‘‘ఆఁ... ఇప్పుడు చెప్పండి. ఆరు నెలలు పరస్పరం ప్రేమించుకుని మరో ఆరు నెలలు అటూఇటూ పెద్దవాళ్లను ఒప్పించేందుకు పోరాడి, ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని సంసారం చేసుకుంటోన్న మీ మధ్య అసలు గొడవలెలా వచ్చాయి?!మీ ఇద్దరి వాదనలూ పూర్తయేటంతవరకూ నేనేమీ మాట్లాడను. చెప్పాల్సిందేఁవైనా ఉందనిపిస్తే చివర్లో చెప్తాను. మీ పెళ్లి జరగడంలో నా పాత్ర కూడా గణనీయమైనదే అని మీరూ, మీతో పాటూ నేనూ నమ్ముతున్నాను కనుక మీరిద్దరూ పిలిస్తే రావడం నా బాధ్యతగా భావించి వచ్చాను. ఊ.... కానివ్వండి.. ముందెవరు చెప్తారు..? సరే... అదీ నేనే చెప్తాను. చెల్లెమ్మా... నువ్వు ప్రారంభించు’’ అన్నాడు వెంగళయ్య.

ఓసారి భర్తవైపు తీక్షణంగా చూసి సమరానికి శంఖం పూరించిన చందంగా పొడి దగ్గు దగ్గడం ద్వారా గొంతు సవరించుకుని ‘‘మీ బావగారు నీకు స్నేహితుడు కాకపోయి ఉండుంటే, నేను మీ ఇంట్లో ఉండి చదువుకునే రోజుల్లో నిన్ను కల్సుకునే మిషతో నన్ను చూసేందుకు రోజూ ఆయన మనింటికి రాకుండా ఉండి ఉంటే, అలా వచ్చినంత మాత్రాన ఆయన చూపుల్లో నేను చూపులు కలపకపోయి ఉండుంటే, ఒకవేళ చూపులు కలిపినా ఆయన మాయమాటల వలలో నేను చిక్కుకోకుండా ఉండి ఉంటే, ఆ తర్వాత పెద్దవాళ్ళు వద్దని వారించినా వినకుండా పోరాడి ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే..’’ అంటోన్న చండికను ఆగమన్నట్టు సైగచేసి వెంగళయ్య వైపు చూస్తు.‘‘మనిద్దరం సహాధ్యాయులం కాకపోయి ఉంటే, సహాధ్యాయులమైనా నేను నిన్ను కల్సుకుందుకు మీ ఇంటికి తరచూ రాకుండా ఉండుంటే..ఒకవేళ వచ్చినా అదే సమయంలో మీ చెల్లెలు చండిక తన కాలేజీ చదువు వెలగ బెట్టేందుకు మీ ఇంట్లో మకాం పెట్టకుండా ఉండి ఉంటే, ఒకవేళ ఉన్నా, నా వైపు తను ఓరచూపులు చూడకుండా ఉండి ఉంటే, మా ఇద్దరికీ ఏకాంతం కలిగించేందుకు మనం ముగ్గురమూ అప్పుడప్పుడు బయటికి వెళ్లినప్పుడు, మాకేదో ఉపకారం చేస్తున్నాననే మిషతో మా కర్మకు మమ్మల్ని వదిలేసి నువ్వు బీచ్‌లో తిరిగే అమ్మాయిలకు సైటు కొట్టేందుకు అలాఅలా తిరిగి కాస్సేపు కాలక్షేపం చేయకుండా ఉండి ఉంటే, మీ చెల్లెలి గేలానికి నేను చిక్కుకోకుండా ఉండి ఉంటే, ఆ తర్వాత ఆ గేలం నుంచి నన్ను బయటకు లాగాలని మా వాళ్లు చేసిన ప్రయత్నాల్ని నేను వమ్ము చేయకుండా ఉండి ఉంటే, ఈనాడీ పరిస్థితి...’’ అంటోన్న ఉద్దాలకుడి మాటలకు అడ్డుతగిలి ‘‘హూ... చూశావా... నేనీయనకు గేలం వేశానట... ఇంతటి సుగుణాభిరాముడూ, జగదేక సుందరుడూ నాకెవరూ దొరకరనీ..’’ అని ఇంకా ఏదో మాట్లాడబోతోన్న చండికను ఆగమన్నట్టు సైగచేసి అన్నాడు వెంగళయ్య.