‘‘రామూ పిల్లలనందరినీ రెడీ చేశావా ?’’‘‘చేస్తున్నాను సార్‌’’‘‘ఇంకా ఎంతమంది ఉన్నారు ? ’’‘‘ఇంకా ఇరవై మంది దాకా ఉన్నారు.’’ఎంతసేపు.. నీకు చెప్పి కూడా గంట సేపయింది కదా!’’‘‘నిజమే సార్‌.. కానీ అన్ని పనులూ ఒక్కడినే చూసుకోవాలి కదా. ఇప్పటివరకూ టిఫిన్లు రెడీ చెయ్యడంతోనే సరిపోయింది. అన్ని పనులూ నేను ఒక్కడినే చూసుకోలేక చస్తున్నాను. తోడుగా ఒక ఆయాని తీసుకోమంటే వినరు.’’ రాము గొణగడం ఆరంభించాడు.‘‘ఆయాని తీసుకురావొచ్చు కానీ జీతం ఎవడిస్తాడు, సరేలే .. ఇది మనిద్దరికీ రోజూ ఉండే గొడవలే కానీ, త్వరగా పిల్లలని రెడీ చెయ్యి. అవతల రావుగారి ఫ్యామిలీ వచ్చే వేళవుతోంది..’’ అంటూ నేను ఇవతలకొచ్చాను.మా ఇద్దరి సంభాణకి నేపథ్యం ఇది..ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే అనాథ శరణాలయానికి నేను మేనేజరుని. నాకు సహాయకునిగా రామూ. అనాథ పిల్లలని చేరదీసి పదో తరగతిదాకా చదివించి పంపడం మా శరణాలయం ముఖ్యోద్దేశం. నిధులలేమి ఉన్న సంస్థలకుండే సమస్యలన్నీ మా శరణాలయానికి ఉన్నాయి. నేను దీనికి మేనేజరుగా చేరిన కొత్తల్లో ఇది బాగానే నడిచేది. స్వచ్ఛంద సంస్థను స్థాపించిన పెద్దాయన తన ఆస్థులను సంస్థపరం చేశాడు.

 ఆయన బతికున్న కాలంలో స్వచ్ఛంద సంస్థలన్నింటికీ నిధుల కొరత ఉండేది కాదు. ఆయన మరణం తర్వాత, వారసులకు ఆయనంత పెద్ద మనసు లేకపోయింది. సంస్థ ఆస్థులపై వారి కళ్ళు పడ్డాయి. ఫలితం ఆస్థులన్నీ కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి. మా శరణాలయానికి డబ్బు కొరత మొదలైంది. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి డిపాజిట్లపై వడ్డీతో, ఇంకా ఎవరన్నా దాతలు అడపాదడపా ఇచ్చే విరాళాలతో శరణాలయం నడుస్తోంది. పిల్లలకు తిండి లోటు లేకుండా చూస్తున్నా, అన్ని ఖర్చులూ భరించి చదువు చెప్పించడం రోజు రోజుకూ భారంగా మారుతోంది. పిల్లల బాగోగులు చూడటానికి ఇంతకుముందు ఉండే సిబ్బంది కూడా తగ్గిపోయారు. ఇప్పటికి నేనూ, రామూ ఇద్దరమే మిగిలాం.ఇక రామూను గురించి.. అతడు కూడా అనాథే. ఇదే శరణాలయంలో పెరిగాడు. శరణాలయంలోని పిల్లలంటే ఉండే అభిమానంతో బయటకు వెళ్ళకుండా ఇక్కడే నాకు సహాయకుడుగా కుదురుకున్నాడు. తిండీ, గూడు, బట్టా గడుస్తాయి. ప్రత్యేకంగా ఇచ్చే జీతమేమీ లేదు. ఐనా పిల్లల పనులన్నీ అభిమానంతో చేస్తాడు. పనెక్కువైనప్పుడు సణగడం కద్దు. పెద్దగా చదువుకోకపోయినా మంచి తెలివైనవాడు. న్యూస్‌ పేపరును పొల్లుపోకుండా చదువుతాడు. వాడి తెలివితేటలు, విషయపరిజ్ఞానం, విశ్లేషణా చూసి అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.ఇలా ఉండగా , ఒకరోజు ‘‘రావ్‌ ఇండస్ర్టీస్‌’’ ఆఫీసు నుంచి నాకు కబురొచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. రావ్‌ ఇండస్ర్టీస్‌ అధినేత రావుగారు ఈ వూరి అత్యంత ధనికుల్లో ఒకరు. అలాంటివారికి నాలాంటి సామాన్యుడితో పనేముంటుంది ? వెళ్ళి వారి పియ్యేని కలిశాను. ఆయన మాటల సారాంశమేమంటే, రావుగారి మనవడి పుట్టినరోజు వచ్చేవారం ఉంది. ఈ సారి తన మనవడి పుట్టినరోజును అనాథ పిల్లల మధ్య జరపాలని రావుగారు, నిజం చెప్పాలంటే రావుగారి శ్రీమతి నిర్ణయించారు.

అందుకు వారు మా అనాథ శరణాలయాన్ని ఎంచుకున్నారు. బాబు పుట్టినరోజునాడు శరణాలయంలోని పిల్లలందరినీ శుభ్రంగా తయారుచేసి ఉంచమని హుకుం జారీ చేయడానికి రావుగారి పియ్యే నన్ను పిలిచాడు. నేను అంగీకారం తెలిపి, సంతోషం నిండిన మనస్సుతో బయటికొచ్చాను. రావుగారి వంటి ధనికుడు మా శరణాలయానికి రావాలనుకోవడం నిజంగా మాపిల్లల అదృష్టమే! ఈ సందర్భంగా రావుగారిని విరాళం అడగవచ్చు లేదా కొంతమంది పిల్లల చదువు భారం వహించమని కోరవచ్చు. కోటీశ్వరుడైన ఆయనకు అదో లెక్కలోది కాబోదు. ఇలా ఊహల్లో తేలుతూ, నేను శరణాలయానికి వచ్చి రామూకు విషయాన్ని చెప్పాను. అతడు పెద్దగా సంతోషించినట్టు కనబడలేదు. నేనదేం పట్టించుకోకుండా, పనుల్లో పడ్డాను.