‘తలనిండ పూదండ దాల్చిన రాణి..’ ఘంటసాల మధుర స్వరం సన్నగా వినిపించసాగింది. గ్రామఫోన్‌ రికార్డుల ద్వారా క్యాసెట్టుల ద్వారా సిడిల ద్వారా శ్రోతలని రంజింపచేసిన అమర గాయకుడి స్వరం ఇప్పుడు సెల్‌ఫోన్‌ రింగ్‌ టోన్‌గా కొత్త అందాలను సంతరించుకుంది.అయితే టీవీ ఎదురుగా సోఫాలో సగం కూర్చుని సగం జారబడిన భంగిమలో నిద్రపోతున్న సూర్యానికి కొద్ది క్షణాల తరువాత కాని సెల్‌ పంపిస్తున్న సంకేతాలు అందలేదు.మెలకువ రాగానే అప్రయత్నంగా చేతిలో ఉన్న రిమోట్‌ని చెవి దగ్గర చేర్చి హలో అన్నాడు. అంతలో చేసిన పొరపాటు గ్ర హించి సెల్‌ అందుకున్నాడు... ఈ సమయంలో ఎవరు ఫోన్‌ చేశారా అన్న కంగారుతో గొంతు వణికింది. ‘హ..హలో..లో !’ అన్నాడు సూర్యం.‘నేనురా ! భాస్కర్‌ని’ పన్నెండు గంటల సమయ భేదాన్ని కొన్ని వేల కిలో మీటర్ల దూరాన్ని దాటి వినబడుతున్న స్నేహితుడి స్వరం సూర్యంలో అయోమయాన్ని ఇంకాస్త పెంచింది.‘భాస్కర్‌ ! ఎలా ఉన్నావు ?’ తడబడుతూ అడిగాడు సూర్యం.భాస్కర బోలుగా నవ్వాడు. ‘మనసు బాగా లేదురా..అందుకనే నీకు ఫోన్‌ చేశాను’భాస్కర్‌ సూర్యం కాలేజీలో స్నేహితులు. చదువు అయ్యాక ఉద్యోగాల వల్ల దూరంగా ఉన్నా రిటైర్‌ అయ్యాక ఇద్దరూ ఒకే కాలనీలో స్థిరపడ్డారు. సూర్యం పిల్లలు ఇద్దరూ ఇండియాలోనే ఉంటున్నారు కానీ భాస్కర్‌ ఒక్కగాని ఒక్క కొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్నాడు.రెండేళ్ళ క్రితం భాస్కర్‌ భార్య పోయింది. అప్పుడు ఇండియాకి వచ్చిన భాస్కర్‌ కొడుకు తాను ఓ ఇటాలియన్‌ అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నట్లు తండ్రికి చెప్పాడు.

‘ఏడాది నుంచి నేను సంబంధాలు చెబుతుంటే ఏదో ఒక వంక పెట్టేవాడు..అసలు సంగతి అదన్నమాట! ఇప్పుడు చల్లగా ఎవరో తెల్ల తోలు అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానన్న బాంబు పేల్చాడు.. ఏం చేయాలి ?.. నేను కాదన్నా ఔనన్నా వాడి ఇష్టం వచ్చినట్లు వాడు చేసుకుపోతాడు. అందుకనే సరే అన్నాను’ అని ఆ తరువాత సూర్యం దగ్గర బాధపడ్డాడు భాస్కర్‌. ‘ఇప్పుడు చూడు తల్లి పోయిన మూడు నెలలకే పెళ్ళి అంటున్నాడు.. అయితే అక్కడే చేసుకో అన్నాను.. చర్చ్‌లో పెళ్ళిట.. అంతోటి భాగ్యానికి నేను రాలేను అని కూడా చెప్పాను’ అన్నాడు భాస్కర్‌. అంతే కాదు, ఆ తరువాత కొడుకుతో ముభావంగా ఉండటం క్లుప్తంగా మాట్లాడి ఫోన సంభాషణని తుంచేయడం మొదలు పెట్టాడు. అయినా అతని కోపం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎప్పటినుంచో భాస్కర్‌ని అమెరికా రమ్మనమని కొడుకు అడుగుతుండేవాడు. చివరికి తనకి పూర్తిగా అర్థం అవని యాక్సెంట్‌లో కోడలు కూడా ఆహ్వానించాక భాస్కర్‌ ఒప్పుకున్నాడు. అతను అమెరికా వెళ్ళి రెండు వారాలు అవుతున్నది.. ఆ దేశంలో కాలు పెట్టగానే ఫోన్‌ చేశాడు.. తిరిగి మళ్ళీ ఇప్పుడు.. అదీ అర్థరాత్రి సమయంలో..