ఆదివారం సాయంత్రం ఐదు గంటల వేళ ‘‘సినిమా కెడదాం పదండి ఏం తోచడం లేదు’’ ఓ శ్రీమతి శ్రీవారితో అంది.ఇంటాయన పేపరులో ‘సుడోకు’ నించి తలెత్తి ‘‘లేడికి లేచిందే పరుగన్నట్టు’’ హఠాత్తుగా ఆదివారం ఐదు గంటలకి సినిమా కెడదాం అంటే ఏ సినిమాకి టిక్కెట్టు దొరుకుతుంది’’ ఎత్తిన తల మళ్లీ వంగిందిపేపరులోకి.‘‘మహారాజాలా దొరుకుతుంది. మనసుంటే మార్గం వుంటుంది. కొత్త రిలీజు సినిమావద్దు. కాస్త పాతబడిన దానికి హాయిగా దొరుకుతాయి టిక్కెట్లు. ముందు లేచి తయారవండి’’ దబాయించింది యిల్లాలు.‘‘అబ్బ ఆ చెత్త సినిమాలు డబ్బిచ్చి మరీ చూడాలా - అయినా రోజుకి నాలుగు సినిమాలు తక్కువ కాకుండా టి.విలో చూపిస్తున్నా యింకేం మిగిలాయి చూడ డానికి’’‘‘అబ్బ ఏంటండి, ఎడ్డెం అంటే తెడ్డెం అంటారు - ఎంతయినా పెద్దతెరమీద చూసినట్లుంటుందా యింట్లో టీవీలో చూస్తే - ఏ ఏడాదికో, ఓసారి బుద్ధిపుట్టి అడిగితే నా ముచ్చట తీర్చడానికన్నా సరే అనరు’’ బుంగమూతి పెట్టింది యిల్లాలు.బుంగమూతి పెట్టిన యిల్లాలు ఏ కొత్తగా పెళ్లయిన యిరవై ఏళ్ల ముద్దుగుమ్మో, పదహారేళ్ల బాలాకుమారో గాదు. రిటైరయి యింట్లో కూర్చుని ‘సుడోకు’లు పూరించికుంటున్న అరవైమూడేళ్ల భర్తగారికి ఏభై ఎనిమిదేళ్ల యిల్లాలు రాజేశ్వరి.‘‘ఏమిటే బాబూ.

ఆ దిక్కుమాలిన గుడ్డలిప్పుకు ఆడే తైతక్కలు చూడడానికి ఓ రెండొందలు తగలేసుకు వెళ్ళాలా’ చిరాగ్గా అన్నాడు మూర్తి అనబడే కేశవ మూర్తి.‘‘గుడ్డలిప్పుకు తైతక్కలాడే సుందరాంగులే మీ మగాళ్లకి నయనానందకరం గదా’’ ఓ విసురు విసిరింది యిల్లాలు.‘అవన్నీ యవ్వన వికారాల వయసులో, ఆ స్టేజి దాటి పుష్కరం అయిందిలే. అమ్మా తల్లీనో ఏ పక్కింటి పిన్నిగారితో వెళ్లి నన్నిలా వదిలేయ్‌ నీకు పుణ్యం వుంటుంది..’’ చిరాగ్గా అన్నాడాయన.‘‘ఆ దిక్కుమాలిన ‘డోకులు’ ప్రతిపేపర్లో తగలెడ్తున్న వాళ్ళకి బుద్ధిలేదు. మాట పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా బిగుసుకుపోయి ఆ అంకెలు నింపడమే పుణ్యం పురుషార్థంలా రోజంతా నాలుగు పేపర్లు పట్టుకు అతుక్కుపోవడం, లేస్తారా లేవరా - వాదులాటమాని తయారవండి లేదంటే నేనొక్కర్తినే పోతాను’’ బెదిరించింది యిల్లాలు.‘‘అమ్మా బతికించావు తల్లీ. హాయిగా నీ పాటికి నీ ఇష్టం నా పాటికి నా యిష్టం అంటూ నీ స్వాతంత్య్రం ప్రకటించేశావు చూడు. ఇంక ఆ మాట మీద నిలబడి నీ యిష్టం వచ్చిన చోటికి హాయిగా తిరిగి రాపో. కావలిస్తే నీ వొచ్చేవేళకి రైస్‌ కుక్కరు మీట నొక్కేసి అన్నం వండేస్తాను వేడిగా..’’‘‘అబ్బే అంతకష్టం వద్దు. వేలికి ఎందుకు పనిచెప్పడం... హాయిగా సుడోకు చేసుకోండి. పెళ్లాం ముచ్చటతీర్చని మొగుడు, కాపుకాయని చెట్టువున్నా లేక పోయినా ఒకటే...’’ కోపంగా అంది యిల్లాలు.