ఆకాశం అంతా శూన్యం అని తెలిసినా దానివంక చూసిన ప్రతిసారీ మనసు పరవశిస్తూనే ఉంటుంది. ఇవాళెందుకో మరీ అద్భుతంగా నన్ను తనవైపు పిలుస్తున్నట్టుగా ఉంది. మనుషులని అత్యంత ప్రేమించే వ్యక్తి ఎవరో వారి ఆనందం కోసం అక్కడ వేల కోట్ల నక్షత్రాలను అతికించి పెట్టినట్టున్నాడు. ఆ నక్షత్రాల దగ్గరకు వెళ్లి చూస్తే బాగుండు.అనుకున్నదే తడవుగా నా శరీరం గాలిలోకి తేలసాగింది. కాసేపట్లో నేను ఆ చుక్కల దగ్గరకు వెళతానన్న ఆలోచనకే సమ్మోహితుడనయ్యాను.నా ప్రయాణం సాగుతూ వుంది. దగ్గరకు వెళ్లే కొద్దీ నక్షత్రాలు ఇంకా అద్భుతంగా కనపడసాగాయి. అవి కొద్దిగా కదులుతున్నట్టు కూడా వున్నాయి.ఇప్పుడు అంతా స్పష్టంగా కనపడుతోంది. ఎంత ఆశ్చర్యం... ఎంత అద్భుతం... అవి నక్షత్రాలు కావు. రంగు రంగుల సీతాకోక చిలకలు! మిరుమిట్లు గొలిపే తమ ఆ రెక్కల వెలుగులతో ఆకాశాన్నంతా ఒక వింత సోయగంతో వెలిగిస్తున్నాయి అవి.ఒక్కొక్కటి ఒక్కొక్క సొగసుతో, మెరుపుతో మెరిసిపోతున్నాయి. 

వాటి రెక్కలనుంచి వచ్చే శబ్దం ఆకాశమంతా వ్యాపిస్తూ వుంది.అంతలో ఎక్కడినుంచో ఒక వింత శబ్దం. సీతాకోక చిలకలన్నీ ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్లసాగాయి. అన్ని మూలలనుంచి వేల వేల సీతాకోక చిలకలు ఆ శబ్దం వినబడిన వైపు ఎగరసాగాయి.ఏముందక్కడ?నేనూ అక్కడికి వెళ్లాను.ఒక సీతాకోక చిలక చుట్టూ మిగిలినవన్నీ సభ తీరి వున్నాయి. ఆ సీతాకోక చిలక మిగిలిన వాటికంటే కొంచెం తేడాగా వున్నట్టు అనిపించింది.‘‘దయచేసి నన్ను వదిలెయ్యండి’’ వేడుకుంటోంది ఆ సీతాకోక చిలక.‘‘కుదరదు. నువ్వు మరణించవలసిందే’’ తీర్మానించాయి సీతాకోక చిలకలు.‘‘నేను మీ కంటే బాగా పాడగలను, నాట్యం చెయ్యగలను, మంచి మకరందాన్ని సంపాదించగలను. నేను చెయ్యలేనిది ఒక్కటే. మీ అంత బాగా ఎగరలేను. ఎగరటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. కొద్ది రోజులలో నేను సాఽధించగలను. అప్పటివరకు నాకు గడువు ఇవ్వండి’’ పాపం దయనీయంగా వేడుకుంటోంది ఆ సీతాకోక చిలక.‘‘నువ్వు మాలాగా లేవు. మాలో వుండటానికి నీకు అర్హత లేదు. నువ్వు చనిపోవలసిందే’’ మిగిలిన సీతాకోక చిలకలు అన్ని వైపుల నుంచి దాని పైన దాడిని మొదలుపెట్టాయి.కొన్ని దాని కాళ్లను విరగ్గొట్టాయి. కొన్ని దాని రెక్కలను ముక్కలు చేసాయి.‘అయ్యో చంపొద్దు. దయచేసి దాన్ని చంపొద్దు. అయ్యో చంపేస్తున్నారు... అయ్యో... అయ్యో....’ఫఫఫనెమ్మదిగా కళ్లు తెరిచాను. తెల్లవారు జాము అయినట్టుంది. ఎదురుగా గోడమీద క్యాలెండరు కాగితం రెపరెపలాడుతోంది. ఎక్కడ ఏం జరిగినా తనకేమీ పట్టనట్టుగా సాగిపోతున్న కాలాన్ని అంకెల్లో, అక్షరాల్లో పట్టి చూపెడుతోంది. ‘1970 ఆగస్టు 4’ నా ప్రమేయం లేకుండానే నా కళ్లు కాలాన్ని చదివేసాయి.