సోమవారం ఉదయం... ఎనిమిది పదిహేనుదిల్‌షుక్‌నగర్‌ బస్టాండు. జనం కిటకిటలాడుతున్నారు. కొన్ని వారాంతపు అలసట తీరని గ్లాని మొహాలు, కొన్ని వారారంభపు ఉత్సాహ విద్యుత్తు నింపుకున్న కాళ్లూ, మరికొన్ని ఏరోజైనా, ఏ రాజైనా మా బతుకులింతే అన్న నిస్పృహ కళ్లూ, అన్నీ కలగలుపుగా బస్సు కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాయి.జీడిమెట్ల పోయే వీరా బస్‌ అపడే వచ్చి ఆగింది. వందల కొద్దీ జనం ఎక్కడానికి ఎగబడ్డారు. నేనూ ముందు డోర్‌ నుంచి ప్రయత్నిస్తున్నాను. నా పక్కగా ఆమె సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే లోపలకి ఎక్కడానికి కుస్తీ పడుతోంది. ‘బస్‌ ఎక్కుతున్నాను. ఐదు నిమిషాల తర్వాత చేయండి’ మాట కట్‌ చేసింది.నేను లోపలకి చేరాను. అనడం కంటే ఎవరో నన్ను లోపలకి చేర్చేరు అనడం సహజోక్తి అవుతుంది. సీనియర్‌ సిటిజన్స్‌ సీట్లో కూర్చున్నాను. నా పక్కసీట్లో ఉదుటున ఆమె కూలబడింది. జనం మధ్యగా...‘సారే జహా సే అచ్ఛా’ ఫోన్‌ మోగింది.‘ఆ... ఏమిటీ?’‘.....’ కొన్ని సెకన్లు విన్నది.‘‘మీరంటున్నట్లు ఇంట్లో వస్తువుల్ని ఎక్కడో అక్కడ తగలేసే అలవాటేం లేదు నాకు. చూడండి. మీరడిగే డ్రెస్‌ మీ బీరువాలోనే వుంటుంది. సరిగ్గా చూసుకోండి. కనిపిస్తుంది’’‘‘...........’’‘టిఫిన్‌ టేబుల్‌ మీద పడేసి పోలేదు. వండి సిద్ధం చేశాను. బ్రేక్‌ఫాస్ట్‌ చేసి వెళ్లండి’‘‘............’’‘‘ఎందుకంత విసుగూ...చిరాకూ..రెక్కలు ముక్కలు చేసుకొని ఈ సంసార లంపటంలో ఛస్తుంటే ప్రతి క్షణం మీ మాటలతో వేధిస్తున్నారు. ఏమైందిపడు?’’‘‘............’’‘‘రాత్రి సంగతా? ఆ విషయం మాట్లాడే సందర్భమేనా ఇది. 

నేను బస్సులో వున్నాను’’ఫోన్‌ ఆపేసింది ఆమె. సీట్లో సర్దుకు కూర్చుంది. కండక్టర్‌ వస్తే పాస్‌ అని చెప్పి బ్యాగ్‌లో నుంచి పాస్‌ని చూపించింది. నేను మైత్రీవనంకి టిక్కెట్‌ తీసుకొన్నాను.నా వెనుక వరుసలో కిటికీ సీట్లో ఫోన్‌ మోగింది.‘మౌనంగానే ఎదగమనీ...’ పాట డయల్‌ టోన్‌.ఆమె మాట్లాడుతోంది. సన్నగా వయోలిన్‌ మీది రాగంలా.‘ఈ వారం రాలేదేం. నిన్నల్లా కూడా ఫోన్‌ చేసి చేసీ విసుగొచ్చింది ఏమైంది?’‘...........’‘కార్డ్‌ అయిపోవడం ఒక వంక. నాకు తెలుసులెండి. నిన్నా మొన్నా పూరా ఆటలో కూర్చుండిపోయారు కదూ. టిన్నూగాడు ‘డాడీ, డాడీ’ అని ప్రాణం తీసేశాడు. శనివారం ఐమాక్స్‌ చూపించి సముదాయించాను. నిన్న మళ్లీ అదే వరస. మా బాధ మీకసలు అర్థం కాదా. ఏం. మనిషో ఏమిటో...’