పచ్చని చెట్లతో గలగలపారే సెలయేళ్ళతో, నునుపెక్కిన నీలి పర్వతాలతో కనువిందు చేసిన జంబూద్వీపం. ఇపడు మృత శరీరంలా వున్నది.కారణం...?ఆశ... మనిషి మితిమీరిన ఆశతో చేజేతులారా కొనితెచ్చుకున్న ఉత్పాతం.ఒకపడు ప్రకృతి సోయగాలతో అలరారిన జంబూద్వీపంలో అరాచకాలు పెచ్చు మీరాయి. స్వార్థం, నయవంచనలు, అధర్మం పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. తాను సృష్టించిన ధనమే ప్రధానమని దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దాని వలలో చిక్కుకుని ప్రకృతిని విస్మరించాడు ఆ ద్వీపపు రాజు.కొన్ని వేల సంవత్సరాలుగా జంబూద్వీపంలో ఆనందంగా విహరించిన వనదేవతకు కష్టాలు ప్రారంభమయ్యాయి. స్వేచ్ఛగా తుళ్ళుతూ తూలుతూ పరవశించిపోయిన వనదేవత, మానవుని పై గల మమకారంతో, సకాలంలో వర్షాలు కురిపించింది. విపరీత కాలాలలో వచ్చే వరదలను అడ్డుకుంది. భూకంపాలను అదిలించింది. ఫల పుష్పాలతో, మనోహరమైన సౌందర్యంతో, పచ్చని మైదానాలతో, పంట పొలాలతో జంబూద్వీపాన్ని స్వర్గంలా వుంచింది. మనిషికి ప్రధానమైన ప్రాణవాయువును అందించి జోల పాడింది. ఇంత చేసిన వన దేవతను పూర్తిగా మరచిపోయారు జంబూద్వీప ప్రజలు.‘‘ధనం మూలం ఇదం జగత్‌’’ అంటూ దాని మత్తులో మునిగిపోయిన ఆ ద్వీప రాజు.. మధువు, జూదాలను, అర్థనగ్న నృత్యాలను ప్రోత్సహించాడు. మోసాలను, అవినీతిపరులను చూసీ చూడనట్టు వదిలేశాడు.

ద్వీపాన్ని సుభిక్షంగా మరో స్వర్గంలా ప్రేమతో చూసుకుంటున్న వన దేవతను తుదముట్టించాలని నడుం బిగించారు ద్వీపపు ప్రజలు. అనుకున్నదే తడువుగా ఆ జాతిని నాశనం చేయడం మొదలెట్టారు. కనిపించిన వృక్షాన్ని కనిపించినట్టే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టసాగారు. ఆయా ప్రాంతాలలో రాతిగృహాలు చీమల పుట్టల్లా పెరిగిపోసాగాయి. తరిగి చిక్కి శల్యమౌతున్న వన దేవత ఆక్రందనను విని కొన్ని మూగజీవులు ప్రాణాలు విడిచాయి. విహంగాలు ఆకాశంలోనే ఆత్మార్పణం చేసుకున్నాయి. ఆ ప్రజల వికటాట్టహాసాల నడుమ వనదేవత రోదన అరణ్యరోదనే అయ్యింది. ఈ దృశ్యాలను చూసిన నదులు భయంతో కుంచించుకుపోసాగాయి.ఇన్ని ఘోరాలు జరుగుతున్నా.. రాజుగాని, ప్రజలు గాని ఏమీ పట్టనట్టే ఆనందోత్సాహాలలో మునిగిపోయారు. ధనమే ప్రత్యక్ష దైవమనుకున్నారు. ధనంతో ఏమైనా చేయగలమనుకున్నారు. వనదేవతను నమ్ముకున్న కొందరమాయకులు అర్ధాకలితో మరణించారు. ఆ ద్పీపాన్ని వదలి దూరంగా వెళుతున్న వనదేవతను చూసి వింతరోగాలు చుట్టుముట్టాయి. కొందరు ఆ రోగాల బారిన పడ్డారు. ఇదే మంచి తరుణంగా భావించి ప్రజలను దోచుకోవడం ప్రారంభించారు వైద్యులు.జంబూద్వీపం నుంచి వనదేవత పూర్తిగా నిష్క్రమించడంతో, వన రాక్షసులు, భూకంప భూతాలు చుట్టుముట్టాయి. ప్రజల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆ ద్వీప ప్రజలు అకాల మృత్యువాత పడ్డారు. కొందరు బ్రతికి బట్టకట్టి నిరాశ్రయులయ్యారు. వరద రాక్షసి భూకంప భూతాల స్వైర విహారంతో జంబూద్వీపం ముప్పావు వంతు వజవజమని వణికింది. రాజు రోగాల బారిన పడి దిక్కులేని చావు చచ్చాడు. అలా కొద్దికాలం గడిచిన తరువాత ఆ ద్వీపపు యువరాజు పెరిగి పెద్దవాడైనాడు. శ్మశానాన్ని పోలి వుండే దేశంలోని కొంత భూభాగాన్ని చూసి బాధపడ్డాడు. మారువేషంలో ఊళ్ళోకి వచ్చాడు. రాచ వీదుల్లో తిరుగుతున్న ప్రజలు ధగధగలాడే ఆభరణాలు, విలువైన చీనీ చినాంబరాలు ధరించి వున్నారు. అయితే వారి వదనాలలో నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. శల్యాలకు చుట్టిన చర్మంతో శవాలు నడుస్తున్నాయా.. అన్నట్టు వుంది వారిని చూస్తుంటే.