మరదలు రమ పెళ్ళి అయిపోయాక ఆ మర్నాడే తిరుగు ప్రయాణం కట్టేం నేనూ సరోజా. ట్రెయిన్‌ రాగానే పై బెర్తు మీద నేనూ, క్రింది బెర్తు మీద బాబిగాడితో సరోజా సర్దుకున్నాం. ఏసీ కంపార్ట్‌మెంట్‌ వాతావరణం అలసి ఉన్న మా శరీరాలకి ఆహ్లాదకరంగా తోచింది. మేం బోగీ ఎక్కేసరికీ చాలా మంది ప్రయాణీకులు అప్పటికే నిద్రావస్థకి చేరుకున్నారు. లైటు తీసేసి కర్టెన్లు దగ్గరగా లాగి నిద్రకుపక్రమించాం. సన్నటి శబ్దంతో రైటు సాగిపోతోంది. పెళ్ళి పనులతో బాగా అలసి ఉన్న మాకు వెంటనే నిద్ర పట్టేసింది.్‌్‌్‌అర్థరాత్రి దాటిన తర్వాత ఎవరో పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తూండడంతో మెలకువ వచ్చింది నాకు. మా బాబిగాడేమోనని కిందకు తొంగి చూశాను. వాడూ, సరోజా మంచి నిద్రలో ఉన్నారు. సైడు లోయర్‌ బెర్తు మీద నుండి వినవస్తోందా ఏడుపు. ఏసీ బోగీ కావడం వలనా, ఇతరత్రా బోగీ అంతా నిశ్శబ్దంగా ఉండడం వలనా ఆ పిల్లాడి ఏడుపు చాలా బిగ్గరగా వినవస్తోంది. కర్టెన్‌ తొలగించి చూశాను. మా బాబిగాడి వయసే ఉంటుంది ఆ పిల్లాడికి. తల్లీ, తండ్రీ ఎంత సముదాయిస్తున్నా గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు.

 పిల్లాడి ఏడుపుకి కంగారు పడిపోతున్నారా తల్లిదండ్రులు. నేను బెర్తు మీద నుండి కిందకు దిగేను. మా ఎదుటి బెర్తుల మీద నున్న ఇద్దరు వ్యక్తులూ సన్నగా గురకపెడుతూ నిద్రపోతున్నారు. ఆ అబ్బాయి ఏడుపు వారిద్దరి గాఢనిద్రనీ చెదరగొట్టలేకపోతోంది. సరోజా, బాబిగాడు ఇంచుమించుగా అదే నిద్రలో ఉన్నారు. నేను సరోజ పక్కనే కూలబడ్డాను బాబిగాడిని గమనిస్తూ. ఆ పిల్లాడి ఏడుపుకి బాబిగాడి నిద్ర చెడుతుందేమోనని ఆందోళన కలిగింది. ఇంతలో సరోజ లేచింది.‘‘పక్క బెర్తు మీద బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. పాపం! ఏమైందో కనుక్కో’’ అన్నాను మెల్లగా.‘‘అలాగే, కనుక్కుంటా, బాబిగాడు కిందకి దొర్లిపోతాడేమో మీరు చూస్తూ ఉండండి. నేనిపడే వస్తాను’’ అంటూ లేచి వెళ్ళింది.ఆ బాబు అలా ఏడుస్తూనే ఉన్నాడు మా బాబిగాడు లేచిపోతాడేమోననే ఆందోళన ఎక్కువైంది నాలో.‘‘బాబుకి ఆకలిగా ఉందేమో! పాలు పట్టకూడదూ?’’ తను బాత్రూం నుండి వస్తూ ఆ దంపతులతో అనడం విన్నాను.పిల్లడిని తండ్రి బుజ్జగిస్తూనే ఉన్నాడు. అతడి బుజ్జగింపులు వినే ధోరణిలో లేడు బాబు.‘‘పాలడబ్బా, బాటిలూ, ఫ్లాస్కూ ఉన్న బేగ్‌ ప్లాట్‌ ఫారం మీద మరచిపోయి ట్రెయిన్‌ ఎక్కేశాం హడావిడిలో. రాజమండ్రి స్టేషన్‌ లో పాలు దొరుకుతాయేమో చూడాలి’’ కంగారు పడుతూ అంది ఆ తల్లి.సన్నటి శబ్దం చేసుకుంటూ సాగిపోతోంది రైలు. పిల్లాడి ఏడుపుకి ఎదుటి బెర్తుమీద నిద్రపోతున్న వ్యక్తిలో కదలిక వచ్చింది. చిరాగ్గా ఆ దంపతుల వైపొకసారి చూపు ప్రసరించి తనకేమీ పట్టనట్టుగా ముసుగు తన్ని మళ్ళా నిద్రకుపక్రమించాడు.