‘‘కొత్తసార్‌ వస్తున్నారు! కొత్తసార్‌ వస్తున్నారు!’’ ఆఫీసులో అందరికీ వినబడేలా అరిచినట్టుగా చెప్పేసి కాఫీలు తేవడానికి ఫ్లాస్కు పట్టుకెళ్లేడు పైడిరాజు. ఆఫీసు మేనేజరు ఈ మధ్య ట్రాన్స్‌ఫర్‌ అయి వెళ్లిపోయేడు. ఇప్పుడు వస్తున్న కొత్త మేనేజరు ఎవరో?! అందరికీ అతన్ని చూడాలని, పరిచయం చేసుకోవాలని ఆతృతగా వుంది.ఎవరికి వారు షర్టు కాలరు సర్దుకుని, క్రాఫింగు సరిచేసుకుని అతని రాకకోసం ఎదురు చూస్తున్నారు. అతను వచ్చేడు. అందర్నీ పరిచయం చేసుకోవడం పూర్తయింది. అతను అనితను చూసేడు. అదే సమయంలో అనిత కూడా అతన్ని చూసింది. చూడగానే నమస్కరిస్తున్న ఆమె చేతులు కిందకి వాలిపోయాయి. మనసంతా శూన్యం అయిపోయింది. గబగబా హేండ్‌బ్యాగ్‌ తీసుకుని బయటకు నడిచింది. 

అతని వదనంలో కూడా ఏవో అలవికాని భావాలు చోటుచేసుకున్నాయి. అతనికి చిరుచెమట్లు పట్టేయి.అనిత బయటకొచ్చి ఆటో ఎక్కింది. అప్పటికే ఆకాశం మేఘావృతమైంది. నాలుగు వైపులనుంచి కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. వర్షం కురవడం మొదలైంది. వర్షం ఏటవాలుగా, ఉధృతంగా పడుతూ అంతకంతకూ వాతావరణం బీభత్సంగా తయారైంది. అనితకి వర్షం అంటే విపరీతమైన భయం. కారుమబ్బులు, ఉరుములు - మెరుపులతో, ఈదురుగాలి తోడై పడే వర్షపు హోరు ఆమె గుండెలో దడని పుట్టిస్తాయి.రోడ్డుమీద నీరు నదీ ప్రవాహంలా దూసుకు పోతున్నది. వాన నీరు తనతో పాటు చెత్తా- చెదారం అంతా మోసుకు పోతున్నది.

రోడ్డంతా బురదగా వుంది. వర్షపుజల్లు పడి చీరంతా తడిసి పోయింది. ఆ వీధంతా గోశాలలోని ఆవుల పేడ, రొచ్చుతో వాన నీరు కల్సిపోయి పరమరోతగా కంపుగొడుతూ వుంది. ఎలాగో ఇల్లు చేరుకుంది అనిత.‘‘అనితా! ఎవరొచ్చారో చూడు’’ అంది తాయారమ్మ సంతోషంగా.‘‘ఎవరూ?’’ అంది చెప్పులు విప్పుకుని లోపలికి వస్తూ అనిత.‘‘నీకు వేలు విడిచిన మేనమామ కొడుకు జగదీష్‌! పోల్చుకోలేదా? పదేళ్ల కిందట చూసేవు. అందుకే పోల్చుకుని వుండవు. తల తుడుచుకుని కాళ్లు కడుక్కుని రా. వేడి కాఫీ తెచ్చి ఇస్తాను. అన్నట్టు మా మేనల్లుడు నిన్ను చూడ్డానికే పని గట్టుకుని ఇంతదూరం వచ్చేడే!’’ అందావిడ. అనిత మొహంలో ఎలాంటి భావప్రకటనా లేదు. ఆమె లోపలికి వెళ్లిపోయింది.