సాహితీ నదాల్లోనూ, కవుల కలాల్లోనూ, పసికందు బోసి నవ్వులోనూ, వేకువలోను, పెల్లుబికే భావ తరంగంలా... తెల్లటి కాన్వాస్‌పై ఆకుపచ్చటి రంగును పులిమి చమ్కీ పౌడర్‌ను చిలకరించినట్లుగా .. మనిషి - పక్షీ, గొడ్డు-గోదా, మట్టీ-మొక్క కలిపి ఒకే కుటుంబం అగుపించేలా వుంటుంది మా ఊరు.నేనూ నా నేస్తాలు పొలాల గట్లమీద పరుగెత్తడం, పిల్ల కాలువలో పడి ఈత కొట్టడం, రాళ్లు విసిరి చింతకాయలు రాలగొట్టడం, తోటమాలి కళ్లు గప్పి జామకాయలు దొంగిలించడం లాంటి నిత్యకృత్యాలతో మా దైనందిక జీవితం సంతుష్టిగా సాగిపోతుంది. ఒకరోజు తొలకరి జల్లు పడడంతో ఊరంతా పొలాల వైపు పరుగులెత్తారు. తొలకరి కురిసిందంటే మా పల్లెకు పండుగ. ఒకటే హడావిడి. పట్టలేనంత సంబరం.కచ్చా పోసుకుని చేలోకి దిగారు ఆడవాళ్లంతా. సాల్లు కట్టడంలోను, నార అందివ్వడంలోను మునిగిపోయారు మగాళ్లు. అమ్మా-నాన్న కూడా ఆ జనంలో కలిసిపోయారు. పొలం గట్టున వున్న నేరెడు చెట్టునెక్కి నేను పళ్లుకోసి కిందకు వేస్తూంటే చెట్టు కిందవున్న నా నేస్తాలు ఏరుకుంటున్నారు. రాత్రి కురిసిన జల్లులకు చెట్టు కొమ్మలన్నీ తడిసి వుండడంతో పట్టు సడలి ‘అమ్మా..’! అని అరుస్తూ చెట్టు కిందనున్న బురద గుంటలో పడిపోయాను. వారం రోజుల కిందట ఆడా-మగా తేడా లేకుండా ఆడుకున్న నాలో ఎపడూ లేని కొత్త ఆలోచనలు అంకురించాయి. తొలకరి జల్లు కురిసినపడు ఊరి జనంలో ఏర్పడిన ఆరాటం లాంటి హృద్వేగం నాలో ఎందుకు కలుగు తోందో అర్థం కావడం లేదు. కుబుసం విడిచిన పాములా హుషారు ఉరకలెత్తిస్తున్నా.. బద్ధకం లాంటి మత్తు నిస్సత్తువను నింపుతోంది. 

మొదట సాధారణంగా కనిపించినా... తర్వాత పరవళ్లు తొక్కుతున్న ఈ మత్తు ప్రవాహ తీవ్రతలో నాలో ఏవేవో మార్పులు జరిగాయి. హఠాత్తుగా ఒంటరిదాన్ని చేశారు. నాతో తిరిగిన నేస్తాలలో మగ పిల్లల్ని నా దరికి రానివ్వకుండా చేసింది అమ్మ. స్వర్ణయుగం ముగిసింది. పట్నం నుంచి అత్తయ్య, మామయ్య, కామేశం బావా వచ్చారు. కాదు నాన్నే పిలి పించాడు. బావ పెద్ద చదువు చదివాడు. అమ్మ ద్వారా తెలిసింది బావతో నాకు పెళ్ళి నిశ్చయిం చడానికే వాళ్లని నాన్న పిలిపించాడని. సాయం త్రానికల్లా వాళ్లు వెళ్లిపోయారు. ఓ వారం రోజుల తర్వాత మావయ్య ఒక్కడే మళ్లీ వచ్చాడు. నాతో పెళ్లి నిశ్చయించిన వేళా విశేషమని, బావకు సర్కారీ కొలువు వచ్చిందని, వెంటనే పెళ్లి జరిపించేద్దామని అంటున్న మావయ్య సంతోషంలో అమ్మా, నాన్నా భాగం పంచుకున్నారు. బావ వరకట్నం వద్దనడంతో ఆ డబ్బుతోనే పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లైన మరుసటిరోజే బావ ఉద్యోగంలో చేరడానికి పొరుగూరు వెళ్లిపోయాడు. తెలిసిన అత్తా మామలే కాబట్టి, పైగా నా వల్ల బాగా కలిసి వస్తుందని నన్ను కాళ్లు కింద పెట్టనివ్వకుండా నౌకర్లు - చాకర్లతో సకల రాచమరియాదల మధ్య బావ దగ్గర లేని వెలితి తెలియకుండా యేడాది గడిచిపోయింది.