బస్సు వచ్చి ఆగేసరికి అక్కడ కూర్చుని ఎదురు చూస్తున్నవాళ్ళంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. కేరింతలు కొట్టారంటే అందరూ వేగంగా కదిలి బస్సెక్కేందుకు పరుగులు తీశారనుకుంటున్నారా? అబ్బే! అదేం లేదు. ఉత్సాహం వురకలు వేస్తున్నా అంతా అతి నెమ్మదిగా లేచి బట్టలు, బూట్లు సర్దుకుంటూ అడుగులో అడుగేస్తూ కదలడం మొదలుపెట్టారు. వాళ్ళంతా ఎక్కేవరకు బస్సు కదలదనే ధైర్యమే కాదు అక్కడున్న అసలు సంగతి. వారంతకంటే మించి చకచకా పరుగులు పెట్టే శక్తి వున్నవారు కాదు. నెల్లాళ్ళుగా పథకాల మీద పథకాలు వేసుకుని స్ర్తీలంతా ఒక బస్సు కట్టుకుని ఒక విహార యాత్రకి, లేదా ఒక విజ్ఞానయాత్రకి లేదా రెండూ కలిసిన ఒక విలాస యాత్రకి వెళ్దాం అని నిర్ణయించుకున్నారు.ఇళ్ళల్లో చాకిరీతో, బరువు బాధ్యతలతో విసుగెత్తిపోయిన వాళ్ళకి ఆ ఊహ ఒక పిల్లతెమ్మెరలా అనిపించింది. సెల్‌ఫోన్ల మీదే ప్రోగ్రామంతా రూపొందించేసుకుని ఇళ్ళనుంచి పొలోమంటూ బయటపడ్డారు. అందరూ తమకేదో స్వేచ్ఛ కొత్తగా వచ్చిన భావనతో ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు.పాఠశాల నుంచి మైదానంలోకి ఒక్కసారిగా పిల్లలు పరుగులు తీసినట్టు వారు కదులుతున్నారు. కొందరు చిలకల్లా ఎగిరితే కొందరు పావురాళ్ళు, కొందరు పిచుకలు, మరికొందరు పాలపిట్టలు, ఇంకా కొందరు మైనాలుగా ఆకాశ విహారం చేస్తున్నట్లు చలించి పోతున్నారు.ఆ సమూహంలో ముప్ఫై అయిదేళ్ళ మున్నానించి మొదలుపెడితే, నలభై, నలభై. అయిదు - యాభై, యాభై అయిదు - అరవై, అరవై అయిదు - డెబ్భై, డెబ్భయి అయిదేళ్ళ ముత్తులక్ష్మి వరకు అన్ని వయసులవాళ్ళూ వున్నారు.

 యాభైలోపు వారందరూ సీనియర్‌ సిటిజన్ల బాధ్యత తీసుకున్నట్లు భావించి జోరుగా పెత్తనం చెలాయించేస్తున్నారు. అయితే వయసు మీద పడిన వాళ్ళేం తక్కువ తిన్నారా, వాళ్ళ పెద్దరికం పేరు చెప్పి చిన్నవాళ్ళని సతాయించి వదిలేస్తున్నారు.అలాంటి ఒక మిశ్రమ సమ్మేళనంలో వున్న ఆనందం, ఆహ్లాదం, అంతా యింతాకాదు. ఎవరేమన్నా ఎవరూ పట్టించుకోరు. అన్నీ చిరునవ్వులు, చమత్కారాలు, గడుసు ప్రేమలు, సొగసు వగలు.ఇన్నాళ్ళకి అందరం యిలా కలిసి స్వేచ్ఛగా నవ్వుతూ, తుళ్ళుతూ వెళ్తున్నామనే ఆనందమే తప్ప మరోటి లేదు.జుట్టు నెరిసినవాళ్ళు చాలామందే వున్నప్పటికీ, నెరిసిన జుట్టును కనిపించకుండా జాగ్రత్త పడినవారే ఎక్కువ. మైసూరు సిల్కు చీరలు, గద్వాలు నూలు చీరలు, కంచి పట్టుచీరలు, బెంగాల్‌, వెంకటగిరి చట్టినాడు, చెరిగల్పట్టు కాటన్‌ చీరలు రంగురంగుల అందాలతో కరకర, మిసమిస కదులుతూ, తళతళ మెరుస్తూ - ఆందరూ కదిలి నడుస్తుంటే పూలరథం కదిలినట్లుంది.కొన్ని చుడీదార్లు - మరికొన్ని పంజాబీ దుస్తులు ఇంకా కొన్ని జీన్స్‌ కాటన్‌ టాప్స్‌తో ఆ సమూహం పాత కొత్తల మేలు కలయికలా కళకళలాడిపోతోంది.