రంగు రంగుల లైటింగ్‌ సరాలు సందు పొడవున కట్టడంతో ఆ వీధంతా వెలుగుల తోరణమైంది. హిందీ పాటలు మైకులో హోరెత్తి దద్దరిల్లింపజేస్తున్నాయి.ఆ తోరణం మొదలులో... ఇంటి ఆవరణ దగ్గర నెత్తికి టోపి... మొహానికి అతికించిన తళుకులు, మెడలో గులాబీల దండతో మహారాజ ఛేర్‌లో కూర్చున్న కొత్త పెళ్ళికొడుకు - టీ సత్తార్‌ వింత అందగాడిలా కనిపిస్తున్నాడు.వలీమా పేర్తో జరిగే రిసెప్షన్‌కు నెమ్మదిగా ఒకొక్కరు వస్తున్నారు. మూడు వందల ఆహ్వాన పత్రికలు ఓపికగా తిరిగి పంచిన సత్తార్‌ దాదాపు అందరూ స్పందించి తప్పక వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాడు.అతను కూర్చున్న వేదికకు అటు ఇటు రెండు వరుసల్లో వేసిన కుర్చీలవైపు పరిశీలనగా చూశాడు. యాభై మంది దాక వున్నారు. ఇంకో యాభై కుర్చీలు ఖాళీగా వున్నాయ్‌.అతని ముందున్న టేబుల్‌పై అయిదు పూల దండలు వున్నాయ్‌. టైం పావుతక్కువ ఎనిమిది అయింది. ఊర్లో ఈరోజే రెండు మూడు పెళ్ళిళ్ళు, వలీమాలు వున్నాయ్‌. ఆహ్వానించిన వాళ్ళు వేరే వలీమాలకు పోతే... ఈ ఆలచోన రాగానే కొద్దిగా చెమటలు పట్టాయి సత్తార్‌కు.జేబురుమాల తీసి - మొహం తుడుచుకొంటూ అల్లాను మనసులో తల్చుకున్నాడు - ఆహ్వానిం చిన అందరూ తప్పక రావాలని... వచ్చిన ప్రతి ఒకళ్ళు వందేసి రూపాయలు తక్కువ కాకుండా చదివింపులు ఇవ్వాలని మనసులో ఇప్పటికి ఆరవ సారి అనుకున్నాడు.

అక్కడికి వచ్చిన యాభైమంది ఏమైనా చదివిం పులు కానిచ్చారా అంటే దాదాపు ఏమీలేదు. రావ డం పెళ్ళికొడుకుని ఆలింగించుకొని, శుభాకాంక్షలు చెప్పి - ‘‘వడ్డిస్తాం, రమ్మంటే’’ వెళ్ళి ఓ పట్టుపట్ట డానికి రెడీగా కూర్చుని వున్నారు. ఈ లెక్కన అందరూ వుత్తి చేతుల్తో వస్తే తనగతేం కాను? మాంసం ఇచ్చిన కసాబ్‌ కరీంసాబ్‌కు, బియ్యం అప ఇచ్చిన జమాల్‌ సాబ్‌కు, పెళ్ళిబట్టల ఖరీదు లో సగం అప - సగం నగదు ఇచ్చిన సలామ్‌ సేట్‌కు ఏమివ్వగలడు?వస్తున్న వారితో ఆశగా చెయ్యి కలిపి వచ్చినం దుకు కృతజ్ఞతలు చెతున్నాడే కానీ, చదివింపుల గురించి ఎవరూ సీరియస్‌గా లేకపోవడంతో సత్తార్‌ పరిస్థితి యమ సీరియస్‌గా మారింది.మూడు వందల మందికి ఆహ్వాన పత్రికలు ఇవ్వాలని ఆలోచించి, ఆలోచించి కొంచెం పెద్ద తరహా వాళ్ళకు - చదివింపులకు ఢోకా లేని వాళ్ళకే పంచిపెట్టాడు. మూడు వందల మందిలో వంద మంది వుత్తచేతుల్తో వచ్చి తినిపోయినా, మిగిలిన రెండు వందలమంది మనిషికి సగటున నూరు రూపాయలు చదివింపులుగా పెట్తే సరి... ఇరవై వేలు లెక్కపెట్టుకోవచ్చు!!