చుట్టం చూపుగా ఇంటికొచ్చిన మామయ్య ఏదో ఒక రోజు తిండి లాగించి వెళ్లిపోతే బాగుండేది. సిటీ చూడాలంటాడు. చార్మినార్‌ ఎక్కాలంటాడు. ‘జూ’కి వెళదాం రమ్మంటాడు. బుద్ధుని విగ్రహం చుట్టూ హుస్సేన్‌సాగర్లో బోటు షికారు చెయ్యలంటాడు. చికెన్‌ ఫ్రైలాగా నన్ను కాసేపు తినడం మొదలుపెట్టాడు.మామయ్య సోది వింటూ నేన్నోర్మూసుకున్నా.... నాభార్య భ్రమరాంబ ముఖం కాల్తున్న పెనం మీద నీటి బొట్టు పడ్డట్టు అయింది. చిటపటలాడింది. మూలిగింది. నీలిగింది. చివరకి ఏమీ చేయలేక పాశుపతాస్త్రం సంధించినట్టు అలిగింది. అంతకంటే ఏం చేయగలదు పాపం?నేను మాత్రం ఏం చేయగలను? ఆ వచ్చింది. స్వయాన మా అమ్మకి అన్నగారే కాబట్టి... అంటే నాకు బంధువు కాబట్టి నాలుగు రోజులు ఆఫీసుకి శలవు పెట్టిపారేశాను. అటు మామయ్యను తిప్పి సిటీ అంతా చూపించే పని... ఇటు ఇంట్లో వంట పనీ రెండూ నా నెత్తికెత్తుకోక తప్పలేదు.అదేమిట్రా అబ్బీ...వంట నువ్‌ చేస్తున్నావేమిటి? అంటూ క్వశ్చన్‌ చేయనే చేసాడు.

ఏం చెప్పాలో పాలుపోక.... అబద్ధం చెప్పేయ్‌మని ఆత్మఘోషిస్తుంటే ‘అది దూరంగా వుంది’ ఠక్కున అనేశాను.ఛ! నోర్ముయ్‌! అబద్ధాలాడడం ఎపడు నేర్చుకున్నావ్‌?... మీద ఎక్కేశాడు మామయ్య.నేను చెప్పింది అబద్ధమేనని మామయ్య ఎలా వూహించాడో బోధ పడ్లేదు.‘‘అబద్ధం చెప్పినా ‘క్విక్‌ ఫిక్స్‌’ మల్లే అతికినట్టుండాలి...నీకు ఏదీ చేతనై ఏడవదు...’’ అంటూ శాపనార్థాలు పెట్టాడు.మామయ్యకి చాదస్తం పాలెక్కువ. అనవసరమైన ప్రశ్నలతో నా డొక్క చించి డోలు కట్టేయడం బొత్తిగా నచ్చి చావడం లేదు. దానికి తోడు ఆయనగారి మాటలు వింటూ భ్రమరాంబ పకపక నవ్వొకటి!‘‘మడి ఆచారం గల వంశం మీది. మీ తాతగారు అగ్నిహోత్రావధాన్లుగారంటే నిప! నీ తండ్రి సరేసరి. సదాచార సంపన్నుడు. మీ అమ్మ మడి కట్టుకుని వంట చేస్తే గాని ముద్ద ముట్టడు. అలాంటిది.... నీ భార్య బైట చేరిందని చెవిలో కేబేజీ పువ్వు పెడతావా?’’ రెచ్చిపోయాడు.మామయ్య మాటలు నా చెంప మీద ఫెడీల్మని కొట్టినట్టు అనిపించినయ్‌.