కొక్కొరోకో....!కోడి కూసిందే గానీ... ఇంకా చీకటి పొగమంచుతో.... కలిసి ఊరుని ఊరి పొలిమేరనీ వదిలినట్టు లేదు.మంచుతెరల్ని దాటుకుంటూ చెరువుగట్టుమీంచి బరువుగా అడుగులేస్తూ ఊర్లోకి చేరుకుంది గంగమ్మ. పొగమంచు కరిగి రానురానూ ఆవిరైపోతుంది.‘‘వంకాయలమ్మా వంకాయలో...!’’గంగమ్మ లయబద్ధంగా వేసిన కేక ఇంట్లోని ఇళ్ళాళ్ళ చెవులకు తీయనిరాగమై సోకుతుంది. ఎక్కడికో వెళ్ళి కూరగాయలు కొనక్కర్లేదని.ఎవరో వంకాయలు కొనడానికి పిలిచినట్టయితే ఆగి... రెండుచేతులతో తలమీద బరువు తట్టను కుడి కాలి ముడుకు మీదకుఆనించి ఒడుపుగా దించుకుంది గంగమ్మ.‘‘ఏటీ వంకాయిలు... ఇలగున్నాయి... వొట్టి పుప్పుల్లాగున్నాయి.... కేజీ పది రూపాయిలా...!’’కొనడానికి తట్టచుట్టూ చేరిన వారంతా పుప్పులున్న వంకాయల్ని ఎంచి ప్రక్కన పెడుతున్నారు. వాళ్ళు ఆడే మాటల్లో ధర ఎక్కువన్న అర్థం స్ఫురిస్తుంది.‘‘అమ్మలూ.... అప్పులేని మనిషి... పుప్పులేని వొంకాయిలు ఉంతాయా సెప్పండి.... మనిషన్న తరవాత వొంటివీద వొక మచ్చయినా ఉండదా.... మీకూ తెలుసు... ఇతనాలు పిరుమైపోనాయి. పురుగుమందు రేట్లు ఆకాశానికి అంటుకున్నాయి. 

మీకు మాత్రం తెలీదా... తెలిసే..... ఆడతారు’’.ఒక్కొక్కరికీ సానుకూలంగా సమాధానం చెబుతుంది గంగమ్మ.అడిగినచోటల్లా గంప ఎత్తీదించి కూరగాయలు అమ్మడంలో తలమునక లౌతుంది గంగమ్మ.‘‘ఒంకాయలమ్మా... ఒంకాయలో...’’ కేక పెడుతూనే ప్రక్కవీధిలోకి అడుగు లేసింది గంగమ్మ.్‌్‌్‌‘‘హలో....! ఔనౌను.... నీను పెద్దొలస ప్రెసిడెంటును మాట్లాడతన్ను. సెప్పండి... ఆ....! అలగా...! ఇప్పుడే కవురెడతాను... ఉంతాను’’.గ్రామ సచివాలయం ముందు కుర్చీమీద కూర్చొని సిగరెట్‌ కాల్చుతున్న సర్పంచ్‌కి ఎక్కడి నుంచో ఫోనొచ్చింది.సెల్‌ఫోను జేబులో పెడుతూ... సర్పంచ్‌ ఆత్రంగా అటూఇటూ చూసి.... ఎవరో అటు వేపే వస్తుంటే.‘‘ఒరే... రాముడో.... వంకాయలు అమ్మడానికి వొచ్చిందట. గంగమ్మ. ఆయమ్మ పెనిమిటి పురుగు మందు కొడతుండి వంగ గుడ్డిల పడిపోనాడట. ఇప్పుడే ఫోనొచ్చింది... చెప్పీరా’’.సర్పంచ్‌ మాటలు చెవిన పడిందే తడవు వస్తున్న ఆసామి వచ్చిన వేపే పరుగు పరుగున వెళ్ళి గంగమ్మకు చెప్పాడు.గంగమ్మ తేరుకోలేక పోయింది! ఉరుము, మెరుపూ... లేకుండానే పిడుగొచ్చి మీద పడినట్టయ్యింది.‘‘ఓలమ్మ నీ నేటి చేసీది తల్లో... నా ఇల్లు ములిగి పోయిందమ్మో...!’’ గుండెలు బాదుకొని ఏడుస్తూ అమ్మినచోటే వంకాయల తట్ట వదిలేసి వచ్చిన దారిగుండా పిచ్చిదానిలా పరుగందుకుంది గంగమ్మ.అప్పటికే నలుగురు మనుషులు గంగమ్మ పెనిమిటిని ఎత్తుకొని పొలం నుంచి రోడ్డు దారివేపు మోసుకొచ్చారు.పట్నం వేపు వెళ్ళబోతున్న ఆటోను ఆపి ఎక్కించారు.పరుగుపరుగున వచ్చిన గంగమ్మ ఆటోను సమీపించి పెనిమిటి ప్రక్కనే కూర్చొని రాగాలు పెడుతుంది.ఆటో పట్నం వేపు పరుగులు పెడుతూ ఆసుపత్రి గేటు ముందాగింది.ఆసుపత్రి సిబ్బంది గంగమ్మ పెనిమిటిని థియేటర్‌లోకి తీసుకెళ్ళారు.అప్పటికే అక్కడ చేరిన బంధువుల మధ్య గంగమ్మ శోకాలు పెడుతుంది. ఉండీ ఉండీ మాట్లాడుతుంది. మాట్లాడుతూనే ఏడుస్తుంది.