రాత్రి పదిగొట్టినంక జరూర్‌ పనిబడ్తెనే మా వాడకట్టు జెనం ఇండ్లల్ల కెల్లి ఇవుతలకు వొచ్చేటోల్లు. మా ఊర్లె కరెంటు లేకుండ బట్కె రాత్రిపూట శీకటి రాజ్జెం ఎదురులేకుంట నడ్సేది. మా వాడకట్టుల రెండు కంబలకు పెద్ద కందెలున్నయి. గవ్విటి కెల్లి వొచ్చే ఎల్గు సాలేది గాదు. ఎన్నెల గాస్తున్నపడు మా ఊరి జెనం బజార్ల దిర్గెటోల్లు. ఆడోల్లు ఇండ్ల ముంగటి ఆర్గుల మీద గూసోని ముచ్చటబెట్టెటోల్లు. పోరగాల్లు కబడ్డి ఆడెటోల్లు. ఎన్నెల గాసే దినాలల్లనే మా వాడకట్టు చౌరస్తల బాగోతాలాడెటోల్లు. కడ్మదినాలల్ల మా ఊరోల్లు జరూర్‌ పనిబడ్తెనే ఇండ్లల్లకెల్లి ఇవుతలకు వొచ్చెటోల్లు.శీకటి గాంగనే పోరగాల్లను ఇండ్లల్ల కెల్లి బోనిచ్చెటోల్లు గాదు. శీకట్ల దయ్యాలు, బూతాలు దిర్గుతయని, గవ్వి ఎత్కబోతయని బుగులు బెట్టెటోల్లు, లంబడి దయ్యాల గురించి కతలు జెప్పెటోల్లు. బుడ్డపోరగాల్లు గిన జిద్దు జేస్తె దయ్యంకు బట్టిస్తఅని బెదిరిచ్చెటోల్లు. సర్కారు దవాకాన, పెద్దబడి నడ్మ ఒక మర్రిచెట్టు వుండేది. గా చెట్టు మీద దయ్యాలున్నయనేటోల్లు. రాత్రి పూట అటు దిక్కు ఎవ్వరు బోయెటోల్లు గాదు. సాకలోల్ల పొల్ల సత్తెవ్వకు కడ్పు అయినంకఅసల్‌ సంగతి బయటపడ్డది. సత్తెవ్వ, బెస్తోల్ల పోరడు దుర్గయ్యరాత్రి పూట మర్రిచెట్టు కింద గల్సెటోల్లు. ఎవ్వరు అటు దిక్కు రాకుంట వుండెతందుకు మర్రి చెట్టు మీద దయ్యాలున్నయని గాల్లే పుకారు బుట్టిచ్చిండ్రు.మా ఊల్లె ఒక దిక్కు తేల్లు, పాములు జెనంను తంగ్‌జేస్తుంటె ఇంకో దిక్కు జెనంను దొంగలు తంగ్‌జేసెటోల్లు. రాత్రి పూట బజార్కుబోయె పనిబడితె ఒక చేత్ల కందిలి, ఇంకొక చేత్ల కట్టెబట్టుకోని బోయెటోల్లు. పాములు గర్సి యాడాదికి ఒకరిద్దరు మా ఊర్లె సచ్చెటోల్లు.

హమాలి మల్లయ్య పాము మంత్రం ఏసెటోడు. మా ఇంటి ఎదురుంగ ఆ పుసలోల్ల బ్రమ్మయ్య యెండి, బంగారి సొమ్ములు జేసెటోడు. మంచాలోల్ల వరాలు పెండ్లి వుంటె సొమ్ములు జేపిచ్చెతందుకు బ్రమ్మయ్య తాన్కి బోయిండ్రు. బంగారం ఇచ్చి గొలుసు ఏతీర్గ జెయ్యాలెనో జనమ్మ జెప్పబట్టింది. వరాలు గామె బిడ్డనే. బ్రమ్మయ్యతోని ముచ్చట బెట్టుకుంట ఎందుకో గామె మీదికి సూసింది. ఇంటి కపల మెస్లుతున్న పాము గామెకు గండ్లబడ్డది. ఆట్న జనమ్మ లేచి నిలబడి-