చిక్కటి చీకటి.ఆకాశం మీద నల్లని మబ్బులుసన్నగా వాన.దురుసుగా ఈదురుగాలిప్లాట్‌ఫారం మీద అక్కడక్కడ దూరదూరంగా ఉన్న తురాయి, గంగరావిచెట్లు వర్షంలో తడుస్తూ తలలు వంచుకుని నిలుచున్నాయి.లాంపు పోస్టుల మీద ఉన్న చమురుదీపాలు కొడిగట్టబోతున్నాయి.రైల్వేలైన్ల అవతల ‘చిన్నూరు’లో పోగుపడ్డ పూరిళ్లు ఆ చలికి ఆ చీకటిలో కంబళి కప్పుకుని నిద్రకు జోగుతున్నాయి.ఊరి మధ్య చెరువు గట్టునున్న చింతచెట్ల మీద ఋషి పక్షులు స్వేచ్ఛగా ప్లాట్‌ఫారం మీదికి అప్పుడప్పుడు దాడి చేస్తున్నాయి.స్టేషను మాస్టరు గదిలో గోడ గడియారం ఒక గంట కొట్టింది. గడియారంలో ముళ్లు మాత్రం పదకొండు గంటలనే చూపుతున్నాయి.స్టేషను మాస్టరు రాఘవరావు తలఎత్తి గడియారం వైపొకసారి చూచి, హరికేన్‌ లాంతర్ని స్లాట్‌ బాక్సుకు దగ్గరగా జరిపి కుర్చీలో వెనకకు చేరగిలా పడ్డాడు.‘‘మాస్టారూ! పాసెంజరు బండి ఎన్ని గంటలకు వొస్తుందండీ?’’తలఎత్తాడు రాఘవరావు. ద్వారం దగ్గర పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఉన్న యువతి అడుగుతూంది. ఆకాశంలో సన్నని మెరుపు ఏ సవ్వడి లేకుండా అల్లరి పిల్లలా చెంగున పరుగెత్తింది.‘‘ఏ పాసెంజరు బండమ్మా?’’ అడిగాడు రాఘవరావు.‘‘హైదరాబాదు వైపుపోయే పాసెంజరండి. సామర్లకోటకు కూడా పోతుంది కదండీ అది.’’ బెదురు బెదురుగా చూస్తూ అడిగిందామె.

‘‘ఆహాఁ! ఆ ట్రెయినా? నిజానికైతే అది ఈ వేళకు ఈ ఊరుకు రావలసిందే. కాని. ఈ రోజు రెండు గంటలు లేటు. ఒంటిగంటకు వస్తుంది’’.‘‘రెండు గంటలే! ఆ ట్రెయిన్‌కు ముందుగా వచ్చే మరే ట్రెయిను లేదాండి?’’సుమారుగా ద్వారానికి అతుక్కుపోయి ఉందామె. కుడికాలు గుమ్మం మీదుంచి కుడి చేతితో ద్వారాన్ని పట్టుకుని నిలుచుంది. ఆమె ముఖంతప్ప పూర్తి రూపం రాఘవరావుకు గోచరం కాలేదు. ఆమె మాటాడుతూంటే ఆమె కనులు మాత్రం వింతగా కదులు తున్నాయి. రాఘవరావు భ్రుకుటి ముడిచి కుర్చీలోంచి లేచి నాలుగడుగులు వేసి, ‘‘లేదమ్మా! ఒకవేళ ఉన్నా, పాసెంజరు బండి తప్ప మరే ట్రెయినూ ఆగదు. ఏం చేస్తామమ్మా! మాది చిన్నస్టేషను. మేం చిన్న మాస్టర్లం. ఏ ఊరు వెళ్లాలమ్మా?’’ అన్నాడు.‘‘సామర్లకోట కెల్లాలండి’’ బెదురు బెదురుగా చూస్తూ అంది.‘‘అబ్బో! చాలా దూరమే! అందులో పాసెంజరు బండిలో ప్రయాణం విసుగనిపిస్తుంది. ఏం చేస్తాం? ఈ స్టేషన్లలో మెయిలు ఆగదు. మరీ మీ ఊరిలో ఆగినట్టు ప్రతి స్టేషనులో ఆగితే నేను ‘మెయిలు’ నెలా అవుతానంటుంది ఆ పట్టపురాణి’’.‘‘అవునండి అదీ నిజమే కదండి? మాస్టారూ! ఈ ట్రెయిన్‌ ఆ ఊరు చేరేసరికి వెలుగు వచ్చేస్తుందాండి?’’‘‘వెలుగు రాకేం? బాగా ఎండే కాస్తుంది’’‘‘పోనీలెండి. స్టేషన్‌నుండి ఊరులోకి వెళ్లటానికి జట్కాలు దొరుకుతాయాండీ?’’ నలు దిశలా పరికిస్తూనే అడిగిందామె.