వేగంగా వెళ్తున్న రైలు లక్ష్యం వైపు పరుగులు తీసే కార్యసాధకుడిలా వుంది. పచ్చటి ప్రకృతి, మధ్యమధ్య చిన్నచెరువులు, వాటిలో తామరపూలు, ప్రయాణించే చిన్న పడవలు... మనిషిని మంత్ర ముగ్ధుడిని చేసే ప్రకృతి చిత్రం. ఆ చిత్రకారుడి చిరునామా మాత్రం ఎవరికీ దొరకదు. తిరువనంతపురం నుండి హైదరాబాద్‌కు వచ్చే ఆ దారిలో ప్రకృతి శోభను చూడటానికి రెండు కళ్ళు చాలవు.ఎప్పటిలా ప్రకృతి శోభను ఆస్వాదించే స్థితిలో లేని విశ్వనాథ్‌ యాంత్రికంగా చూస్తున్నాడు. నీళ్ళల్లో వున్న తామరపూలు చూస్తున్నప్పుడు మాత్రం విశ్వనాథ్‌ కళ్ళు కన్నీటితో నిండిపోతున్నాయి. వాటిలో అతనికి అమ్మ కనబడుతోంది. తామరపూలంటే అమ్మకు చాలా ఇష్టం. ఆ పూలతో ఏదైనా గుడిలో దేవుడిని అర్చించాలంటే మరీ ఇష్టం.మొదటిసారి తిరువనంతపురం వచ్చినప్పుడు గుడిముందర అమ్మే తామర పూలను చూసి అమ్మ చిన్నపిల్లలా సంబరపడింది. కావలసినన్ని కొనుక్కొని దేవుడికి సమర్పించింది. 

తనను చూడగానే అమ్మ ముఖం సంతోషంతో ఆ తామరపువ్వులా విచ్చుకోవడం ఎన్నో ఏళ్ళ బట్టి చూస్తున్నా ఎప్పటికప్పుడు ఆ ఆనుభూతి కొత్తగానే వుంటుంది. తనబిడ్డల్ని చూసుకుంటున్నప్పుడు తల్లి కళ్ళల్లో నిండే కాంతి ముందు ప్రపంచంలోని ఇంకే కాంతి ప్రకాశవంతంగా వుండదేమో.అమ్మను తలుచుకోగానే విశ్వనాధ్‌ కళ్ళ నుండి కన్నీటి గంగ పొంగింది. ఇప్పుడెలా వుందో. జ్వరం తగ్గి వుంటుందా? హాస్పిటల్లో వుందంటే చాలా బాధగా వుంది. పరిస్థితిని బట్టి శాంత గోదావరిలా, గలగలపారే గోదావరిలా వుండే అమ్మ ఎప్పటికీ ప్రవహించే నదిలాగే తన వూహలో కనబడుతుంది. సాగరం సంగమించే నదిలా ఎప్పుడూ కనబడదు. ఎందుకంటే అమ్మంటే అనంతమైన ఆనంద చైతన్యమే.విశ్వం వైపే చూస్తున్న అతని భార్య నందిని అతని చేతిని పట్టుకుంది. విశ్వం కన్నీటిని తుడుచుకుంటూ ఆమె వైపు చూశాడు. ‘‘అమ్మకు ఏమీ కాదు. బాధ పడకండి’’ అంది.విశ్వం పిల్లల వైపు చూశాడు. సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నానమ్మ దగ్గర పడుకుని కథలు వినాలని వాళ్ళు ప్రయాణమైనప్పటి నుండి కలలు కంటున్నారు. వాళ్ళ అందమైన కలను వాస్తవంతో చెరిపెయ్యకుండా నానమ్మ అనారోగ్యాన్ని వాళ్ళకు చెప్పకుండా వుండిపోయాడు విశ్వం.