకా ఈ విషయం చందూకి చెప్పలేదు. వచ్చే నెలాఖరులో పుస్తకం విడుదల ఉంటుంది. ఈ విషయం నేను స్వయంగా వెళ్ళి వాడికి చెప్పాలనిపించింది. అందుకే ఫోన్లో చెప్పలేదు. నా సాహిత్య ప్రయాణం ప్రారంభమవడానికి కారకుడే వాడు.. అందుకే వాడి చేతుల మీదుగానే నా పుస్తకం ఆవిష్కరణ జరగాలని నిర్ణయించుకున్నాను.

 ఈ విధంగా వాణ్ణి కలుసు కొంటున్నందుకు సంతోషంగా వుంది.ఇలా చెప్పాపెట్టకుండా అకస్మాత్తుగా వచ్చినందుకు వాడు ఆశ్చర్య పోతాడు. అయినా నా రాక వాడికి ఖచ్చితంగా సంతోషాన్నే కలిగిస్తుంది. అందులో అనుమానం లేదు. కానీ.. ఆ రోజు వాడెందుకలా... అన్నాడు? ష్చ్‌ ఏదో తమాషాకి అని వుంటాడు. అనవసరంగా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను. అసలీ గుణం నన్నెప్పుడూ వదిలిపోతుందో అర్థం కావడం లేదు. ఎలా వదుల్తుంది? పుట్టకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదంటారు. ఇదీ అలాంటిదే కాబోలు!అయినా ఆరోజు వాడు తమాషాకి అన్నట్టు లేదే....?! ఏదో సూచన ఇచ్చినట్టు అన్నాడు. నేను యథాలాపంగా ‘వచ్చే నెల మీ ఇంటికి వస్తాలేరా.. అబ్బాయిని కలిసి కూడా చాలా రోజులైంది..’ అన్నాను. వాడు వెంటనే ‘లేదులే.. నేనే మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను..’ అన్నాడు. అలా ఎందుకన్నాడు? అందులో ‘నువ్వు రావొద్దులే.. నేనే వస్తాను..’ అన్న సూచనలేదూ..? మరి వాడెందుకలా అన్నట్టు? కొంపదీసి కొడుకుతో వాడికేమైనా గొడవలవుతున్నాయా? నేను వస్తే అదంతా నాకు తెలియడం ఎందుకులే అనవసరంగా... అనుకున్నాడా? అలా అనుకోడానికి నాదీ, వాడిదీ మామూలు స్నేహమా? నేను నా భార్య తోనూ, వాడు వాడి భార్యతోనూ చెప్పకుండా దాచిన విషయాలుంటా యోమే గానీ మా మధ్య ఎలాంటి రహస్యాలు లేవే..! మరి అలాంటప్పుడు వాడలా అనుకునే అవకాశం లేదు. పైగా వాడే నాతో చెప్తాడు కూడా... అసలదే నిజమైతే నేను అబ్బాయితో మాట్లాడి సర్దుబాటు చెయ్యడానికి ప్రయత్నం చేస్తాను కదా.. ఛ...ఛ ఇదంతా ఏమీ కాదు. అసలు శ్రీధర్‌ కూడా అలాంటివాడు కాదు... ఇవన్నీ నా ఊహా గానాలే...! మరి ఇంతకీ వాడెందుకలా అన్నట్టు..? ఎంత విదిలించు కొందామనుకున్నా పురుగు దొలిచినట్టుగా మళ్ళీ మళ్ళీ ఆ ఆలోచన వస్తూనే వుంది.