రామయ్యకి ఆరోజు రాత్రి నిద్ర పట్టడం లేదు. నిద్ర దూరం కావటానికి కారణం అనారోగ్యం కాదు. పిల్లల మీద దిగులు కూడా కాదు. తనకు అన్నంపెట్టి దారితెన్ను చూపించిన పిండిమర గురించి. పిండిమర తనకు తల్లివంటిది అనీ, తన తల్లీ నవమాసాలు మోసి తనను కంటే పిండిమర తనను తన కుటుంబాన్ని జీవితకాలం వరకు మోస్తూనే వుంది. ఇప్పటి వరకు తనకు ఆరోగ్యం బాగానే వుంది. రేపు అనారోగ్యం చేసి తాను మూలనపడితే పిండిమర పరిస్థితి ఏమవుతుంది అని దిగులు.ఇంతలో తలుపు చపడైంది. తలుపు తీశాడు.రామయ్య కొడుకు కృష్ణప్రసాద్‌ లోపలికి వచ్చాడు.‘‘ఉద్యోగం సంగతి ఏమైందిరా?’’ ఆతృతగా కొడుకును ప్రశ్నించాడు రామయ్య.‘‘నాన్నా లక్ష రూపాయలు ఇచ్చావంటే ఉద్యోగం మనదేనాన్నా’’ సంతోషంగా అన్నాడు కృష్ణప్రసాద్‌.ఉద్యోగం అంటూ నీవు వెళ్ళిపోతే నా పిండిమర ఏమవుతుంది? అని ప్రశ్నించాడు రామయ్య.‘‘ ఏహే ఎపడూ పిండిమర చూసుకో అంటావేమిటి? నేను చదివిన చదువుకు పిండిమర అంటూ యంత్రాల దగ్గర పనిచేయాలా? అరలాగు వేసుకుని ఆ దుమ్ముధూళి వళ్ళంతా చేసుకోమంటావా? నీ కొడుకు సుఖంగా బతకటం నీకు ఇష్టం లేదా? అని అన్నాడు కృష్ణప్రసాద్‌.

‘‘మా అమ్మ నవమాసాలు మోసిన తర్వాత నేను పుట్టాను. నీ తల్లి నవమోసాలు మోశాక నీవు పుట్టావు. మా అమ్మలేనిదే నేను లేను, మీ అమ్మ లేనిదే నీవు లేవు. పిండిమర అన్నపూర్ణదేవిరా అమ్మలా అన్నం పెట్టింది. నన్ను నలుగురిలో నిలబెట్టింది. పిండిమర చూసుకుంటూ నా కళ్ళముందు తిరుగుతూ ఇక్కడే వుండు. నీవు ఇక్కడ సంతోషంగా వుండాలి. మేము ప్రశాంతంగా వుండాలి. అందులోనే వుంది ఆనందం’’ అని అన్నాడు రామయ్య.‘‘నాకు లక్ష రూపాయలు ఇవ్వవన్న మాట’’ అన్నాడు కృష్ణప్రసాద్‌.‘‘ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? వెనకటికి ఎవడో తన పొలం కౌలుకి ఇచ్చి తాను కూలికి వెళ్ళాడట. అలా వుంది నీ పరిస్థితి’’ అని అన్నాడు రామయ్య.‘‘నాకు లక్ష రూపాయలు ఇస్తే నీకు లక్షల కట్నం తెచ్చే కోడలు వస్తుంది నాన్నా’’ అన్నాడు కృష్ణప్రసాద్‌.