‘‘ఏరా రాజేష్‌ సుధ ప్రోగ్రాంకి నువ్వు కూడా వస్తావు కదా’’ అపడే అక్కడకు వచ్చిన రాజేష్‌ని అడిగాడు రత్నాకర్‌.‘‘ఎవరా సుధ ఏమిటా ప్రోగ్రాం?’’ అడిగాడు రాజేష్‌.‘‘టి.వి. యాంకర్‌ సుధ తెలియదా? ఈనెల 26వ తారీఖున తను మన ఊళ్ళో జరగబోయే ‘మీ సమక్షంలో’ అనే కల్చరల్‌ ప్రోగ్రాంకి ఏంకర్‌గా వస్తోంది. ఇంత ముఖ్యమైన విషయం నీకు తెలియదంటే ఆశ్చర్యంగా వుంది.’’‘‘నాకు అలాంటి ప్రోగ్రామ్స్‌ అంటే ఇంట్రస్ట్‌ లేదని నీకు తెలుసు కదా. నన్ను వదిలేయ్‌’’ అన్నాడు రాజేష్‌.‘‘ఇలా అన్నిటికీ నిన్ను వదిలేయబట్టే ఎందుకూ పనికిరాకుండా తయారయ్యావు. ఆ ప్రోగ్రాంకి వెళ్తే అందాల సుధని ప్రత్యక్షంగా చూడవచ్చు. అవకాశం వస్తే మాట్లాడవచ్చు.’’‘‘అంత అందంగా వుంటుందా?’’‘‘అయితే నువ్వు నిజంగానే సుధ ప్రోగ్రాం ఒక్కటి కూడా టీవీలో చూడలేదా? నువ్వు ఈ ప్రోగ్రాంకి తప్పనిసరిగా రావాల్సిందే. నేను వంద రూపాయలు ఖర్చుపెట్టి మరీ నిన్ను తీసుకువెళతాను’’ అన్నాడు రత్నాకర్‌.‘‘అబ్బా... వంద రూపాయలా?’’‘‘అది సుధను చూడటానికి అయ్యే ఖర్చు. అది మాత్రం సరిపోదనుకున్నావనుకో. అయిదువేలు నీవి కావనుకుంటే సుధ ఒక రాత్రికి నీదవుతుంది.’’‘‘ఛీ... ఛీ... నువ్వెపడూ ఇంతే. అందరి గురించీ ఇలాగే మాట్లాడతావు.’’‘‘సరేలే. నీతో నాకు వాదనెందుకు. మనం 26న సుధ ప్రోగ్రాంకి వెళుతున్నాం. అంతే.’’ అన్నాడు రత్నాకర్‌ ఆ ఆడిటోరియం విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించబడి వుంది. ఆ ప్రదేశం అంతా జనం సందడిగా తిరుగుతున్నారు.

 రాజేష్‌ స్నేహితులతో కలిసి వెళ్లి తమ సీట్లలో కూర్చున్నారు.ప్రోగ్రాం నిర్ణయించిన దానికన్నా గంట ఆలస్యంగా ప్రారంభమయింది. సుధ స్టేజ్‌ మీదకు రాగానే ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఆమెను చూస్తూనే రాజేష్‌ ఆశ్చర్యపోయాడు.‘‘అరె ఈమె నాకు తెలుసు’’ అన్నాడు రాజేష్‌.‘‘నీకేమిటి. ఆమె అందరికీ తెలుసు’’ నవ్వుతూ అన్నారు స్నేహితులు.‘‘నేను కూడా ఈమెకు తెలుసు’’ అన్నాడు రాజేష్‌.‘‘ఎలా తెలుసు బాబూ! కొంపతీసి చిన్నపడు మీరిద్దరూ ‘తేనెటీగ, తేనెటీగ ఎందాక కుడతావే పోవే ఆవంక’ అని పాడుకోలేదు కదా’’ అన్నాడు రత్నాకర్‌.‘‘తేనెటీగ కాదురా బాబూ తూనీగ. మొత్తం పాటే మార్చేశావు’’ నవ్వుతూ అన్నాడు మరో స్నేహితుడు.‘‘మీరు కాసేపు ఆగుతారా. ఆమె కాలేజ్‌లో నా క్లాస్‌మేట్‌ సాగరిక.’’ అన్నాడు రాజేష్‌.‘‘ఆ గరికకి ఈ సుధకి పోలికలున్నాయేమో. అంతేకానీ ఈమె సాగరికేమిటి? సరిగ్గా చూడు’’.‘‘డిగ్రీ మూడు సంవత్సరాలు నాతో కలిసి చదివిన ఆమెను గుర్తుపట్టలేనా? అందులోనూ తను మా కాలేజీ బ్యూటీ’’‘‘చూశావా టి.వి. చూడకపోవడం వలన జనరల్‌ నాలెడ్జ్‌లో ఎంత పూర్‌గా వున్నావో. లేకపోతే ఇంత ముఖ్యమైన విషయం ఇంత లేట్‌గానా తెలుసుకోవడం.’’