అడుగు పొడుగూ, కనీసం రెండు కేజీల బరువూ ఉన్న బైనాక్యులర్స్‌ని నా నుంచి బలంగా లాక్కున్నాడు, నాలుగేళ్ళ తరుణి. దాంట్లోంచి, దూరంగా సముద్రంలో ఆగి ఉన్న ఓడల్ని మేం చూసినట్టుగా తానుకూడా చూడాలనీ, తాను ఎక్కబోయే ఓడ ఎట్లా ఉంటుందో ఊహించుకోవాలనీ వాడి ఉబలాటం. వాడి మూడేళ్ళ చెల్లెలు, తార, కూడా తక్కువదేమీ కాదు. వాడి దగ్గర్నించి ఆ చైనా బైనాక్యులర్స్‌ని తానూ లాక్కోబోయింది. వాడివ్వలేదు. అన్నాడు,‘‘నీకెందుకే ఇది, నువ్వు ఓడల్ని లెక్కపెట్టగలవా?’’కళ్ళు తిప్పుతూ తార అంది, ‘‘ఆఁ.’’‘‘అయితే మనం ఎక్కే ఆ చివ్వరి ఓడ ఎన్నోదో చెప్పు.’’తార, తనక్కనిపిస్తూన్న ఓడల్ని లెక్కబెట్టింది.‘‘అది ఒకటీ, అది అయిదూ, అది ఏడూ, ఆ చివ్వరిది మూడు.’’విసుక్కుంటూ అన్నాడు తరుణి, ‘‘సరే, రైటేలే.... మన ఓడ మీద నాన్న ఉన్నాడో లేడో నేను చూసి నీకు చూపిస్తా, నాతో రా’’- ఇట్లా అంటూ తారని ఆ డాబా మీద రెండోమూలకి తీసుకెళ్ళాడు ఆ నాలుగేళ్ళ తరుణి.మేం ముగ్గురమూ-నేనూ, మా శ్రీమతీ, మా అన్నయ్యగారి కోడలు కామాక్షీ-నవ్వుకున్నాం.కామాక్షి సంతానమే తరుణీ, తారా-ను. మేం అయిదుగురమూ మంగళూరులో పెరంబూరు బీచ్‌లో ఉన్న, ఓడల రాకపోకల కంట్రోల్‌ టవర్‌ పై అంతస్తు మీద, నుంచోనున్నాం.

 మా వరసకి కోడలు కామాక్షి భర్త మొదటి ఇంజనీరుగా పనిచేస్తున్న ఓడ, అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయి ఉంది. దాన్నే ఇందాకట్నించీ మేము బైనాక్యులర్స్‌ లోంచి చూస్తున్నది! అసలు మా దంపతులం మంగళూర్లో ఉన్న మా అల్లుడి ఇంటికి చుట్టపు చూపుగా వెళ్ళాం. వారానికల్లా విశాఖపట్నం నించి మా అన్నయ్య గారి కోడలు కామాక్షి కూడా తన ఇద్దరు పిల్లల్తోనూ వచ్చి మమ్మల్ని చేరింది. ఓడలో తన భర్త మొదటి ఇంజనీరు అనీ, ఆ ఓడ మంగళూరు రేవుకు వస్తుందనీ, తన పిల్లలూ తను అదే ఓడ ఎక్కి తన భర్తతో కలిసి చైనా వెళ్ళి తిరిగొస్తామనీ-చెప్పింది. అయితే, ఆ ఓడ మంగళూరు ఎప్పుడొచ్చేదీ ఖచ్చితంగా తెలుసుకోమని నన్ను కోరింది.నేను ఫోన్‌ ఎత్తాను, ‘‘హల్లో, చెన్నై కార్గోషిప్‌ల క్లియరింగ్‌ హౌసేనా?. . . ఎమిరేట్స్‌ ట్రాన్స్‌పోర్టింగ్‌ కంపెనీయేనా?చెన్నై నించి వినబడింది, ‘‘యస్‌, ఇ.టి.సి.నే. ఓనర్‌ని మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ని మాట్లాడుతున్నాను.’’‘‘సర్‌ చైనా నించి రావలసిన మీ ఓడ మంగళూరు ఎప్పుడొస్తుంది?. . . మంగుళూరులో మా బోర్డింగుంది.’’‘‘నాకున్న యాభై ఓడల్లో ఏ ఓడ గురించి చెప్పమంటారు? . . . అయినా మంగళూర్లో మీ లోడింగ్‌ ఉండటమేంటి? . . . కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ వారిదే గదా మంగళూరు రేవులో లోడింగంతా?’’