వేసవి కాలం.అదివారం తెలతెలవారుతోంది.వాతావరణం ప్రశాంతంగా వుంది. కిటికీలో నుంచీ కమ్మతెమ్మెర వీస్తోంది. ప్రాణానికి హాయిగా వుంది. పక్కన పెరట్లో, మామిడి కొమ్మమీద ‘కలమంత్ర పరాయణుడైన కోకిల స్వామి’.... కాకులు. నిద్రలేచి పదినిముషాలు ఈ ఆహ్లాదాన్ని అనుభవిస్తూనే ఉండిపోయాడు గోపాలం.రాధమ్మ వచ్చింది. తూరుపు గాలిలా వచ్చింది.అప్పటికపడే అమె స్నానం, పూజ అయినాయి. కుందనపు కుంకుమ బరిణలా వుంది. హారతిలో దీపకళికలా వుంది. తదేకంగా ఆమెనే చూసిన గోపాలం అవ్యక్తమైన అనుభూతితో సన్నగా ఈల వేశాడు. ‘గుడ్‌ మాణింగ్‌’ చెప్పాడు. ఆమె పెదవులపై విరిసీ విరియని నవ్వుని పంచింది.కళ్ళు చికిలిస్తూ ‘లేచారా?’ అంటూ, ‘‘త్వరగా తయారుకావాలి. చిక్కడపల్లి వెంకటేశ్వ రాలయంలో కళ్యాణం చెప్పాను. టికెట్‌ రెడీ. ఎనిమిది, ఎనిమిదిన్నరకి వెళ్లాలి. అదీ ఇవ్వాళ మన మొదటి కార్యక్రమం’’ అంది.‘‘ఏం విశేషం?’’ కొంచెం ఆశ్చర్యంతోనే అడిగాడు.‘‘పెళ్ళిరోజు శుభాకాంక్షలు. పాతికేళ్ళు...’’ అని చేయి కలిపింది.‘‘థాంక్యూ... మీకూ అవే... అవే’’ హుషారుగా అన్నాడు.రాథమ్మ నవ్వింది. కళ్లు మిలమిలా మెరిశాయి. ఇందాకటి కన్నా కూడా ఎంతో బావుంది అనుకున్నాడు గోపాలం. అందమైన భార్య అనిపించిన ఆత్మముగ్థత్వం మనసుని పరవశింపచేసింది.

గాలికి ఊగిన జలతారు తెరలా కదిలి, కదిలి వెళ్లింది రాధమ్మ.గోపాలమూ కదిలాడు.కళ్యాణం కార్యక్రమం ముగిసి ఇంటికి వచ్చే సరికీ పదకొండున్నర అయింది. దారిలో ఆటోలో చెప్పింది రాధమ్మ, ‘‘ఈ రోజల్లా మీరు నా కంట్రోల్‌లో ఉంటారు. నేనేం చెప్తే అది వింటారు, నేనేం చెయ్యమంటే అది చేస్తారు. నో అడ్డు ప్రశ్నలు...నో ఎంక్వయిరీలు!’’క్షణంసేపు నివ్వెరపోయి, తెప్పరిల్లి ‘‘ఓకె... ఓకె..’’ అన్నాడు గోపాలం. ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు సరదాగా.ప్రసాదం తిని ఆనాటి పేపర్‌ తీశాడు గోపాలం. వంటింట్లో నుంచే మందలింపుగా అన్నది రాధమ్మ ‘‘ఈ రోజు నో పేపర్‌ రీడింగ్‌. మనసు పాడుచేసు కోకూడదు. తీసేయండి’’‘‘వామ్మో...చాలాదాకా వుందే ఆర్డరు...’’ అని మురిపెంగా మనసులో అనుకుని, పైకేమో ‘‘ఐ లైకిట్‌’’ అన్నాడు. ఏదో ఇంద్రజాలానికి లోనైన వాడిలా ఠక్కున పేపర్‌ని పక్కని పడేసి ‘‘చిత్తం... చెప్పండి’’ అన్నాడు కొంటెగా.