అది తెల్లవారుజాము. సూర్యుడు రోజులా ఉదయించడానికి ఇంకా గంట సమయం వుంది. ఆకాశంలో నల్లటి మేఘాలు ముసురుకుంటున్నాయి. గాలి విసురుగా వస్తున్నది. మేఘాల ఘర్షణ వల్ల మెరిసిన మెరుపు తాలూకు వెలుగులో ఒక అందమైన మేడ, దానికి ఎదురుగా చిన్న పెంకుటిల్లు స్పష్టంగా కనిపించాయి.దిక్కులు పిక్కటిల్లేట్లు ఉరిమింది ఆకాశం. భూదేవి నుదుట కుంకుమ బొట్టు అలంకరించినట్లు ఒక వర్షపు చినుకు కురిసింది. ఆ చినుకుకు మరికొన్ని చినుకులు తోడై క్రమంగా జల్లులుగా మారి వర్షం ఉధృతమయింది. ఆకాశం నుండి భూమికి తెల్లని దారాల వంతెన నిర్మించినట్లుగా వుంది ఆ దృశ్యం.పెంకుటిల్లులో దృశ్యంఆకాశాన మెరిసే మెరుపుల కాంతి లో పెంకుటింటిలోని వస్తువులు స్పష్టంగా కనిపించసాగాయి. నులకమంచం, బట్టలు వేసిన దండెం, బోర్లించిన పాత్రలు ఆ వెలుగులో వికృతంగా దర్శనమిచ్చాయి.ఆ నులక మంచంపై ఒళ్ళు తెలియకుండా నిద్రిస్తోన్న ఒక పడుచు జంటపై వెలుతురు పడింది. ఒకరినొకరు పెనవేసుకుని గాఢనిద్రలో వున్నారు ఆ దంపతులు. వర్షానికి ఇల్లు కురియసాగింది. పెంకుల మధ్యనుండి వర్షపుధారలు ఆ ఇంటిలోని ప్రతి ప్రదేశాన్ని తడుపుతున్నాయి.ముఖంపై చినుకుల స్పర్శ చల్లగా తగలడంతో ఆమెకు మెలకువ వచ్చింది. బద్ధకంగా కళ్ళు తెరిచింది. వర్షం వస్తుందని గ్రహించి లేచి కూర్చుంది. కిటికీగుండా బయటకు చూసింది. వర్షం ఉధృతంగా కురుస్తోంది. ఏనుగు తొండాల్తో పోసినట్లుంది ఆ దృశ్యం. భయమేసింది ఆమెకు. ప్రక్కనే గాఢనిద్రలో వున్న తన భర్తని చేతులతో తట్టుతూ ‘‘ఏమయ్యా, లే, ఇల్లు కురుస్తోంది’’ అన్నది.అతను బద్ధకంగా కళ్ళువిప్పి ‘ఏంటి రాజ్యం’ నిద్రమత్తుగా అన్నాడు.

‘‘లేలే, ఇల్లు చూడు ఎలా కురుస్తుందో, వర్షం ఎలా వస్తుందో’’ చెప్పింది గాబరాగా.ఉండనా, ఊడనా అన్నట్లు వున్న గడియ విరగ్గానే వేగంగా తెరుచుకున్న కిటికీలోంచి వర్షపు జల్లు విసురుగా కొట్టింది. పదునైన కత్తిలా చల్లగాలి వారిని తాకింది. ఆ చలికి ఒక్కసారి ఇద్దరు వణికిపోయారు.‘పాడు వర్షం’ తిట్టుకొంది రాజ్యం. వర్షమొస్తే తమ ఇల్లు ఏవిధంగా వుంటుందో వారిద్దరికీ బాగా తెలుసు. ఆ విషయాన్ని ప్రస్తుతం ఆ ఇల్లు నిరూపిస్తోంది. ఆ ఇంట్లో వున్న రెండు గదులలో కురవని నెలవంటూ దాదాపు లేదు. ప్రతి ప్రదేశాన్ని వర్షపు ధారలు తడుపుతున్నాయి.ఆ దంపతులు లేచి నులకమంచం ఎత్తి తడవని ప్రదేశంలో వేశారు. బట్టలు మొదలైన వాటిని కురవని ప్రదేశాల్లో భద్రపరిచారు. పాత్రలపై మూతలు పెట్టారు. ముఖ్యమైన వాటిని కురవని ప్రదేశాల్లో సర్దేసరికి ఇద్దరూ తడిసి ముద్దయ్యారు.తమ ఒంటిమీద దుస్తులు తడిసిపోవడం వల్ల ఇద్దరికీ చలివేయసాగింది. రాజ్యం చలికి తాళలేక వణికిపోసాగింది. చీరెను విప్పి పిండింది. ఆ చీరని ప్రక్కన పెట్టింది. లంగా జాకెట్టులతో వున్న ఆమె పొడి బట్టల కోసం బట్టల మూటల్లో వెదకసాగింది వంగి. ఆమె వక్షం బరువుగా కదులుతోంది లయబద్ధంగా. వంగినపడు ఆమె పొట్టమీద ముడుతలు అందంగా వున్నాయి. బట్టల మూటలోంచి పొడి చీరను, జాకెట్టు, లోలంగాను తీసుకొంది.