‘‘మళ్లీ ఫోనేమైనా చేసారా?’’ భాస్కర్‌ను ఉద్దేశించి అడిగాడు చంద్ర. ఇప్పటికా ప్రశ్న ఏ ఇరవై, ముప్పయిసార్లు అడిగి ఉంటాడో! అయినా భాస్కర్‌ ఓపిగ్గా, ‘‘ఇప్పుడే ముంబై ఎయిర్‌పోర్టులో దిగారట. కనెక్టింగ్‌ ఫ్లయిట్‌ సాయంత్రం నాలుగు గంటలకు. ఇక్కడ దిగి ఇంటికొచ్చేపాటికి ఏ ఏడో ఎనిమిదో అవుతుంది’’ ఏదో ఆలోచిస్తూ చెప్పాడు.అతను చాలా నీరసంతో ఉన్నాడు. కళ్లలో అలసట తెలుస్తోంది. జాలిగా చూసాడు చంద్ర.రెండ్రోజులుగా నిద్రలేక తాము! ఎదురుగా శాశ్వత నిద్రలో జయరాం!‘అద్దాల మేడలు మనకెందుకు గురూ’ అన్న వాడు అద్దాల పెట్టెలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలుపెరుగక మాట్లాడే వ్యక్తి శాశ్వతంగా మాట్లాడటం మానేసాడు.‘‘ఎలా జరిగింది?’’ సందర్శకులెవరో ప్రశ్నిస్తున్నారు.విషయం తెలిసిన వాళ్లెవరో స్వచ్ఛందంగా చెబుతున్నారు. రెండ్రోజుల నుండి చెప్పీ, వినీ విసిగిపోయిన సమాధానం-‘‘మొన్న సాయంత్రం సారు మెయిన్‌ రోడ్‌ నుండి స్కూటర్‌లో ఇంటికి వస్తున్నారు. ఒక కారు వాడు ఓవర్‌స్పీడ్‌లో డివైడర్‌కి అటు వెళుతున్నాడు. ఆ స్పీడ్‌లో వాడికి ఎదురుగా లోస్పీడ్‌లో వెళుతున్న బస్సు కనబడలేదట. ఒక్కసారి స్పీడ్‌ కంట్రోల్‌ చేయలేక రైట్‌కి తిప్పాడు. బండి కంట్రోల్‌ తప్పి డివైడర్ని గుద్ది ఆరేడడుగులు గాల్లోకి లేచి పల్టీలు కొట్టి కింద పడింది. ఆ పడడం పడడం, కారుతో సహా ఎగిరి డివైడర్‌కి ఇటు సైడ్‌ వస్తున్న సార్‌మీద పడ్డాడు. అంతే...ఒక్క దెబ్బకే బండి, దాన్ని నడుపుతున్న జయరాం సారు నుజ్జు నుజ్జయిపోయారు. స్పాట్‌లోనే సార్‌ ప్రాణం పోయింది.’’

‘‘కారు ఏమయిందో? వాడికేమన్నా దెబ్బలా? ఎవరిది కారు?’’ గుంపుల నుండి ఉపప్రశ్నలు. ‘‘కారు ఒక స్టూడెంట్‌ నడుపుతున్నాడు. వాళ్ల నాన్నకి ఒక బయో టెక్నాలజీ కంపెనీ ఉందట. ఈ సంవత్సరమే కొడుకు ఇంజనీరింగ్‌లో చేరినందుకు కారు కొనిచ్చాడట. ఆ కారుకి ఎబిఎస్‌ సదుపాయం ఉన్నందున ఆ పిల్లవాడికి ఏమీ కాలేదు.’’‘‘సార్‌కి పిల్లలెంత మందో?’’ మళ్లీ ఎవరో అడిగారు.‘‘సార్‌కి ఇద్దరు కొడుకులు. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. మేడమ్‌ లేరు. చనిపోయి దాదాపు పదిహేనేళ్లవుతోందట.’’చంద్రకి పదిహేనేళ్ల క్రితం సన్నివేశ ం జ్ఞాపకమొచ్చింది.అప్పుడు ఇదే ఇంట్లో ఇదే చోట జయరాంని ఓదారుస్తూ తను, భాస్కర్‌. తరువాత జయరాం పెళ్లి చేసుకోలేదు. పిల్లలు చిన్నవాళ్లు కదా చేసుకోమని బంధువులు పోరుపెట్టినా వినలేదు. ఓపికగా పదేళ్లు తల్లీ తండ్రీ తానై వాళ్లను పెంచాడు. పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు. ముందు పెద్దవాడు, ఆ తరువాత వాడి ప్రోత్సాహంతో చిన్నవాడు అమెరికాకు వెళ్లిపోయారు. ఒంటరితనాన్ని జయించడం కోసం ఆ వయసులో జయరాం ‘లా’ చదివాడు. మిత్రులందరికీ తన ఆఫీస్‌నే అడ్డాగా మార్చాడు. భాస్కర్‌ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేసే ప్రతి పనికి జయరాం ఆశీస్సులు, అండదండలు ఉండేవి. బీదవాళ్లకు సాయపడే లాయర్‌గా పేరు తెచ్చుకున్నాడు.