‘‘మన త్రినాథ్‌ కొత్తగా ఇల్లు కట్టాడు తెలుసా?’’ అన్న సుబ్బారావు మాట విని ఉలిక్కిపడ్డాను.అంటే సుబ్బారావు నాకు మళ్ళీ వాస్తు గురించి చెప్పబోతున్నాడన్నమాట. నా గుండె దడదడా వణికింది. ఎక్కడ ఏ ఇల్లు ఎలా కట్టబడినా వాస్తుమూలల గురించి, వాటిలో ఉన్న గుణదోషాలతో అవతలివారిని ఊదరగొట్టి చంపేయడంలో సుబ్బారావు సిద్ధహస్తుడైపోయాడు మరి.‘‘ఆహా, అలాగా’’ అన్నాను నేను ముక్తసరిగా.‘‘కానీ చాలా దోషాలతో కట్టేశాడురా, ఎవరినైనా అడిగి ఉండాల్సింది పాపం. ఈశాన్యంలో ఎత్తు పెంచేశాడు పాపం. పైగా నైరుతి కాస్తా వంపు కూడా వచ్చింది’’.‘‘పాపం’’ అన్నాను నేను కాస్త వ్యంగ్యంగా.‘‘అవును’’ అంటూ వాడు నా వ్యంగ్యాన్నేం పట్టిచుకోకుండా వాస్తు దోషాలు, వాటి సవరణలు, వివరాలు అంటూ ఎక్స్‌ప్రెస్‌ రైల్లా చెపకపోతున్నాడు.నిజం చెప్పాలంటే సుబ్బారావు వ్యక్తిగతంగా మంచివాడే కానీ ఈ మధ్య సంవత్సరకాలంగా ఈ వాస్తు గురించి తెలుసుకొని ఒకటే నసపెట్టేస్తున్నాడు.

ఆ మధ్య వాడు పని దొరక్క ఒక ప్రయివేటు లైబ్రరీలో పని కుదిరాక, అందులో దొరికే రకరకాల పుస్తకాలను చదవడమే పనిగా పెట్టుకున్నాక, తన ఇంట్లో తిష్టవేసుక్కూర్చున్న దారిద్ర్యానికి వాడి నిరుద్యోగానికి, వాడి అక్కకు పెళ్లికాకపోవడానికి,తన ఇంట్లో వారి కష్టానికి, వాడి బాబు చావకముందే కట్టిన తన పెంకుటిల్లే కారణం అనుకుంటూ, ఆ ఇంట్లో ఉంటూ ఏ ఏ దోషాలకు తాను ఎలాంటి కష్టాలు అనుభవించిందీ బేరీజు వేసుకుంటూ వాస్తు విజ్ఞానంలో దాదాపు పండితుడైపోయినట్లుగా తయారయ్యాడు.అయితే ఎంతటి పండితుడైనా ముందు తాను ఆచరించి ఆ ప్రయోజనం తనకు సిద్దించాక చెబితే ఎవరైనా వింటారు కానీ దుర్బర దారిద్య్రం, ఎడతెగని నిరుద్యోగంలో మగ్గుతున్న సుబ్బారావు గాడి వాస్తు జ్ఞానం గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరూ పట్టించుకోరు. అయినా వాడు వాస్తు గురించి చెబుతూనే ఉంటాడు.ప్రస్తుతం నా దగ్గర కూడా అదే సాగుతోంది.‘‘ఒరెయ్‌ అంత ఇల్లు కట్టించుకునే వాడు ఆమాత్రం మంచీచెడ్డా చూపించుకోకుండా కట్టించాడంటావా నువ్వెందుకలా హైరానా పడిపోతావు?’’ అన్నాను నేను వాడి వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని. కానీ వాడు ఆగితేగా?