‘‘నాకు మూడ్‌ లేదు’’ కవిత భర్త సుధాకర్‌ కౌగిలి వదిలించుకునిఅటు తిరిగి పడుకుంది.‘‘అంటే’’ సుధాకర్‌ లైట్‌ ఆర్పాడు.‘‘అంటే, అంతే...’’ కవిత లైటు వేసి, బెడ్‌ రూమ్‌లోంచిబయటకొచ్చి సోఫాలో పడుకుంది.పరమ చిరాగ్గా సుధాకర్‌ పడగ్గదిలోంచి వచ్చి, బాల్కనీలో నిలబడి సిగరెట్టు కాలుస్తూ, ఎదురుగా ఉన్న ఫ్లాట్‌ వైపు చూశాడు. ఆ ఫ్లాట్‌ హాలులో ఉన్న కర్టెన్‌ అటు ఇటూ కదులుతూంది. సుధాకర్‌కు సరదాగా అటే చూడాలనిపించింది. ఆ ఫ్లాట్‌లోకి ఈ మధ్యే కొత్త జంట అద్దెకొచ్చారు. ఆ అమ్మాయి జడ నిండా మల్లెపూలు పెట్టుకుంటుంది. అతడు ఆఫీసు నుంచి రావడం ఆలస్యం తలుపులేసుకుంటారు వాళ్లు. ఆ ఇంటి పనిపిల్ల ముందు వరండాలో కూచుని కూరలు తరగడమో,బట్టలు మడత పెట్టడమో చేస్తూంటుంది.ఈ మధ్య సుధాకర్‌ వారం రోజులు సెలవు పెట్టాడు తండ్రి ఊరి నుంచి వచ్చాడని. అప్పుడు ఆ ఫ్లాట్‌ కేసి చూడ్డం బాగా అలవాటయింది. ఆ ఫ్లాట్‌లో అతను, సుధాకర్‌ని చూసి, ‘హాయ్‌’ అంటాడు. అదే ఇద్దరి పలకరింపు.గదిలోంచి బయటకొచ్చిన సుధాకర్‌ ఇలా పొద్దుపోయాక రాత్రి ఆ ఫ్లాట్‌ వంక చూడ్డం ఇదే మొదటిసారి. సోఫాలో అతను, అతని ఒడిలో తలపెట్టుకొని ఆ అమ్మాయి..ఎదురుగా ఏదో చూస్తూ గలగలా నవ్వుతున్నారు. మిడ్‌నైట్‌ సినిమా అయి వుంటుందిలే అనుకుంటూ, వాళ్లు తనని గమనిస్తే బాగుండదనిపించి, లోపలకొచ్చాడు సుధాకర్‌ తనూ తన భార్యతో కలిసి, ఆ మిడ్‌నైట్‌ మూవీ చూడచ్చుగా అనుకుంటూ...సోఫాలో గాఢ నిద్రలో ఉంది కవిత. భార్యని నిద్రలేపాలనిపించింది కానీ, ఎందుకో లేపాలనిపించక సుధాకర్‌ తన గదిలోకి వెళ్లాడు. నిద్ర పట్టదు. ఎక్కడుంది పొరపాటు? ఎటు నుంచి ఈ సమస్యని సర్దుకు రావాలి? చిరాగ్గా ఆ మంచంపైన అటు ఇటూ కదుల్తూ పడుకుని గాఢంగా నిట్టూర్చాడు సుధాకర్‌. 

ఈ పరుగుల్లో అలసిపోయి బతుకులాగడమేనా!పెళ్లప్పటికి సుధాకర్‌కి ముప్ఫయి ఐదేళ్లు. భార్య కవితకి ముఫ్పయి మూడేళ్లు. కవిత ఓ పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌. సుధాకర్‌ మరో కంపెనీలో మేనేజర్‌. ఉద్యోగాలు బాగున్నాయి. డబ్బులూ విపరీతంగా ఉన్నాయి. కానీ, కానీ...జీవితంలో ఏదో వెలితి!సుధాకర్‌ ఆలోచనలు ఒక్కసారిగా తన అమ్మమ్మ, తాతయ్య, తన తల్లి, తండ్రి, వారి జీవిత విధానంపై మరలాయి. ఎంత హాయిగా జీవించారు వాళ్లు. ఇంత గొప్ప ఇళ్లు లేవు, ఇంత డబ్బూ లేదు. సుధాకర్‌ తండ్రి ఓ ఆఫీసులో గుమస్తా. ఏనాడూ అమ్మ ముఖంలో అసంతృప్తి కానీ, నాన్న ముఖంలో చిరాకు కానీ తను చూడలేదు. పనులన్నీ అయిపోయాక దొడ్లో మల్లెపందిర దగ్గర మంచం వేసేది తల్లి. తండ్రి స్నానం చేసి, భోంచేసి ఆ వెన్నెల్లో మంచం మీద ఓ దుప్పటి పరుచుకు పడుకునేవాడు. అమ్మ ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని, సిగలో పెద్ద పూలచెండు పెట్టుకుని, ముఖానికి పౌడరు రాసుకొని, నాన్న పక్కన కూచునేది. ఎంతసేపో ఎన్నెన్నో కబర్లు చెప్పుకునేవారు. పళ్లెంలో తమలపాకు, వక్కపొడి, సున్నం సీసా ఉండేవి. బాల్యంలో ఇవన్నీ తను గమనించేవాడు. ఈ రోజు సుధాకర్‌ కళ్ల ముందు ఆ అద్భుతమైన తల్లిదండ్రుల జీవిత విధానం గుర్తుకొచ్చింది. అంటే సుఖం, ఆనందం అనేవి డబ్బులో లేవు కదా!! ఉన్నట్టుండి సుధాకర్‌కి చాలా కోపమొచ్చింది. తనపైన, ముఖ్యంగా కవితపైన. గడియారం వంక చూసాడు. కవిత ఆఫీసుకెళ్లేందుకు టైం అవుతోంది.