రాముడికి పట్టాభిషేకంరాచనగర మంతా కోలాహలంగా వుంది.పచ్చటి తోరణాలతో, పతాకాలతో, మంగళవాద్యాలతో, హర్షోల్లాసాలతో ప్రతి ఇల్లూ చూడ ముచ్చ టగా వుంది. సుందరాంగనలు ఇళ్ళ ముందు సుగంధ జలాలు చల్లి ముగ్గులు పెట్టారు. నగర వీధుల్లో పన్నీరు చిలకరించారు. దశదిశలా జయ జయనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ బాల గోపాలం మంగళగీతాలు ఆలపిస్తున్నారు.రాముడు సింహాసనం అధిష్ఠించబోతున్నాడు. అదీ ఆనందం.‘దాశరథికీ జై - రామచంద్ర మహరాజుకి జై - లక్ష్మణస్వామికి జై’ అంటూ జనం పెద్దగా నినా దాలు చేస్తూ పరుగెత్తుతున్నారు. అందరూ రాజప్రాసాదం ముఖద్వారం వద్ద సమావేశ మయ్యారు.దశరథ తనయుడిని ఎత్తైన సువర్ణ పీఠం మీద కూర్చోబెట్టారు. ఆయన పక్కనే సీతమ్మ తల్లి వుంది. వారిద్దరికీ ముత్తైదువలు హారతులిస్తున్నారు. వేదిక చుట్టూ వున్న కొందరు వారి మీద పూలు చల్లుతున్నారు. మరికొందరు వింజామరలు వీస్తున్నారు.ఇంతలో వసిష్ఠ మహర్షి వచ్చాడు.రామభద్రుడు లేచి గురుదేవుల చరణాలకు శిరసా వందనం చేశాడు.మహర్షి ఆయనను లేవనెత్తి గాఢాలింగనం చేసుకుని ఆశీర్వదించాడు.‘నాయనా! నీ సందర్శన, సంస్పర్శాదులతో నేను శాంతించాను. ఇన్నాళ్ళ వియోగ బాధ నుంచి‘ నా మనస్సుకు ఉపశమనం కలిగింది’ అని వసిష్ఠుడు అంటూ వుండగానే సీతాదేవి కూడా ఆయనకు వినమ్రంగా నమస్కరించింది.‘అఖండ సౌభాగ్యంతో వర్థిల్లు తల్లీ’ అని మంగళాక్షతలు ఆమె శిరస్సుపై చల్లాడు. ఇంతలో లక్ష్మణుడు వచ్చి ఆయన పాదాలకు ప్రణమిల్లాడు. మహర్షి అతనిని దగ్గరకు తీసుకుని శిరస్సుపై ముద్దు పెట్టుకున్నాడు.భరత శత్రఘ్నులు మహర్షి పాదాలను స్పృశించి కళ్ళకు అద్దుకున్నారు.

మహర్షి వాళ్ళిద్దరినీ అక్కున చేర్చుకున్నాడు. అందరూ కలిసి వేదిక దగ్గరకు వెళ్ళారు.సుముహూర్తం చూసి వశిష్ఠుడు రత్నభూషిత సింహాసనం మీద రామచంద్రుణ్ణి కూర్చోపెట్టి సువర్ణ కిరీటం ధరింపచేశారు. పవిత్ర నదీ జలాలతో నింపిన కలశాలను తెప్పించి ఆ నీటిని రామచంద్రునిపై చల్లారు. సూర్యవంశ మర్యాదానుసారం సుమంగళ జనం వేదిక మీదకు వెళ్ళి రామభద్రుని నుదుట తిలకం దిద్దారు. పురోహితులు వేదమంత్రాలు పఠించారు. ‘జయోస్తూ దిగ్విజయోస్తు’ అని మహర్షులు ఆశీర్వదించారు. ‘సీతారాములకు జయం, జానకీ మనోహరుడికి జయం, సీతావల్లభుడికి జయం’ అని పురజనులు జయ జయ నాదాలు చేశారు. భూమ్యా కాశాలలో అని ప్రతిధ్వనిస్తూ వుండగా రామచంద్రుడు మహారాజుగా పట్టాభిషిక్తుడైనట్టు అమా త్యుల వారు ప్రకటించారు. సీతాసమేతంగా శ్రీరాముడు రాజసింహాసనం అధిష్టించటం చూసి అందరూ ఆనందపడ్డారు.్‌్‌్‌రాముడికి పట్టాభిషేకం జరిగాక రెండు నెలల పాటు భల్లూక వానర వీరులందరూ అయోధ్యలోనే వున్నారు. షడ్రసోపేతమైన వంటలు, విందులూ ఆరగిస్తూ తమ రాజ్యానికి వెళ్ళాలన్నా సంగతే మరచిపోయారు వాళ్ళు. ఇన్నాళ్ళూ సీతాన్వేషణలో మునిగి వున్నారు. రామకార్యాన్ని సాధించడం కోసం సుశిక్షుతులైన సైనికుల్లా రేయింబవళ్ళూ పనిచేశారు. కార్యభారంతో సతమతమయ్యారు. ఇప్పుడే బాధ్యతాలేదు. స్వామికార్యాన్ని అత్యంత భక్తిప్రపత్తులతో తీక్షతో నిర్విఘ్నంగా నెరవేర్చా మన్న ఆనందంలో వున్నారు. ఆ ఆనందంలో తల మునకలవుతూ సంతోష సాగర తరంగాల మీద పూల తెప్పల్లా చేష్టలన్నీ గుర్తుకొచ్చాయి. గోడలెక్కుతూ గొబ్బెలెక్కుతూ చెట్ల మీదకు దూకుతూ ఆకులు కాయలు రాలుస్తూ దారిన వచ్చీపోయే వారిని వెక్కిరిస్తూ, వాళ్ళ వెంట పడుతూ వూరంతా ఓ కొలిక్కి తెస్తున్నారు.