‘వాట్‌ డూ ఐ డు నౌ’’ మళ్లీ అనుకున్నాడు అజయ్‌. గంట దాటిపోయింది రైలు ఆగిపోయి. పోయిన గంట గురించి కాదు అతని బాధ. ఇంకెంతసేపు పడుతుందో తెలీదన్నాడు గార్డ్‌. దాదాపు రైలు ఆగగానే లేచి కూర్చున్నాడు అజయ్‌. ‘లోయర్‌బర్త్‌లో ఉన్న తనలాంటి నిద్ర తక్కువ వాళ్లకి కాక ఎ.సి. టు టైర్‌లో ప్రయాణించే వాళ్లకు రైలు ఆగినా వెంటనే తెలిసే అవకాశం లేదు. లేదూ తన లాగే వాళ్లకి కూడా తెలిసినా, నాలా గాభరా పడకుండా హాయిగా పడుకున్నారేమో లే’ అనుకున్నాడు.పొలాల మధ్యలో ఆగి ఉంది రైలు. షూస్‌ వేసుకుని బయటకు వచ్చాడు. తలుపు తీసి బయటకు చూస్తున్న అటెండెంట్‌ని పక్కకి తోసి తానూ చూసాడు. ఏమీ తెలియలా. అటెండెంట్‌తో మాట కలిపాడు.అతగాడికి కూడా ఏమీ తెలీదట. కాసేపటికి రైలు పక్కనుంచే దీపం పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు గార్డు. ఇతర బోగీల్లోంచి కూడా ఒకళ్లిద్దరు చీకట్లో కి ందికి దిగి చూస్తున్నారు.గార్డు ఒక చేతిలో దీపం, మరో చేతిలో సెల్‌ఫోనో, వైర్‌లెస్సో అర్థంకాలా రామ్‌కి చీకట్లో. దాంట్లో మాట్లాడుతూ చూసుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాడు. దగ్గరికి వచ్చాక అడిగాడు 

‘‘ఏంటి సార్‌ సిగ్నలా? క్రాసింగా’’. ‘‘అవును ఓ పది నిమిషాలు’’ లాంటి సమాధానమేదో ఊహించాడు.మాంఛి డ్రెస్సు, మాట తీరు ఉన్న అజయ్‌ని చూసి అంత ముక్తసరిగా చెప్పలేకపోయినట్టున్నాడు.‘‘ట్రాక్‌ ప్రాబ్లం సార్‌. లైన్‌మ్యాన్‌ ఎమర్జెన్సీలో ఆపాడు. ప్రమాదం తప్పింది. పట్టాలు కోసేసారో, మరెలాగన్నా తెగిపోయాయో తెలీదు. ఎంత సేపో తెలీదు. టెక్నికల్‌ టీం వచ్చేదాకా కదలం’’ అనేసి వెళ్లిపోయాడు.టైం చూసుకున్నాడు. రాత్రి 2.30. ఇక్కడికి ఎంత దూరం నుంచి ఆ టీం రావాలి? ఎదురుగా వచ్చే ట్రాక్‌ బాగానే ఉందా? ఇలాంటపుడు రైల్వేవాళ్లు ఎంత త్వరగా పని చెయ్యగలరు? ఇలాటి ప్రశ్నలు వేటికీ అతగాడి దగ్గర జవాబు లేదు. పొద్దున దాకా కదల్దేమో అని భయం పట్టుకుంది.మధ్యాహ్నానికల్లా ఆఫీసులో ఉండకపోతే కొంపలంటుకుపోతాయి. ‘‘ఒకటి రెండు నిమిషాల క్రితమే ఓ లెవెల్‌ క్రాసింగ్‌ దాటాము’’ అని చెప్పాడు అటెండర్‌. మెల్లగా ఆ రోడ్డుదాకా వెళితే అక్కడ ఏ లారీయో, టాక్సీయో పట్టుకోలేకపోతామా అనుకున్నాడు. ఎక్కడున్నామో ఇదమిత్థ్థంగా తెలీకుండా ఇలా చీకట్లో నడవడం మరీ సాహసమేమో అన్న సందేహం వచ్చింది. మళ్లీ సొంత దేశంలో, సొంత రాష్ట్రంలో ఈ పనిచేయలేకపోతే ఇంకెక్కడ చేస్తాను అనుకుని లేచాడు.