‘‘అమా, నా అంగీ యాడుంది?’’ అన్న జాదూ పిలుపూ, ‘‘నా హెయిర్‌ బ్యాండ్‌ కనిపీటం లేదమ్మా’’ అన్న మాయ అర్థింపూ, ‘‘టవల్‌ భ్రమా’’ అన్న ఇంద్ర అరుపూ ఒకేసారి వినిపించాయి భ్రమరాంబకి. కానీ, సోఫా పైనున్న షర్ట్‌ జాదూకందించడం, హెయిర్‌బ్యాండ్‌ చుక్కపెట్టె వెనకుందని మాయకు చెప్పటం, మొగుడికి టవలందించడం ఒకేసారి చేయలేక పోయిందామె.అదృశ్యమైన వస్తువుల్ని క్షణంలో వెతికియ్యడం ఆమెకి పెళ్ళై, పిల్లలు పుట్టిన తరవాత అలవడిన స్కిల్‌. ఆ మూడు పనులూ ఆమె సిక్వెన్షియల్‌గా చేసే సమయంలో, వంటింట్లో మరో మూడు పనులు వాటంతటవే జరిగిపోయాయి. రైస్‌ కుక్కర్‌ విజిల్‌ గాల్లోకి ఎగరడం, బియ్యప్పిండి డబ్బాకి తగిలి పిండంతా కిందపడడం, బాణలిలోని వంకాయ తాలింపు మాడి పొగలు కమ్మేయడం.ముఖం తుడుచుకొంటూ బాత్రూం లోంచి బయటకొచ్చిన ఇంద్రకి ఆమె దట్టమైన పొగల్లోంచి బయటికి రావడమనే దృశ్యం ఎందుకో తమాషాగా అనిపించి, ‘‘జాదూ, మాయా, మీరిద్దరూ బిరీన అమ్మను చూడల్ల’’ అని అరిచాడు.‘‘కుక్కర్‌ విజిల్‌ ఎగరడం ఇది మూడోసారి. వెయిట్‌ అరిగిపోతే ఇట్లైతుందని ఎదురింటి ఆంటీ చెప్పింది. మీరు కొత్తది తేలేదు. ఇప్పుడిదంతా తమాషాగా ఉందం టున్నారు. 

ఈ మెస్‌ మీరు క్లీన్‌ చేస్తారా?’’ అంది భ్రమరాంబ మధ్యలో దగ్గుతూ.ఇంకో అర్ధగంటలో వాళ్ళంతా బయటికి వెళ్ళాలి. టవర్‌ క్లాక్‌ దగ్గర పెద్ద మ్యాజిక్‌ షో జరగబోతోందని రెండు వారాల నుంచి ప్రచారం చేస్తున్నారు. అది జరిగేది ఈ రోజే. జాదూకి మ్యాజిక్‌ అంటే చాలా ఇష్టం. తన స్కూల్‌ బుక్స్‌ కన్నా ఎక్కువ ఇంట్రస్ట్‌తో చదివాడు హ్యారీపాటర్‌, పెర్సీ జాక్సన్‌ బుక్స్‌. ‘కోయీ మిల్‌గయా’ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా చూస్తాడు, అందులోని జాదూ కోసం. అందుకే వాడి నిక్‌ నేమ్‌ ‘జాదూ’. ఆ బుక్స్‌ పుణ్యమా అని, టౌన్‌ లైబ్రరీకి వెళ్తున్నాడని సంతోషిస్తారు ఇంద్ర, భ్రమరాంబ. తెలుగులో కూడా అటువంటి బుక్స్‌ చాలా తమ చిన్ననాడే వచ్చాయని వాళ్ళకి చెప్పి వాటినీ పరిచయం చేశారు పిల్లలిద్దరికీ. జాదూ పదకొండో బర్త్‌డేకి దాసరి సుబ్రహ్మణ్యం పుస్తకమొకటి గిఫ్ట్‌గా ఇచ్చారు.‘‘త్వరగా తినండి. ఒకటింకాల్‌ అయ్యింది. రెండు గంట్లకి మనం టవర్‌ క్లాక్‌ దగ్గరుండల్ల’’ అంది భ్రమరాంబ గబగబా తినేసి డ్రెస్‌ ఛేంజ్‌ చేసుకోవడానికిపోతూ. వెళుతూ వెళుతూ ‘‘ఏమండీ, ఆ కాయ కొంచెం తరిగి పెడతారా వాళ్ళకి’’ అంది మొగుడివైపు చూస్తూ.‘‘అరే, నిన్ననే కదా నువ్వు మాముందు పెద్ద వాటర్‌మెలన్‌ రెండుగా కోసింది. అది మళ్ళీ ఒకటెప్పుడయ్యిందబ్బా’’ అంటూ జోకేశాడు ఇంద్ర.