తుగ్గలి వూరి బయట, నాగలి కట్ట దగ్గర ఆటో దిగిందివిశ్రాంతమ్మ. గోనెసంచినీ దింపుకుంది. మంచి మధ్యాహ్నపు ఎండ, తళతళమంటోంది. అవి వానాకాలపు తొలిదినాలు. కట్టమీదా, చుట్టుపక్కల చెట్లకిందా గుంపులు, గుంపులు జనాలు-అందరిదీ ఒకటే ధ్యాస. తేరిపార చూస్తోందివిశ్రాంతమ్మ- కట్టమీద తలకింద తువ్వాలు పెట్టుకుని నిద్రపోతున్న వాళ్లూ కట్టమీది రావి, వేపచెట్ల బోదెలకు తల ఆనించి ఎదురుగా దిగంతాల వరకూ విస్తరించి వున్న కనికరాళ్ళ భూములనూ, ఆ భూములపై ఎగురుతున్న ఎండ గుర్రాలనూ, ఆ గుర్రాలపై ఎగురుతున్న వాళ్ళ ఆశల అదృష్టాలను దీర్ఘంగా చూస్తున్నవాళ్ళూ; నెత్తిన జడలు కట్టిన కొప్పులూ, నొసట కుంకుమా విభూతి పట్టీలూ, చేతుల్లో మంత్రదండాల వంటి కట్టెలతో కట్ట అంచున కూర్చుని వాళ్లందర్నీ చూస్తున్న సన్యాసులూ, ఇలా ఎంతమందిని వెతికి నా విశ్రాంతమ్మకు తెలిసిన వాళ్ళెవరూ కనిపించలేదు.దూరంగా ఒక చెట్టుకింద కొందరు మాట్లాడుకోవడం చూసి అక్కడికి బయల్దేరింది.‘‘యెంత ఉమ్మరంగా ఉందన్నా, సాయంత్రమో, రాత్రో వాన పడేట్లుంది...’’‘‘అవు..పడేట్లే ఉంది.. రానీ.. వస్తే శానా మంచిదే గదా... యాడాడున్నివీ పైకి తేలుతాయి...’’‘‘వూరికే వర ్షమొస్తే కాదన్నా... భూమ్మీద నీళ్ళు పారల్లా... అట్లయితేనే అంతోయింతో కన్పిస్తాయి గానీ, ల్యాకుంటే నువు ఎంతెతికినా అంతే..

 అట్లా పైపైనే కన్పించేట్లుంటే, ఈ పల్లెలోల్లే యేరుకుందురు గదా! మనదంకా రానిస్తురా! ఇంతమందిమి ఇన్ని దిక్కుల్నుంచీ యీటికొచ్చిందుమా...’’‘‘అవునంటా.. చానా మాయదారివంటా...కన్పించినట్లే కన్పించి మాయమైతాయంట గదా...నువ్వు నాలుగైదు సమ్మచ్చరాలుగా వస్తాండావు..అనుభవజ్ఞుడివి నువ్వే చెప్పల్లా, ఎన్ని జూసింటావో..’’‘‘ఏం అనుభవమో, ఏమోలే...అంతా వుత్త ప్రయాస, యెంత ఎతికినా ఏం ప్రయోజనం లేదు..’’‘‘యీసారి నీ అదృష్టమెట్లుందోలే...అవున్నా ఆ సుమోల చుట్టూ ఏందట్లా మూగినారు...’’‘‘మూగక ఏం జేస్తారూ... ఈ వానాకాలమంతా యీడుండాల్నా.. తినీ తిరగాల్నా.. ఖర్చు పెట్టాల్నా.. ఆ సుమోల్లో వుండేది వ్యాపారస్థుల ఏజెంట్లే గదా...మన అదృష్టం బాగుండి దొరికితే వాళ్ళకే గదా అమ్మేది, అందుకే అడ్వాంసుగా ఏమన్నా యిమ్మని అడుగుతుంటారు... ఎవరి ఆశవాళ్ళది. ముంగారు మేఘాలతో పాటు వాలినారు వలస పక్షుల్లాగా. ఈ చుట్టుపక్కల వూర్లనిండా యిట్లాంటి జనమే.. యీ సీజనంతా సేన్లమింద బడి తిరుగుతారు, యీ కట్టమిందనే పడిపొర్లుతారు, వున్నోళ్ళు కొందురు యీ చుట్టుపక్కల కొట్టాల్లోనే బాడుగలకుంటారు కొట్టం హోటళ్ళలోనే వుగ్గానీబజ్జీ తిని తిరుగుతూ, అదృష్టాన్ని పరీక్షించుకుంటారు... అదిగో విశ్రాంతమ్మగూడా వచ్చేసా...’’‘‘ఏం మద్దిలేటీ బాగుండావా...’’ విశ్రాంతమ్మ పలకరించింది.‘‘ఏమత్తా, నర్సారెడ్డి మామ రాల్యా..మీరిద్దరూ కలిసే గదా రావాలా...’’‘‘అదే నేనూ అడుగుదామనుకుంటుండా మద్దిలేటి! నర్సారెడ్డి యింగా రాలేదా?’’‘‘యాడా కనపడల్యా అత్తా... ఒగేల వచ్చి నువ్వు కనపరాకుంటే, వెళ్లిపోయి వేరే వూర్లో మకాం ఏసినాడేమో...’’ వుడికించడానికన్నట్లు అన్నాడు.