‘నిజానికి ఈ ఫేర్‌వెల్‌ని ఆఫీసు తరపున ఎరేంజ్‌ చేసుండాల్సింది’‘మరి ఎందుకు చెయ్యలేదు... ఆర్గనైజేషన్‌ ఒప్పుకోలేదా?’‘ఎందుకొప్పుకోదు?’‘అవును ఎందుకొప్పుకోదు... మీరు చెప్తే డెఫినెట్‌గా ఒప్పుకొంటుంది’.‘చూడు శ్రావణీ... ఇలాంటి మాటలు అనేవాళ్లకు ఆనందం కలిగించవచ్చు. కానీ... వినేవాళ్లకి మాత్రం మరోలా అర్థమవుతాయి’.‘అర్థం చేసుకోవడం అనేది వాళ్ల వాళ్ల సంస్కారాన్ని బట్టి ఉంటుంది’.‘అపార్థానికి అవకాశం ఇచ్చేదీ నువ్వే... సంస్కారం లేదని తప్పులు పట్టేదీ నువ్వే. నేను చెప్తే ఆర్గనైజేషన్‌ ఒప్పేసుకుంటుందంటే... దానర్థం ఏమిటి?’‘సారీ మేడం... మీతో మాట్లాడ్డం చాలా కష్టం.’‘కష్టమా... ఎందుకు?’‘.........’‘చూశావా... నీ దగ్గర సమాధానం లేదు... ఎందుకో తెలుసా?’‘......’‘ఇది మంచి పద్ధతి కాదు శ్రావణీ... అవకాశం దొరికితే అతిగా స్పందించడం... దొరక్కపోతే అసలే స్పందించకపోవడం. దీనివల్ల నష్టం జరిగేది. ఎవరికో తెలుసా? మనకే! సామాన్యంగా ప్రైవేట్‌ ఆర్గనైజేషన్స్‌లో చాలామంది ఉన్న చోటనే ఉండిపోవడానికి అసలు కారణం ఇదే.’‘నిజమే. మాట్లాడ్డం చేతకాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ... అదే మూల కారణం అంటే మాత్రం ఒప్పుకోవడం కష్టం.’‘నేను చెప్తున్నది మాట్లాడ్డం గురించి కాదు. స్పందించడం గురించి. సమయానికి ఆనుకూలంగా స్పందించకపోవడం వల్లే నువ్వీరోజు రిజైన్‌ చెయ్యాల్సొచ్చింది. సరిగ్గా ఆలోచించి చెప్పు. అవునా? కాదా?’‘కావచ్చు’.‘గోడ మీద పిల్లిలా కావచ్చేంటి కావచ్చు... సే ఎస్‌ ఆర్‌ నో’.‘మేడం... అలా దబాయించడానికి ఇదేం ఆఫీసు కాదు’.‘అది నాకూ తెలుసు. 

కనీసం ఈ చివరి మీటింగ్‌లో అయినా డాబూ దర్పాలూ ప్రవేశించకుండా వుండాలనే దీన్ని పెర్సనల్‌గా ఇలా ఇంట్లో ఏర్పాటుచేసింది’.‘పెర్సనల్‌ అంటున్నారు కాబట్టీ... ఒక్కమాట, నేను మీ పట్ల సరిగ్గా స్పందించక పోవడం వల్లే నాకీ పరిస్థితి. ఎదురైందనుకోవచ్చా?’.‘డెఫినెట్లీ అనుకోవచ్చు. నీకలా అనిపించడం తప్పు కాకపోవచ్చు కూడా. కానీ సంస్థల నిర్ణయాల్లో వ్యక్తుల ప్రమేయం ఉన్నంత మాత్రం చేత ఏ వ్యక్తి వల్లా సంస్థలు నిర్ణయాలు తీసుకోవు’.‘నో... కొంతమంది వ్యక్తులు సంస్థల్ని శాసించగలరు’.‘అలా శాసించగలిగేది సంస్థల యజమానులు మాత్రమే’.‘మరి ఆ యజమానుల్ని ప్రభావితం చెయ్యగలిగిన వాళ్లు?’‘ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్లు కన్విన్స్‌ చెయ్యడానికే పరిమితం’.‘మాటలు వేరైనా అర్థం అదే. చర్యలు వేరైనా ఫలితం అదే.’‘ఓ.కే.. అలా అనుకోవడం వల్ల నీకు ఉపశమనం కలుగుతుందనుకుంటే నీ ఇష్టం. కానీ సందర్భం వచ్చింది కాబట్టి... ఓ మాట చెబుతాను. మనిద్దరి మధ్యా ప్రవహిస్తున్న నది, పేరుకి ప్రాణహితే అయినా... నువ్వా తీరం! నేనీ తీరం! రాక పోకలకి బల్లకట్టు చాలనుకుంటావు నువ్వు. కానీ వంతెనలు ఉండా లంటాన్నేను’.‘మీరెప్పుడూ ఆ వంతెనలు కట్టే ప్రయత్నం చేసినట్టు నాకనిపించలేదు’.